క్విట్ ఇండియా ఉద్యమం
క్విట్ ఇండియా ఉద్యమం, బ్రిటిషు పాలనను అంతం చేయాలని డిమాండ్ చేస్తూ, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో 1942 ఆగస్టు 8 న మహాత్మా గాంధీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బాంబే సమావేశంలో ప్రారంభించిన ఉద్యమం. దీనిని ఆగస్టు ఉద్యమం అని కూడా అంటారు.[1]
క్రిప్స్ మిషన్ విఫలమైంది, 1942 ఆగస్టు 8 న, బొంబాయిలో గోవాలియా ట్యాంక్ మైదానంలో చేసిన క్విట్ ఇండియా ప్రసంగంలో గాంధీ డూ ఆర్ డై కి పిలుపునిచ్చాడు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ భారతదేశం నుండి "క్రమబద్ధమైన బ్రిటిషు ఉపసంహరణ" కోరుతూ భారీ నిరసనను ప్రారంభించింది. యుద్ధంలో మునిగి ఉన్నప్పటికీ, దీనిపై చర్య తీసుకోవడానికి బ్రిటిషు ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. గాంధీ ప్రసంగించిన గంటల్లోనే భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వం మొత్తాన్నీ విచారణనేది లేకుండా జైల్లో వేసింది. వీళ్ళలో చాలా మంది యుద్ధం ముగిసేదాకా జైలులోనే, ప్రజలతో సంబంధం లేకుండా గడిపారు. ఆల్ ఇండియా ముస్లిం లీగ్, రాచరిక సంస్థానాలు, ఇండియన్ ఇంపీరియల్ పోలీస్, బ్రిటిషు ఇండియన్ ఆర్మీ, హిందూ మహాసభ, ఇండియన్ సివిల్ సర్వీస్, వైస్రాయ్ కౌన్సిల్ (ఇందులో ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు) లు బ్రిటిషు వారికి మద్దతుగా నిలిచాయి. యుద్ధకాలంలో జరుగుతున్న భారీ వ్యయం నుండి లాభం పొందుతున్న భారతీయ వ్యాపారవేత్తలు చాలామంది, క్విట్ ఇండియా ఉద్యమానికి మద్దతు ఇవ్వలేదు. చాలామంది విద్యార్థులు అక్ష రాజ్యాలకు మద్దతు ఇస్తూ బహిష్కరణలో ఉన్న సుభాస్ చంద్రబోస్ పట్ల ఎక్కువ ఆసక్తి చూపారు. ఈ ఉద్యమానికి బయటి మద్దతు అమెరికన్ల నుండి మాత్రమే వచ్చింది. కొన్ని భారతీయ డిమాండ్లను అంగీకరించమని అమెరికా ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్‌ను వత్తిడి చేసాడు. క్విట్ ఇండియా ఉద్యమాన్ని బ్రిటిషు ప్రభుత్వం సమర్థవంతంగా అణిచివేసింది.[2] వెంటనే స్వాతంత్ర్యం ఇవ్వడానికి బ్రిటిషు వారు నిరాకరించారు. యుద్ధం ముగిసాక చూద్దాం లెమ్మన్నారు.
దేశవ్యాప్తంగా చిన్న తరహా హింస జరిగింది. బ్రిటిషు వారు పదివేల మంది నాయకులను అరెస్టు చేసి, వారిని 1945 వరకు జైల్లోనే ఉంచారు. భారీగా అణచివేయడం వలన, బలహీనమైన సమన్వయం వలన, స్పష్టమైన చర్య యొక్క కార్యక్రమం లేకపోవడం వల్లా తక్షణ లక్ష్యాల పరంగా క్విట్ ఇండియా ఉద్యమం విఫలమైంది. అయితే, రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన ఖర్చు కారణంగా భారతదేశాన్ని ఇక నియంత్రణలో పెట్టలేమని బ్రిటిషు ప్రభుత్వం గ్రహించింది. మర్యాద కోల్పోకుండా, శాంతియుతంగా ఎలా నిష్క్రమించాలనేది యుద్ధానంతరం వారి కెదురుగా నిలుచున్న ప్రశ్న.
క్విట్ ఇండియా ఉద్యమం యొక్క స్వర్ణోత్సవానికి గుర్తుగా 1992 లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1 రూపాయి స్మారక నాణెం జారీ చేసింది.[3]
రెండవ ప్రపంచ యుద్ధం, భారత ప్రమేయం
[మార్చు]1939 లో, భారత జాతీయవాదులు బ్రిటిషు గవర్నర్ జనరల్ లార్డ్ లిన్లిత్గో తమతో సంప్రదించకుండా భారతదేశాన్ని యుద్ధంలోకి దించాడని కోపంగా ఉన్నారు. ముస్లిం లీగ్ యుద్ధానికి మద్దతు ఇచ్చింది, కాని కాంగ్రెసులో భిన్నాభిప్రాయాలున్నాయి.
యుద్ధం ప్రారంభమైనప్పుడు, 1939 సెప్టెంబరులో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్-కమిటీ వార్ధా సమావేశంలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానంలో ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాటానికి షరతులతో మద్దతు ఇచ్చింది, [4] దానికి ప్రతిగా వారు స్వాతంత్ర్యం కోరినప్పుడు మాత్రం బ్రిటిషు వారు తిరస్కరించారు.
