నండూరి రామమోహనరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నండూరి రామమోహనరావు
నండూరి రామమోహనరావు
జననంనండూరి రామమోహనరావు
ఏప్రిల్ 24, 1927
విస్సన్నపేట, కృష్ణాజిల్లా
మరణంసెప్టెంబర్ 3, 2011
విజయవాడ
మరణ కారణంమల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌
ఇతర పేర్లుపాత్రికేయ భీష్ముడు,
వృత్తి"జన్మభూమి" పత్రికలో సబెడిటర్
ప్రసిద్ధితెలుగు పాత్రికేయరంగ ప్రముఖులు,అభ్యుదయవాది, ‘ఆంధ్రజ్యోతి’ పూర్వ సంపాదకుడు
భార్య / భర్తరాజేశ్వరి
బంధువులునండూరి పార్థసారథి (సోదరుడు)

నండూరి రామమోహనరావు (ఏప్రిల్ 22, 1927- సెప్టెంబర్ 3, 2011) తెలుగు పాత్రికేయరంగ ప్రముఖులు. పాత్రికేయునిగానే కాక, రచయితగా కూడా పేరొందాడు. చాలాకాలం పాటు ఆంధ్రజ్యోతి పత్రిక సంపాదక బాధ్యతలు నిర్వహించారు. "బాల" అన్న పత్రికలోనూ, ఆంధ్రపత్రిక లోనూ 1940 వ దశకంలో వీరి రచనలు ఎన్నో ప్రచురింపబడ్డాయి. "నరావతారం", "విశ్వరూపం" ఈయన ప్రముఖ రచనలు. సామాన్య జనాలకు సైన్సు సంగతులు పరిచయం చేయడంలో వీరి కృషి ఎన్నదగ్గది. ఇవికాక వీరు ఆంధ్రపత్రికలో మార్క్ ట్వేయిన్ నవలలకు తెలుగు అనువాదాలు కూడా చేసారు.

జీవితం

[మార్చు]

నండూరి రామ్మోహనరావు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఆరుగొలను గ్రామంలో 1927, ఏప్రిల్ 24 న జన్మించారు.1937-42 మధ్య నూజివీడు, మచిలీపట్నం లలో ఉన్నత పాఠశాల విద్యనభ్యసించారు. రాజమండ్రి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో 1942-47 మధ్య చదువుకున్నారు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థిగా ఉండగానే ‘విజ్ఞానం’ అనే లిఖిత పత్రికను నడిపారు. నండూరి తన 21వ ఏటనే పాత్రికేయుడిగా తన ప్రస్థానం ప్రారంభించారు. 1944 ఏప్రిల్ 30 వ తేదీన మేనమామ కూతురు రాజేశ్వరిని వివాహమాడారు. కొన్నాళ్ళు ఋషీకేశంలో ఉన్నారు. ఆ తరువాత 1947లో కొన్ని నెలలు ఉదయభారతి గురుకులంలో పనిచేశాక, "జన్మభూమి" అన్న పత్రికలో సబ్ ఎడిటర్ ఉద్యోగంలో చేరారు. 1948-1960 మధ్యలో వివిధ స్థాయిల్లో "ఆంధ్రపత్రిక"లో పనిచేశారు. 1960-1994 దాకా ఆంధ్రజ్యోతి పత్రికలో వివిధ స్థాయుల్లో పని చేసి, సంపాదకులు గా పదవీ విరమణ చేశారు. ఆ సమయంలోనే "జ్యోతిచిత్ర", "వనితాజ్యోతి", "బాలజ్యోతి" వంటి పత్రికలకు వ్యవస్థాపక సంపాదకులుగా ఉన్నారు.

