ఎన్.ఎం.జయసూర్య
ఎన్.ఎం.జయసూర్య | |||
ఎన్.ఎం.జయసూర్య
| |||
పదవీ కాలం 1952-57 | |||
తరువాత | పి.హనుమంతరావు | ||
---|---|---|---|
నియోజకవర్గం | మెదక్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | హైదరాబాదు | 1899 సెప్టెంబరు 26||
మరణం | జూన్ 28, 1964 | ||
రాజకీయ పార్టీ | పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ | ||
మతం | హిందూమతం | ||
వెబ్‌సైటు | [1] |
డాక్టర్ ఎన్.ఎం.జయసూర్య (సెప్టెంబరు 26, 1899 - జూన్ 28, 1964) గా ప్రసిద్ధి చెందిన ముత్యాల జయసూర్యనాయుడు ప్రముఖ హోమియోపతీ వైద్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాదుకు చెందిన రాజకీయ నాయకుడు.[1]
జననం
[మార్చు]1899, సెప్టెంబరు 26 న హైదరాబాదులో సరోజినీ నాయుడు, ముత్యాల గోవిందరాజులు నాయుడు దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించిన జయసూర్య విద్యాభ్యాసం బెంగుళూరులోని సెంట్రల్ కళాశాల, మద్రాసు క్రైస్తవ కళాశాల, పూనాలోని ఫెర్గూసన్ కళాశాలలో సాగింది. ఎడిన్‌బరోలో వైద్య విద్యను అభ్యసించాడు. జర్మనీలో హోమియోపతీ వైద్యంలో ఎం.డి పట్టా పొందారు.
బెర్లిన్లో చదువుతున్న రోజుల్లో ఆయనకు కమ్యూనిస్టులతో పరిచయం ఏర్పడింది. మేనమామ వీరేంద్రనాథ్ ఛటోపాధ్యాయ (సరోజినీ నాయుడు తమ్ముడు) రష్యన్ల సహాయంతో బ్రసెల్స్ కేంద్రంగా ఏర్పడిన వలసవాద వ్యతిరేక లీగ్ కు ప్రధాన కార్యదర్శి అయినప్పుడు, ఈ లీగ్ యొక్క భారత బృందానికి జయసూర్య బెర్లిన్ ప్రతినిధిగా పనిచేశాడు. నాజీ పారామిలటరీ పోలీసులు 1933లో కమ్యూనిస్టుల అణిచివేతలో భాగంగా భారత సమాచార కేంద్రంపై ముట్టడి చేసి దస్తావేజులను స్వాధీనం చేసుకొని అక్కడ నిర్వాహకులుగా పనిచేస్తున్న ఏ.సి.ఎన్.నంబియార్ (జయసూర్య పినతల్లి సుహాసిని భర్త)ను, జయసూర్యను అరెస్టు చేశారు. పది రోజుల ఖైదు తర్వాత బెర్లిన్లోని బ్రిటీషు దౌత్యకార్యాలయం వీరి కేసుల గురించి వాకబు చేయగా, వీరిని విడుదల చేశారు.[2]
జర్మనీలో చదువుతున్న కాలంలో జర్మన్ వనిత ఈవాను పెళ్ళి చేసుకొని భారతదేశం తీసుకువచ్చాడు. ఆ తరువాత ఈవా కాన్సర్ వ్యాధితో మరణించింది.[3] వీరికి సంతానం కలగలేదు. ఈవా మరణించిన తర్వాత జయసూర్య గుంటూరుకు చెందిన డాక్టర్ ద్వారకాబాయిని పెళ్ళిచేసుకున్నాడు.[4][5]
గోవిందరాజులు నాయుడు గోల్డెన్ త్రెషోల్డ్ ప్రాంగణంలో ప్రధాన భవనం వెనుక వైపు, కొడుకు కోసం పెద్ద విస్తరణను కట్టించి దానికి జయసూర్య క్లినిక్ అని పేరుపెట్టాడు. తండ్రీ కొడుకులకు పెద్దగా పొసగనందున జయసూర్య దానిని ఉపయోగించలేదు. తల్లితండ్రులు మరణించిన తర్వాత ప్రాక్టీసు అక్కడ నుండి కొనసాగించాడు. గోల్డెన్ త్రెషోల్డ్ ప్రస్తుతం హైదరాబాద్ విశ్వవిద్యాలయం వారి ఆధీనంలో ఉంది. 1975 నవంబరు 17న అప్పటి ప్రధాని ఇందిరాగాంధి, పద్మజా నాయుడు ప్రోత్సాహంతో దీనిని జాతికి అంకితమిచ్చారు. హైదరాబాదు విశ్వవిద్యాలయము ఈ ప్రాంగణంలోనే ప్రారంభించబడింది. దీనిని గుర్తిస్తూ హైదరాబాదు విశ్వవిద్యాలయము వారు తదనంతరం సరోజినీ నాయుడు గారి పేరిట 1988లో "సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్మూనికేషన్" ను గోల్డెన్ త్రెషోల్డ్లో ప్రారంభించారు. 2012 ఆగస్టు నుండి థియేటర్ ఔట్రీచ్ యూనిట్‌ని నడుపుతున్నారు.
భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రదేశంలో హోమియోపతీ వైద్య విధానానికి గుర్తింపు, గౌరవాన్ని తీసుకురావటానికి విశేషకృషి చేశాడు. 1956లో ఆంధ్రప్రదేశ్ హోమియోపతీ సంఘాన్ని ప్రారంభించి దాని వ్యవస్థాపక అధ్యక్షునిగా పనిచేశాడు. రెండు పర్యాయాలు అఖిలభారత హోమియోపతీ వైద్య సంఘానికి అధ్యక్షత వహించాడు. హోమియోపతీ వైద్య కళాశాలల స్థాపనలోనూ, హోమియోపతీ బోధనలోనూ భారత ప్రభుత్వానికి అనేకమార్లు సలహాలందించాడు.[6]
1937లో తన సతీమణితో కలిసి జహీరాబాదులో కుష్టు వ్యాధి పరిశోధన, చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించి అనేకమంది కుష్టు వ్యాధి రోగులకు వైద్య సహాయాన్ని అందించాడు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో ఉరిశిక్షలు పడిన పదకొండు మంది కమ్యూనిస్టు కార్యకర్తల కోసం ఇంగ్లండు నుంచి బారిష్టర్ ప్రిట్‌ను, సుప్రీం కోర్టు నుంచి డానియల్ లతీఫ్‌ను పిలిపించి వాదింప చేశాడు.
హైదరాబాదు సైనిక చర్య సందర్భంగా జరిగిన సైనిక అత్యాచారాలు, హత్యాకాండపై సమాచారం సేకరించడానికి తన సోదరి పద్మజా నాయుడును ఆయా ప్రదేశాలకు పంపించి, సమగ్రమైన నివేదికను తయారు చేసి పూర్తి సాక్ష్యాలు, ఫోటోలతో సహా మీజాన్ పత్రికలో యధాతథంగా ప్రచురించాడు. నాలుగు వేల మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులును మాత్రమే కాదు, రజాకార్ల పేరుతో కనీసం నలభై వేల మంది అమాయక ముస్లింలను భారత సైన్యం చంపిందని కూడా ఆయన సాక్ష్యాధారాలతో నివేదిక ఇచ్చాడు.
1952 ఎన్నికల నాటికి భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ మీద నిషేధం ఉండడం వల్ల, జయసూర్య నాయకత్వంలో పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి హైదరాబాదు రాష్ట్ర శాసనసభలోని తెలంగాణా ప్రాంతానికి చెందిన 90 స్థానాల్లో 48 స్థానాలను, లోక్‌సభలో ఏడు స్థానాలు గెలుచుకున్నది. జయసూర్య స్వయంగా మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభకు, హుజూర్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు పోటీ చేసి రెండు స్థానాల్లోనూ గెలుపొందాడు.[7] హుజూర్‌నగర్ శాసనసభ సీటుకు రాజీనామా చేసి మొదక్ లోక్‌సభ నియోజకవర్గం ప్రతినిధిగా లోక్‌సభకు వెళ్ళాడు.
మరణం
[మార్చు]జయసూర్య జూన్ 28, 1964 న మరణించాడు.[8]
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (29 October 2023). "హుజూర్‌నగర్ నుంచి సరోజినీనాయుడి కుమారుడు విజయం". Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
- ↑ Age of Entanglement By Kris Manjapra
- ↑ Sarojini Naidu, selected letters, 1890s to 1940s Sarojini Naidu, Makarand R. Paranjape
- ↑ The ‘Nightingale’ of India By Narendra Luther
- ↑ http://www.sattalchristianashram.net/?page_id=65
- ↑ Pioneers of Homoeopathy By Mahendra Singh
- ↑ http://eci.nic.in/eci_main/StatisticalReports/SE_1951/StatRep_51_HBD.pdf
- ↑ Indian Parliamentary Companion: Who's who of Members of Lok Sabha. Lok Sabha Secretariat. 2003.