ఈ యుద్ధం సమ్రాజ్యవాదుల వలసరాజ్యాలను పరిరక్షించుకోవడం కోసమే అయితే, భారతదేశం దాన్ని పట్టించుకోదు. ఈ పోరు ప్రజాస్వామ్యం, ప్రజాస్వామిక ప్రపంచం కోసం అయితే భారతదేసం దానిపై అత్యంత ఆసక్తి ఉంది, గ్రేట్ బ్రిటన్ పోరాడేది ప్రజాస్వామ్యం కోసమే అయితే, అది తన సామ్రాజ్యవాదాన్ని వదిలేసి, భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం ఇవ్వాలి. భారతీయులకు స్వీయ నిర్ణయాధికారం ఉంది. స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య భారతదేశం పరస్పర రక్షణకు, ఆక్రమణలకు వ్యతిరేకంగా, ఆర్థిక సహకారం కోసం ఇతర స్వేచ్ఛా దేశాలతో కలిసి పనిచేస్తుంది..[5]
గాంధీ ఈ ప్రయత్నానికి మద్దతు ఇవ్వలేదు. అతను యుద్ధానికి ఆమోదం తెలుపలేకపోయాడు (అతను అహింసాయుత ప్రతిఘటనపై నిబద్ధత గలవాడు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో దాన్నే ఉపయోగించాడు. అడాల్ఫ్ హిట్లర్, బెనిటో ముస్సోలిని, హిడేకి టోజోకు లకు వ్యతిరేకంగా కూడా దాన్నే ప్రతిపాదించాడు). అయితే, బ్యాటిల్ ఆఫ్ బ్రిటన్ తీవ్రంగా జరుగుతూండగా, జాత్యహంకారానికి వ్యతిరేకంగా బ్రిటిషు యుద్ధ ప్రయత్నాలకు గాంధీ తన మద్దతును ప్రకటించాడు. బ్రిటన్ చితి లోంచి వచ్చే స్వతంత్ర భారతదేశాన్నితాను కోరుకోవడంలేదని అతడు పేర్కొన్నాడు. అయితే, దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి. భారతదేశంలో పెట్టుబడులను పరిమితం చేసి, దేశాన్ని కేవలం ఒక మార్కెట్గా, ఒక ఆదాయ వనరుగా మాత్రమే ఉపయోగించుకోవడం దీర్ఘకాలిక బ్రిటిషు విధానం. అందుచేత భారత సైన్యం సాపేక్షంగా బలహీనంగా ఉండేది. ఆయుధాలు తక్కువగా ఉండేవి, సైనికులకు సరైన శిక్షణ ఉండేది కాదు. బ్రిటిషు వారు భారతదేశ బడ్జెట్‌కు నిధులు చేకూర్చాల్సి వచ్చింది. పన్నులు బాగా పెరిగాయి. ధరలు రెట్టింపు అయ్యాయి.
యుద్ధం ప్రారంభమైన తరువాత, నిర్ణయాత్మక చర్య ఎవరైనా తీసుకున్నారూ అంటే అది సుభాస్ చంద్రబోస్ నేతృత్వంలోని బృందం ఒక్కటి మాత్రమే. బోస్ జర్మనీలో ఇండియన్ సైనిక దళాన్ని స్థాపించాడు. జపనీయుల సహాయంతో ఇండియన్ నేషనల్ ఆర్మీని పునర్వ్యవస్థీకరించాడు. అది అక్షరాజ్యాల నుండి సహాయం కోరింది, బ్రిటిషు అధికారులపై గెరిల్లా యుద్ధం నిర్వహించింది.
క్రిప్స్ రాయబారం
[మార్చు]1942 మార్చి లో, ఉపఖండంలో అసంతృప్తి పెరగడం, యుద్ధంలో అయిష్టంగానే పాల్గొనడం, ఐరోపాలో యుద్ధ పరిస్థితులలో క్షీణత, భారత దళాలలో, ముఖ్యంగా ఆఫ్రికాలో, ఉపఖండంలోని జనాభాలో పెరుగుతున్న అసంతృప్తి లను గమనించిన బ్రిటిషు ప్రభుత్వం, హౌస్ ఆఫ్ కామన్స్ నాయకుడు స్టాఫోర్డ్ క్రిప్స్ ఆధ్వర్యంలో భారతదేశానికి ఒక ప్రతినిధి బృందాన్ని పంపింది. అదే క్రిప్స్ రాయబారం. యుద్ధ సమయంలో సంపూర్ణ సహకారాన్ని అందించటానికి, అందుకు ప్రతిగా అధికారాన్ని దశలవారీగా రాచరికం నుండి, వైస్రాయి నుండి ఎన్నికైన శాసన సభకు పంపకం చెయ్యడంపై భారత జాతీయ కాంగ్రెస్తో చర్చలు జరపడం ఈ రాయబారం ఉద్దేశం. చర్చలు విఫలమయ్యాయి, ఎందుకంటే కాంగ్రెసు ముఖ్య డిమాండ్లైన స్వపరిపాలనకు ఒక టైమ్‌టేబుల్ గానీ, విడిచిపెట్టవలసిన అధికారాల నిర్వచనం గానీ క్రిప్సు రాయబారం చెప్పలేదు. ముఖ్యంగా భారత ఉద్యమానికి ఏమాత్రం ఆమోదయోగ్యం కాని పరిమితమైన అధినువేశ ప్రతిపత్తిని మాత్రమే ప్రతిపాదించింది.[6]
ఉద్యమం ప్రారంభించటానికి కారణమైన అంశాలు
[మార్చు]1939 లో, జర్మనీ, బ్రిటన్ ల మధ్య యుద్ధం చెలరేగడంతో, భారతదేశం బ్రిటిషు సామ్రాజ్యంలో ఒక భాగం కావడం వలన యుద్ధానికి ఒక పార్టీగా మారింది. ఈ ప్రకటన తరువాత, 1939 అక్టోబరు 10 న జరిగిన సమావేశంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, జర్మన్ల దూకుడు చర్యలను ఖండిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అదే సమయంలో, బ్రిటిషు వారు ముందు తమతో సంప్రదింపులు జరపకపోతే భారతదేశాన్ని యుద్ధంతో ముడిపెట్టలేరని ఈ తీర్మానం పేర్కొంది. ఈ ప్రకటనపై స్పందిస్తూ, వైస్రాయ్ అక్టోబరు 17 న ఒక ప్రకటన విడుదల చేశాడు. దీనిలో ప్రపంచంలో శాంతిని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో బ్రిటన్ యుద్ధాన్ని నిర్వహిస్తోందని పేర్కొన్నాడు. యుద్ధం తరువాత, భారతీయుల కోరికలకు అనుగుణంగా ప్రభుత్వం 1935 చట్టంలో మార్పులను ప్రారంభిస్తుందని అతడు పేర్కొన్నాడు.