అతను జర్నలిస్టు జీవితం ‘ఆంధ్రపత్రిక’లో ప్రారంభమైంది. 1948 నుంచి 1960 వరకు అతను ‘ఆంధ్ర పత్రిక’లో పనిచేశారు. 1960లో సహ సంపాదకుడి హోదాలో ‘ఆంధ్రజ్యోతి’లో అడుగు పెట్టారు.1960 నుంచి 1994 దాకా… అంటే 34 సంవత్సరాల కాలం అతను ‘ఆంధ్రజ్యోతి’లో అక్షర యాత్ర చేశారు. అతను ఎంతో మందిని పాత్రికేయులుగా తీర్చి దిద్దారు. సూటిగా, సరళంగా ఉండే అతను సంపాదకీయాలు పాఠకులపై మంచి ప్రభావం చూపేవి. తొలితరం సంపాదకుడు నార్ల వెంకటేశ్వర రావుతో కలసి పని చేశారు. నార్ల నిష్క్రమణ అనంతరం 1980 లో నండూరి రామమోహనరావు ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకుడిగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు. అతను 1962, 1978, 1984, 1992 లలో అమెరికా లోను, 1982లో రష్యా లోను పర్యటించారు.

అనువాద హనుమంతుడు

[మార్చు]

బాపు – రమణలు నండూరిని ‘అనువాద హనుమంతుడు’ అని కొనియాడారు. సుప్రసిద్ధ ఆంగ్ల రచనలను అచ్చ తెలుగులో, అందరికీ నచ్చేలా, తనదైన ప్రత్యేక శైలిలో అనువదించడమే దీనికి కారణం. మార్క్‌ట్వేయిన్ రచించిన టామ్ సేయర్, హకిల్ బెరిఫిన్‌లను అవే పేర్లతో అనువదించారు. మార్క్‌ట్వేయిన్ మరో రెండు రచనలను రాజు – పేద, విచిత్ర వ్యక్తి పేరిట అనువదించారు. అలాగే… కాంచన ద్వీపం (రాబర్ట్ స్టీవెన్‌సన్) అనే మరో అనువాద రచన కూడా చేశారు.

61 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ ఆ పుస్తకాలకు ఆదరణ ఉండడం విశేషం. నండూరి ఖగోళ, భౌతిక శాస్త్రాలను పరిశోధించి ‘విశ్వరూపం’ అనే పుస్తకం రచించారు. మానవాళి పరిణామ క్రమానికి సంబంధించిన నరావతారం, తత్త్వశాస్త్రాన్ని సులువుగా వివరించే ‘విశ్వ దర్శనం’ అతను కలం నుంచి జాలువారినవే. నండూరి.. సవ్యసాచి పేరుతో రాజకీయ వ్యంగ్య రచనలు, హరివిల్లు పేరుతో బాల గేయాలు, ఉషస్విని పేరిట కవితలు రచించారు. కథా గేయ సుధానిధి (లేదా యూసఫ్?) కూడా అతను రచనే.

మిత్రలాభం, మిత్ర భేదం (పంచతంత్ర కథలు) పేరిట బాపు వేసిన బొమ్మలకు నండూరి మాటలను అందించారు. ఇంద్రగంటి శ్రీకాంత శర్మతో కలిసి ‘మహా సంకల్పం’ అనే సంకలనాన్ని వెలువరించారు. సంపాదకీయాల సంకలనం అను పల్లవి, చిరంజీవులు, వ్యాఖ్యావళి అతను ఇతర రచనలు. నండూరి రామమోహనరావు రాసిన ఐదు పుస్తకాలను న్యూస్టూడెంట్ బుక్ సెంటర్ ఆధినేత బాబ్జీ ప్రచురించి 2006 మే 9వ తేదీన ఆవిష్కరించారు. వీటిని పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు, కళాప్రపూర్ణ మిక్కిలినేని రాధాకృష్ణ, స్వాతంత్ర్య సమరయోధుడు పరకాల పట్టాభిరామారావు, పాత్రికేయులు వీరాజీ, ఎస్.ప్రకాశరావులు ఆవిష్కరించారు. ఆ రోజున నండూరి రామమోహనరావును సత్కరించారు.