ఈ ప్రకటనపై గాంధీ స్పందిస్తూ, "విభజించు, పాలించు అనే పాత విధానాన్నే కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ రొట్టె కోరితే, వాళ్ళు రాయి ఇచ్చారు" అన్నాడు. హైకమాండ్ జారీ చేసిన సూచనల మేరకు వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ మంత్రులను ఆదేశించారు. ఎనిమిది రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ మంత్రులు ఈ సూచనలను అనుసరించి రాజీనామా చేశారు. మంత్రుల రాజీనామా ముస్లిం లీగ్ నాయకుడు మొహమ్మద్ అలీ జిన్నాకు ఎంతో ఆనందాన్ని, సంబరాన్నీ కలిగించింది. అతను 1939 డిసెంబరు 22 రోజును 'విమోచన దినం' అని పిలిచాడు. ఈ రోజు వేడుకలు జరపవద్దని జిన్నాను గాంధీ కోరాడు గానీ, అయితే అది నిష్ఫలమైంది. 1940 మార్చిలో జరిగిన ముస్లిం లీగ్ లాహోర్ సెషన్‌లో జిన్నా అధ్యక్ష ప్రసంగం చేస్తూ, దేశ ముస్లింలు ప్రత్యేక మాతృభూమి పాకిస్థాన్‌ను కోరుకుంటున్నట్లు ప్రకటించాడు.
ఈలోగా, ఇంగ్లాండులో కీలకమైన రాజకీయ సంఘటనలు జరిగాయి. చాంబర్‌లైన్ తరువాత చర్చిల్ ప్రధానమంత్రి అయ్యాడు. ఇంగ్లాండ్‌లో అధికారాన్ని చేపట్టిన కన్జర్వేటివ్‌లకు కాంగ్రెస్ చేసిన వాదనలపై సానుభూతి వైఖరి లేదు. యుద్ధ పరిస్థితులు మరింత దిగజారుతున్న పరిస్థితుల్లో, తప్పనిసరై, భారతీయులను శాంతింపచేయడానికి, కన్జర్వేటివ్‌లు భారతీయులు చేసిన కొన్ని డిమాండ్లను అంగీకరించవలసి వచ్చింది. ఆగస్టు 8 న, వైస్రాయ్ ఒక ప్రకటనను విడుదల చేశారు, దీనిని " ఆగస్టు ఆఫర్ " అని పిలుస్తారు. అయితే, ఆ ఆఫర్‌ను కాంగ్రెస్ తిరస్కరించింది. ఆ తరువాత ముస్లిం లీగ్ కూడా తిరస్కరించింది.
కాంగ్రెస్ చేసిన డిమాండ్లను తిరస్కరించడం పట్ల విస్తృతంగా ఉన్న అసంతృప్తి నేపథ్యంలో, వార్ధాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో గాంధీ వ్యక్తిగత శాసనోల్లంఘనను ప్రారంభించే ప్రణాళికను వెల్లడించారు. బ్రిటిషు వారికి వ్యతిరేకంగా క్రూసేడ్ చేయడానికి ఉత్తమ మార్గంగా అతడు ఎంచుకున్న సత్యాగ్రహ ఆయుధం మరోసారి ప్రజాదరణ పొందింది. బ్రిటిషు వారి దృఢ వైఖరికి వ్యతిరేకంగా దీనిని నిరసన చిహ్నంగా విస్తృతంగా ఉపయోగించారు. ఉద్యమాన్ని ప్రారంభించడానికి గాంధీ తన అనుచరుడైన వినోబా భావేను ఎంపిక చేశాడు. యుద్ధ వ్యతిరేక ఉపన్యాసాలు దేశంలో మూలమూలనా ప్రతిధ్వనించాయి. యుద్ధ ప్రయత్నాలలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వవద్దని సత్యాగ్రహులు దేశ ప్రజలకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసారు. ఈ సత్యాగ్రహ ప్రచారం యొక్క పర్యవసానంగా దాదాపు పద్నాలుగు వేల మంది సత్యాగ్రహులను బ్రిటిషు ప్రభుత్వం అరెస్టు చేసింది. 1941 డిసెంబరు 3 న, వైస్రాయ్ సత్యాగ్రహులందరినీ నిర్దోషులుగా ప్రకటించాడు. పెర్ల్ హార్బరుపై జపాన్ దాడితో ఐరోపాలో యుద్ధ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. వారి కార్యక్రమాన్ని సమీక్షించుకోవలసిన అవసరాన్ని కాంగ్రెస్ గ్రహించింది. అనంతరం ఉద్యమాన్ని ఉపసంహరించుకుంది.
క్విట్ ఇండియా ఉద్యమానికి గాంధీ పిలుపునివ్వడంలో క్రిప్స్ మిషన్, దాని వైఫల్యం కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించాయి. 1942 మార్చి 22 న ప్రతిష్టంభనను అంతం చేఏందుకు గాను, భారత రాజకీయ పార్టీలతో మాట్లాడటానికి, బ్రిటన్ యొక్క యుద్ధ ప్రయత్నాలకు మద్దతును పొందటానికీ బ్రిటిషు ప్రభుత్వం సర్ స్టాఫోర్డ్ క్రిప్స్‌ను పంపింది. బ్రిటిషు ప్రభుత్వపు ముసాయిదా ప్రకటనను సమర్పించారు. ఇందులో డొమినియన్ స్థాపన, రాజ్యాంగ సభ ఏర్పాటు, ప్రత్యేక రాజ్యాంగాలను రూపొందించడానికి రాష్ట్రాల హక్కు వంటి పదాలు ఉన్నాయి. అయితే, ఇవి రెండవ ప్రపంచ యుద్ధం ఆగిపోయిన తరువాత మాత్రమే. కాంగ్రెస్ ప్రకారం, ఈ ప్రకటన భారతదేశానికి భవిష్యత్తులో నెరవేర్చే వాగ్దానాన్ని ఇచ్చింది. దీనిపై గాంధీ వ్యాఖ్యానిస్తూ, "ఇది మునిగిపోతున్న బ్యాంకుకు చెందిన పోస్ట్ డేటెడ్ చెక్కు." అని అన్నాడు. భారతదేశంపై జపాను దండయాత్ర ముప్పు, భారతదేశాన్ని రక్షించడానికి బ్రిటిషు వారి అసమర్థతలను జాతీయ నాయకులు గ్రహించడం ఇతర కారణాలు.
తక్షణ స్వాతంత్ర్యం కోసం తీర్మానం
[మార్చు]వార్ధాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం (1942 జూలై 14) బ్రిటిషు పాలన నుండి పూర్తి స్వాతంత్ర్యం కోరుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ ముసాయిదా బ్రిటిషు వారు డిమాండ్లకు అంగీకరించకపోతే భారీ శాసనోల్లంఘనను ప్రతిపాదించింది.
అయితే ఇది పార్టీలోనే వివాదాస్పదమైంది. ప్రముఖ కాంగ్రెస్ జాతీయ నాయకుడు చక్రవర్తి రాజగోపాలాచారి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నుంచి తప్పుకున్నాడు. కొంతమంది స్థానిక, ప్రాంతీయ స్థాయి నిర్వాహకులు కూడా తప్పుకున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ, మౌలానా ఆజాద్ ఈ పిలుపు పట్ల ఆందోళన చెందారు, దాన్ని విమర్శించారు. కాని దానిని సమర్థించారు, చివరి వరకు గాంధీ నాయకత్వంలోనే పనిచేసారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, అనుగ్రహ నారాయణ్ సిన్హా ఈ శాసనోల్లంఘన ఉద్యమానికి బహిరంగంగా, ఉత్సాహంగా మద్దతు ఇచ్చారు. అనేకమంది ప్రముఖ గాంధీయులు, సోషలిస్టులు అశోక మెహతా, జయప్రకాష్ నారాయణ్ వంటివారు కూడా దీనికి మద్దతు పలికారు.
క్విట్ ఇండియా ఉద్యమంలో చేరడానికి అల్లామా మష్రీకి ( ఖక్సర్ తెహ్రిక్ అధిపతి) ని జవహర్‌లాల్ నెహ్రూ ఆహ్వానించాడు. మష్రీకి దాని ఫలితం గురించి భయపడి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానంతో ఏకీభవించలేదు. 1942 జూలై 28 న, అల్లామా మష్రీకి మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, మహాత్మా గాంధీ, సి. రాజగోపాలాచారి, జవహర్‌లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, పట్టాభి సీతారామయ్యలకు ఈ క్రింది టెలిగ్రాం పంపాడు. అతను ఒక కాపీని బులుసు సంబమూర్తి ( మద్రాస్ అసెంబ్లీ మాజీ స్పీకర్) కు కూడా పంపాడు. ఈ టెలిగ్రామ్‌ను పత్రికలలో ప్రచురించారు. ఆ టెలిగ్రామ్ ఇలా పేర్కొంది:
పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ రాసిన జూలై 8 నాటి ఉత్తరం నాకు అందింది. నిజాయితీగా చెప్పాలంటే నా ఉద్దేశంలో ఇది కొంత తొందరపాటుతో కూడుకున్నది. ముందు కాంగ్రెసుముస్లిం లీగ్‌తో చెయ్యికలిపి, హృదయపూర్వకంగా పాకిస్తాన్‌కు ఒప్పుకోవాలి. ఆ తరువాత పార్టీలన్నీ ఏకకంఠంతో క్విట్ ఇండియా అని నినదించాలి. బ్రిటిషు వాళ్ళు తిరస్కరిస్తే, సంపూర్ణ శాసనోల్లంఘన మొదలుపెట్టాలి.[7]
తీర్మానం ఇలా చెప్పింది:
అందుచేత, కమిటీ భారతీయుల స్వేచ్ఛా స్వాతంత్ర్యాల హక్కును గుర్తిస్తోంది. అహింసా పద్ధతిలో సామూహిక ఉద్యమాన్ని వీలైనంత పెద్దయెత్తున మొదలుపెట్టాలని తీర్మానిస్తోంది. గత 22 యేళ్ళుగా సంపాదించుకున్న అహింసా శక్తిని దేశం ఈ ఉద్యమంలో వినియోగించుకుంటుంది. అహింసే ఈ ఉద్యమానికి మౌలిక సూత్రమని వాళ్ళు [ప్రజలు] గుర్తుంచుకోవాలి.
క్విట్ ఇండియా ఉద్యమానికి వ్యతిరేకత
[మార్చు]భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా ఉన్న అనేక రాజకీయ సంఘాలు క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించాయి. వీటిలో ముస్లిం లీగ్, హిందూ మహాసభ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, రాచరిక సంస్థానాలూ ఉన్నాయి.