హేమాహేమీలతో అనుబంధం

[మార్చు]

నండూరి రామమోహనరావుకు అనేకమంది ప్రముఖ పాత్రికేయులు, రచయితలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆంధ్రపత్రికలో పనిచేస్తున్నపుడు వారపత్రికకు సంబంధించి కొడవటిగంటి కుటుంబరావు, పండితారాధ్యుల నాగేశ్వరరావు, తెన్నేటి సూరి, పిలకాగణపతిశాస్త్రి వంటి హేమాహేమీలతో సాహిత్యంపై చర్చించేవారు. ఆంధ్రపత్రిక వీక్లీలో ఆంగ్ల రచనలను తెలుగులోకి అనువదించి ప్రచురించాలని సంకల్పించినప్పుడు… అనువాద బాధ్యతలను నండూరికే అప్పగించారు. సాహితీ వేత్తలు ఆరుద్ర, శ్రీశ్రీ లతోపాటు ‘ఆంధ్రజ్యోతి’ పూర్వ సంపాదకుడు రామచంద్రమూర్తి, ప్రస్తుత సంపాదకుడు కె.శ్రీనివాస్‌లతో నండూరికి అనుబంధం ఉంది.

రచనలు

[మార్చు]

అనువాదాలు

[మార్చు]
  • కాంచన ద్వీపం (ఆర్.ఎల్.స్టీవెన్సన్ ట్రెజర్ ఐలాండ్ కి తెలుగు అనువాదం)
  • కథాగేయ సుధానిధి (మూలం:ఏసోప్స్ ఫేబుల్స్)
  • టామ్ సాయర్ (మూలం: మార్క్ ట్వేన్ నవల - అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్)
  • హకిల్బెరీ ఫిన్ (మూలం: మార్క్ ట్వేన్ నవల - అడ్వెంచర్స్ ఆఫ్ హకిల్బెరీ ఫిన్)
  • రాజు-పేద (మూలం: మార్క్ ట్వేన్ రచన - ప్రిన్స్ అండ్ పాపర్)
  • టామ్ సాయర్ ప్రపంచయాత్ర (మూలం: మార్క్ ట్వేన్ రచన - టామ్సాయర్ అబ్రాడ్)
  • విచిత్ర వ్యక్తి (మూలం: మార్క్ ట్వేన్ రచన - మిస్టీరియస్ స్ట్రేంజర్)
  • బాలరాజు (ఆస్కార్ వైల్డ్ కథలు తెలుగు అనువాదం)

అవార్డులు

[మార్చు]
  • అభినందన (హైదరాబాదు) సంస్థ నుంచి ముట్నూరి కృష్ణారావు అవార్డు (1988).
  • జూలూరి నాగరాజారావు (హైదరాబాదు) స్మారక అవార్డు (1989)
  • మద్రాసు తెలుగు అకాడెమీ “ఉగాది వెలుగు” అవార్డు (1989)
  • కళాసాగర్ (మద్రాసు) అవార్డు
  • అభిరుచి (ఒంగోలు) సంస్థ వారి “పాత్రికేయ రత్న” అవార్డు.
  • “జమీన్ రైతు” వజ్రోత్సవంలో నెల్లూరి వెంకట్రామానాయుడు స్మారక అవార్డు (1990)
  • ఆలూరి నారాయణరావు స్మారక ట్రస్టు (విజయవాడ) వారి సి.వై.చింతామణి అవార్డు
  • తెలుగు యూనివర్సిటీ వారి ఆనరరీ డాక్టరేట్ (1991)
  • అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారి “శిరోమణి” అవార్డు (1992)
  • క్రాంతి విద్యా సంస్థల (విజయవాడ) నుంచి ఉత్తమ జర్నలిస్టు అవార్డు (1994)
  • రామకృష్ణ జైదయాళ్ హార్మొనీ అవార్డు (1994)
  • సిద్ధార్త కళా పీఠం (విజయవాడ) వారి విశిష్ట వ్యక్తి అవార్డు (1994)
  • ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వపు ఉత్తమ జర్నలిస్టు అవార్డు (1996)
  • తెలుగు యూనివర్సిటీ వారి “తాపీ ధర్మారావు స్మారక అవార్డు” (1997)
  • అప్పాజోస్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్ వారి “ప్రతిభామూర్తి” అవార్డు (1998)

మూలాలు/సంప్రదింపు లంకెలు

[మార్చు]

నండూరి రామ్మోహనరావు జీవిత విశేషాలు - పుస్తకం.నెట్ వ్యాసం (https://web.archive.org/web/20111003090802/http://pustakam.net/?p=8125)


మూలాలు

[మార్చు]
  1. రామమోహనరావు, నండూరి. చిరంజీవులు. విజయవాడ: నవోదయ పబ్లిషర్స్. Retrieved 2020-07-12.