హిందూ మహాసభ
[మార్చు]హిందూ మహాసభ వంటి హిందూ జాతీయవాద పార్టీలు క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునివ్వడాన్ని బహిరంగంగా వ్యతిరేకించాయి. దానిని అధికారికంగా బహిష్కరించాయి.[8] ఆ సమయంలో హిందూ మహాసభ అధ్యక్షుడైన వినాయక్ దామోదర్ సావర్కర్ "మీ పోస్టులకు కట్టుబడే ఉండండి" అనే పేరుతో ఒక లేఖ రాసే స్థాయికి కూడా వెళ్ళాడు. "దేశవ్యాప్తంగా మునిసిపాలిటీలు, స్థానిక సంస్థలు, శాసనసభల సభ్యులు, సైన్యంలో పనిచేస్తున్న వారూ ... " వారి పదవులకే అంటిపెట్టుకుని ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ క్విట్ ఇండియా ఉద్యమంలో చేరకూడదనీ ఈ ఉత్తరంలో రాశాడు. కానీ తరువాత, అనేక అభ్యర్ధనలు, ఒప్పందాల తరువాత, భారత స్వాతంత్ర్యం యొక్క ప్రాముఖ్యతను గ్రహించిన తరువాత, అతను భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చేరడానికి నిర్ణయించుకున్నాడు.
క్విట్ ఇండియా ఉద్యమాన్ని బహిష్కరించాలని హిందూ మహాసభ అధికారిక నిర్ణయం తీసుకున్న తరువాత, బెంగాల్ లోని హిందూ మహాసభ నాయకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ (ఇది ఫజలుల్ హక్ యొక్క క్రిషక్ ప్రజా పార్టీ నేతృత్వంలోని బెంగాల్ లో పాలక సంకీర్ణంలో భాగం) భారతదేశం విడిచిపెట్టమని బ్రిటిషు పాలకులకు కాంగ్రెస్ పిలుపునిస్తే వారు ఎలా స్పందించాలో బ్రిటిషు ప్రభుత్వానికి ఒక లేఖ రాశాడు. 1942 జూలై 26 నాటి ఈ లేఖలో ఇలా రాసాడు:
"కాంగ్రెస్ ప్రారంభించిన విస్తృత ఉద్యమం ఫలితంగా ఈ ప్రావిన్సులో ఏర్పడే పరిస్థితిని నేను ఇప్పుడు ప్రస్తావిస్తాను. యుద్ధ సమయంలో, సామూహిక భావనను రేకెత్తించి, అంతర్గత అవాంతరాలు లేదా అభద్రతకు కారణమయ్యే వారెవరైనా సరే, అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా ప్రతిఘటించాలి ”. ఈవిధంగా అతడు బ్రిటిషు ప్రభుత్వ దృష్టిలో పడ్డాడు. స్వాతంత్ర్య వీరుల సమాచారాన్ని ప్రభుత్వానికి అందించాడు.[9] [10]
ఫజ్లుల్ హక్ నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వం, దాని కూటమి భాగస్వామి హిందూ మహాసభతో కలిసి, బెంగాల్ ప్రావిన్స్‌లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఓడించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుందని ముఖర్జీ పునరుద్ఘాటించాడు. దీనికి సంబంధించి ఒక కచ్చితమైన ప్రతిపాదన చేశాడు:
“బెంగాల్‌లో ఈ ఉద్యమాన్ని (క్విట్ ఇండియా) ఎలా ఎదుర్కోవాలి? అనేది ప్రశ్న. కాంగ్రెస్ ఎంత గట్టి ప్రయత్నాలు చేసినా, ప్రావిన్సులో ఈ ఉద్యమం పాతుకు పోనివ్వకుండా పరిపాలన సాగించాలి. ఏ స్వేచ్ఛ కోసం కాంగ్రెస్ ఉద్యమాన్ని తలపెట్టిందో ఆ స్వేచ్ఛ ఇప్పటికే ప్రజల ప్రతినిధులకు ఉందని ప్రజలకు చెప్పగలిగే అవకాశం బాధ్యతాయుతమైన మంత్రులకు ఉంది. కొన్ని రంగాలలో ఇది అత్యవసర సమయంలో పరిమితం కావచ్చు. భారతీయులు బ్రిటిషు వారిని విశ్వసించాలి - బ్రిటన్ కొరకు కాదు, వారికి ఏదో ప్రయోజనం కలుగుతుందనీ కాదు, కానీ ప్రావిన్స్ యొక్క రక్షణను స్వేచ్ఛనూ కాపాడుకోవడం కోసం. మీరు, గవర్నర్‌గా, ప్రావిన్స్ యొక్క రాజ్యాంగ అధిపతిగా పని చేస్తారు. మీ మంత్రి సలహాలే మీకు పూర్తిగా మార్గనిర్దేశం చేస్తాయి. [10]
భారతీయ చరిత్రకారుడు ఆర్.సి.మజుందార్ కూడా ఈ విషయాన్ని గుర్తించి ఇలా పేర్కొన్నాడు:
"శ్యామ్ ప్రసాద్ కాంగ్రెస్ నిర్వహించిన ప్రజా ఉద్యమం యొక్క చర్చతో లేఖను ముగించాడు. ఈ ఉద్యమం అంతర్గత కల్లోలాన్ని సృష్టిస్తుందని, ప్రజలను ఉద్రేకపరచి యుద్ధ సమయంలో అంతర్గత భద్రతకు అపాయం కలిగిస్తుందని అతను ఆందోళన వ్యక్తం చేశాడు. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా దానిని అణచివేయవలసి ఉంటుందని అతను అభిప్రాయపడ్డాడు. కానీ దాన్ని హింస ద్వారా సాహించలేమని అతను అభిప్రాయపడ్డాడు.. . . . ఆ లేఖలో అతను పరిస్థితిలో తీసుకోవలసిన చర్యలను ఒక్కటొక్కటిగా పేర్కొన్నాడు. . . . "[11]
రాచరిక సంస్థానాలు
[మార్చు]ఈ ఉద్యమానికి రాచరిక సంస్థానాల్లో తక్కువ మద్దతు ఉంది, ఎందుకంటే సంస్థానాధీశులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీని వ్యతిరేకులకు నిధులు సమకూర్చారు.[12]
భారత జాతీయవాదులకు అంతర్జాతీయ మద్దతు చాలా తక్కువ. సూత్రప్రాయంగా, భారత స్వాతంత్ర్యాన్ని యునైటెడ్ స్టేట్స్ గట్టిగా సమర్థిస్తోందని వారికి తెలుసు. అమెరికా మిత్రదేశమని వారు నమ్ముతారు. అయితే, మరీ వత్తిడి చేస్తే రాజీనామా చేసేస్తానని చర్చిల్ బెదిరించిన తరువాత, యుఎస్ నిశ్శబ్దంగా అతనికి మద్దతు ఇచ్చింది. యుద్ధ ప్రయత్నాలకు ప్రజల మద్దతు ఇవ్వమంటూ భారతీయులపై ప్రచార దాడి చేసింది. ఈ అమెరికన్ ఆపరేషన్ భారతీయులకు కోపం తెప్పించింది.[13]
క్విట్ ఇండియా ఉద్యమానికి మద్దతు లేదు
[మార్చు]రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
[మార్చు]రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) 1925 లో కెబి హెడ్గేవార్ స్థాపించినప్పటి నుండి కాంగ్రెస్ నేతృత్వంలోని బ్రిటిషు వ్యతిరేక భారత స్వాతంత్ర్య ఉద్యమం నుండి దూరంగా ఉంటోంది. 1942 లో, ఎంఎస్ గోల్వాకర్ ఆధ్వర్యంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో చేరడానికి నిరాకరించింది. బాంబే ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ స్థానాన్ని ప్రశంసించింది.
"సంఘ్ చట్టప్రకారం తనను తాను నిశితంగా ఉంచుకుంది. ముఖ్యంగా, ఆగష్టు 1942 లో సంభవించిన ఉద్యమాల్లో పాల్గొనడం మానేసింది". ". [14]
బ్రిటిషు ప్రభుత్వం ఇలా చెప్పింది: ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రారంభించి, నిర్వహించిన బ్రిటిషు వ్యతిరేక ఉద్యమాల సమయంలో, సంఘ్ సమావేశాలలో..
"కాంగ్రెస్ ఉద్యమం నుండి దూరంగా ఉండాలని వక్తలు సంఘ్ సభ్యులను కోరారు. ఈ సూచనలను సభ్యులు సాధారణంగా పాటించేవారు".
క్విట్ ఇండియా ఉద్యమానికి ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు ఇవ్వలేదని, ఆ సమయంలో ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి (సర్‌సంగ్‌చాలక్), ఎంఎస్ గోల్వాకర్ తరువాతి కాలంలో చెప్పాడు. భారతీయ స్వాతంత్ర్య ఉద్యమంలో ఇటువంటి నిబద్ధత లేని వైఖరి కారణంగా, సాధారణ భారతీయ ప్రజలతో పాటు సంస్థలోని కొంతమంది సభ్యులు కూడా సంఘ్‌ను అపనమ్మకంతోను, కోపంతోనూ చూడటానికి దారితీసింది, గోల్వాకర్ మాటల్లోనే..,
“1942 లో కూడా చాలా మంది హృదయాలలో బలమైన సెంటిమెంట్ ఉంది. ఆ సమయంలో కూడా సంఘ్ పని మామూలుగానే కొనసాగింది. సంఘ్ నేరుగా ఏమీ చేయకూడదని నిర్ణయించుకుంది. 'సంఘ్ అనేది నిష్క్రియాత్మక వ్యక్తుల సంస్థ, వారి చర్చల్లో పస ఉండదు' అనేది బయటి వ్యక్తులు మాత్రమే కాదు, మన స్వంత స్వయం సేవకులు కూడా చెప్పే అభిప్రాయం. ' ”
తమపై చేపట్టిన శాసనోల్లంఘనకు ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు ఇవ్వడం లేదని, కాబట్టి వారి ఇతర రాజకీయ కార్యకలాపాలను పట్టించుకోకుండా వదిలెయ్యవచ్చనీ బ్రిటిషు ప్రభుత్వం పేర్కొంది. ఆర్‌ఎస్‌ఎస్, బ్రిటిషు ఇండియాలో శాంతిభద్రతలకు ముప్పు కాదని హోం శాఖ అభిప్రాయపడింది. [15] ఆర్ఎస్ఎస్ ఏ విధంగానూ ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించలేదని, చట్టాన్ని పాటించటానికి సుముఖత చూపించిందనీ బాంబే ప్రభుత్వం నివేదించింది. 1940 డిసెంబరు లో, బ్రిటిషు ప్రభుత్వానికి అభ్యంతరకరంగా ఉండే కార్యకలాపాలకు దూరంగా ఉండమని తమ ప్రాంతీయ నాయకులకు ఆర్ఎస్ఎస్ ఆదేశాలు జారీ చేసిందని అదే బాంబే ప్రభుత్వ నివేదికలో చెప్పారు. "ప్రభుత్వ ఆదేశాలని వ్యతిరేకించమని" ఆర్ఎస్ఎస్, బ్రిటిషు అధికారులకు హామీ ఇచ్చింది.
స్థానిక హింస
[మార్చు]జాన్ ఎఫ్. రిడిక్ ప్రకారం, 1942 ఆగస్టు 9 నుండి 1942 సెప్టెంబరు 21 వరకు, క్విట్ ఇండియా ఉద్యమంలో:
- 550 పోస్టాఫీసులు, 250 రైల్వే స్టేషన్లపై దాడి చేసారు. అనేక రైలు మార్గాలను దెబ్బతీసారు. 70 పోలీస్ స్టేషన్లను ధ్వంసం చేసారు. 85 ఇతర ప్రభుత్వ భవనాలను తగలబెట్టడమో, ధ్వంసం చెయ్యడమో చేసారు. టెలిగ్రాఫ్ వైర్లు కత్తిరించిన సందర్భాలు సుమారు 2,500 ఉన్నాయి. బీహార్‌లో అత్యధిక స్థాయిలో హింస జరిగింది. శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి భారత ప్రభుత్వం 57 బెటాలియన్ బ్రిటిషు దళాలను మోహరించింది.[16]
జాతీయ స్థాయిలో నాయకత్వం లేకపోవడం అంటే తిరుగుబాటును పెంచే సామర్థ్యం పరిమితంగా ఉన్నట్లే. ఈ ఉద్యమం కొన్ని ప్రాంతాలలో స్థానిక ప్రభావాన్ని మాత్రమే చూపింది -ముఖ్యంగా మహారాష్ట్రలోని సతారా, ఒడిశాలోని తాల్చేర్, మిడ్నాపూర్ ల వద్ద.[17] మిడ్నాపూర్ లోని తమ్లుక్, కొంటాయ్ ఉపవిభాగాలలో, స్థానిక ప్రజలు సమాంతర ప్రభుత్వాలను స్థాపించడంలో విజయవంతమయ్యారు. వీటిని రద్దు చేయమని 1944 లో గాంధీ వ్యక్తిగతంగా అభ్యర్థించే వరకు అవి పనిచేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ లో తూర్పు జిల్లా అయిన బలియాలో ఒక చిన్న తిరుగుబాటు జరిగింది. ప్రజలు జిల్లా పరిపాలనను పడగొట్టారు, జైలును తెరిచారు, అరెస్టు చేసిన కాంగ్రెస్ నాయకులను విడుదల చేశారు, వారి స్వంత స్వతంత్ర పాలనను స్థాపించారు. జిల్లాలో బ్రిటిషు వారు తమ అధికారాన్ని తిరిగి స్థాపించడానికి కొన్ని వారాలు పట్టింది. సౌరాష్ట్రలో (పశ్చిమ గుజరాత్‌లో) ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్న 'బహార్వతియా' సంప్రదాయం (అనగా చట్టం వెలుపల వెళ్లడం), అక్కడ ఉద్యమం విధ్వంసక చర్యలకు పాల్పడడంలో దోహదపడింది.[18] గ్రామీణ పశ్చిమ బెంగాల్‌లో, కొత్త యుద్ధ పన్నులు, బలవంతంగా చేస్తున్న వరి ఎగుమతులపై రైతుల ఆగ్రహం క్విట్ ఇండియా ఉద్యమానికి ఆజ్యం పోసింది. 1943 లో గొప్ప కరువు వచ్చి ఉద్యమం ఆగిపోయేవరకు ఈ ఉద్యమం తిరుగుబాటు స్థాయికి చేరుకుంది.[19]
ఉద్యమం అణచివేత
[మార్చు]ఉద్యమం యొక్క ఒక ముఖ్యమైన విజయాలలో ఒకటి, తరువాత వచ్చిన అనేక కష్టాల కాలంలో కాంగ్రెస్ పార్టీని ఐక్యంగా ఉంచడం. భారత్-బర్మా సరిహద్దు వరకు జపాన్ సైన్యం ముందుకు రావడంతో ఇప్పటికే ఆందోళన చెందిన బ్రిటిషు వారు వెంటనే స్పందించి గాంధీని జైలులో పెట్టారు. పార్టీ వర్కింగ్ కమిటీ (జాతీయ నాయకత్వం) సభ్యులందరినీ జైలులో పెట్టారు. ప్రధాన నాయకుల అరెస్టు కారణంగా, అప్పటి వరకు తెలియని యువ నాయకురాలు అరుణా అసఫ్ అలీ ఆగస్టు 9 న AICC సమావేశానికి అధ్యక్షత వహించి జెండాను ఎగురవేసింది; ఆ తరువాత కాంగ్రెస్ పార్టీని బ్రిటిషు ప్రభుత్వం నిషేధించింది. ఈ చర్యలు జనాభాలో సానుభూతిని కలిగించాయి. ప్రత్యక్ష నాయకత్వం లేకపోయినప్పటికీ, దేశవ్యాప్తంగా పెద్దయెత్తున నిరసనలు, ప్రదర్శనలు జరిగాయి. కార్మికులు పెద్ద సమూహాలలో పనులు మానేసి, సమ్మెలకు దిగారు. అన్ని ప్రదర్శనలూ శాంతియుతంగా జరగలేదు - కొన్ని చోట్ల బాంబులు పేలాయి, ప్రభుత్వ భవనాలకు నిప్పంటించారు, విద్యుత్తును కత్తిరించారు, రవాణా కమ్యూనికేషన్ మార్గాలు తెగగొట్టారు.
సామూహిక నిర్బంధాలతో బ్రిటిషు వారు వేగంగా స్పందించారు. లక్షకు పైగా అరెస్టులు జరిగాయి, సామూహిక జరిమానాలు విధించారు, ప్రదర్శనకారులను బహిరంగంగా కొట్టారు. పోలీసులు కాల్పులు జరిపిన సంఘటనల్లో వందలాది మంది పౌరులు మరణించారు. చాలా మంది జాతీయ నాయకులు భూగర్భంలోకి వెళ్లి రహస్య రేడియో స్టేషన్లలో సందేశాలను ప్రసారం చేయడం, కరపత్రాలను పంపిణీ చేయడం, సమాంతర ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం వగైరా చర్యల ద్వారా తమ పోరాటాన్ని కొనసాగించారు. బ్రిటిషు వరిలో సంక్షోభ భావం బలంగా ఉంది. ఎంతలా అంటే, గాంధీని, ఇతర కాంగ్రెస్ నాయకులనూ భారతదేశం నుండి, దక్షిణాఫ్రికాకు గాని, యెమెన్కు గానీ తీసుకెళ్లడానికి ఒక యుద్ధనౌకను ప్రత్యేకంగా పంపించారు. కాని ఉద్యమం తీవ్రతరం చేస్తారనే భయంతో ఆ చర్య తీసుకోలేదు.[20]
మూడేళ్లుగా కాంగ్రెస్ నాయకత్వం మిగతా ప్రపంచంతో సంబంధాల్లేకుండా తెగిపోయింది. గాంధీ భార్య కస్తూర్‌బాయి గాంధీ, అతని వ్యక్తిగత కార్యదర్శి మహాదేవ్ దేశాయ్ నెలల తేడాలో మరణించారు. గాంధీ ఆరోగ్యం క్షీణించింది. అయినప్పటికీ ఈ గాంధీ 21 రోజుల ఉపవాస దీక్ష చేసి, నిరంతర ప్రతిఘటన పట్ల సంకల్పాన్ని కొనసాగించాడు. 1944 లో బ్రిటిషు వారు గాంధీని ఆరోగ్య కారణాలపై విడుదల చేసినప్పటికీ, అతడు కాంగ్రెస్ నాయకత్వాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తన ప్రతిఘటనను కొనసాగించారు.
1944 ఆరంభం నాటికి, భారతదేశం మళ్లీ శాంతియుతంగా ఉంది. కాంగ్రెస్ నాయకత్వం ఇంకా ఖైదులోనే ఉంది. ఈ ఉద్యమం విఫలమైందనే భావన చాలా మంది జాతీయవాదులను నిరుత్సాహపరిచింది. అయితే జిన్నా, ముస్లిం లీగ్, అలాగే కాంగ్రెస్ ప్రత్యర్థులైన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, హిందూ మహాసభలు రాజకీయ మైలేజీ పొందే ప్రయత్నంలో గాంధీని, కాంగ్రెస్ పార్టీనీ విమర్శించారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "1942 Quit India Movement – Making Britain". Retrieved 1 May 2018.
- ↑ Arthur Herman (2008). Gandhi & Churchill: The Epic Rivalry That Destroyed an Empire and Forged Our Age. Random House Digital. pp. 494–99. ISBN 9780553804638.
- ↑ "1 Rupee Coin of 1992 – Quit India Movement Golden Jubilee". Retrieved 12 March 2017.
- ↑ "The Second World War and the Congress". Official Website of the Indian National Congress. Archived from the original on 5 అక్టోబరు 2006. Retrieved 28 August 2006. URL accessed on 20 July 2006
- ↑ D. N. Panigrahi (1984). Quit India and the Struggle for Freedom. New Delhi. pp. 13–14.
- ↑ Tarak Barkawi (2006). "Culture and Combat in the Colonies. The Indian Army in the Second World War". Journal of Contemporary History. 41 (2): 325–355. doi:10.1177/0022009406062071. JSTOR 30036389.
- ↑ Nasim Yousaf (2007) Hidden facts behind British India's freedom: a scholarly look into Allama Mashraqi and Quaid-e-Azam's political conflict. AMZ Publications. p. 137. ISBN 0976033380
- ↑ Prabhu Bapu (2013). Hindu Mahasabha in Colonial North India, 1915–1930: Constructing Nation and History. Routledge. pp. 103–. ISBN 978-0-415-67165-1.
- ↑ Syama P. Mookerjee; Śyāmāprasāda Mukhopādhyāẏa (2000). Leaves from a Diary. Oxford University Press. p. 179. ISBN 978-0-19-565097-6.
- ↑ 10.0 10.1 Noorani 2000, p. 56.
- ↑ Ramesh Chandra Majumdar (1978). History of Modern Bengal. Oxford University Press. p. 179.
- ↑ Stanley A. Wolpert (1984). Jinnah of Pakistan. Oxford University Press. pp. 209, 210, 215. ISBN 978-0-19-503412-7.
- ↑ Eric D. Pullin (2010). "'Noise and Flutter': American Propaganda Strategy and Operation in India during World War II". Diplomatic History. 34 (2): 275–298. doi:10.1111/j.1467-7709.2009.00849.x. JSTOR 24915981.
- ↑ Noorani 2000, p. 60.
- ↑ Noorani 2000, p. 46.
- ↑ John F. Riddick (2006). The History of British India: A Chronology. Greenwood Publishing Group. p. 115. ISBN 978-0-313-32280-8.
- ↑ Bidyut Chakraborty (1997) Local Politics and Indian Nationalism: Midnapur (1919–1944). Manohar.
- ↑ Jaykumar R. Shukla (1981). "The Quit India Movement on Saurashtra". Quarterly Review of Historical Studies. 21 (1): 3–8. JSTOR 44142014.
- ↑ Sunil Sen (1985). "Popular Participation in the Quit India Movement: Midnapur, 1942–44". Indian Historical Review. 12 (1–2): 300–316.
- ↑ D. Fisher and A. Read (1998). The Proudest Day: India's Long Road to Independence. WW Norton. pp. 229–330. ISBN 9780393045949.