ఉద్యోగ పర్వము ప్రథమాశ్వాసము
ఉద్యోగ పర్వము, మహాభారతం ఇతిహాసంలోని ఐదవ భాగము. ఆంధ్ర మహాభారతంలో ఈ భాగాన్ని తిక్కన అనువదించాడు.
ఉద్యోగము అనగా "ప్రయత్నము". యుద్ధానికీ, శాంతికి జరిగే యత్నాలు ఈ పర్వంలో ముఖ్య కథాంశం. సంస్కృత మూలంలో 6,698 శ్లోకాలు ఉన్నాయి. సనత్సుజాతీయము ఉద్యోగ పర్వంలో ఒక భాఘం (41 నుండి 46 వరకు అధ్యాయాలు). దీనిపై ఆది శంకరాచార్యులు వ్యాఖ్యానం వ్రాశాడు.
ప్రధమాశ్వాసం
[మార్చు]ఉత్తరాభిమన్యుల వివాహం గడిచి నాలుగు రోజుల తరువాత ధర్మరాజు తన సోదర, పుత్ర సమేతంగా విరాటరాజు కొలువు కూటంలో ప్రవేశించాడు. అప్పుడు విరాటరాజు కృష్ణుడు, బలరాముడు, వారి పుత్రులు బంధువులతో ఇష్టాగోష్ఠి జరుపుతున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అందరినీ చూసి " పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం విజయవంతంగా పూర్తి చేసారు. వారు ఎంతటి ధర్మపరులో అందంరికి తెలుసు. సుయోధనుడు శకుని సాయంతో పాండవులను మాయా జూదంలో ఓడించి పాండవుల రాజ్యలక్ష్మిని అన్యాయంగా అపహరించాడు. కనుక పాండవులకు కౌరవులకు క్షేమకరమైన ఒక మార్గం అన్వేషించి పాండవుల రాజ్యం వారికి సంక్రమింప చేయాలి. పాండవులకు పితృధనంగా కొంతరాజ్యం లభించింది. ధర్మరాజు రాజసూయ యాగం నిర్వహించి రాజ్యాన్ని విస్తరించి మాయా జూదంలో అంతా దుర్యోధనుని పరం చేసి అడవులలో సోదర, పత్నీ సమేతంగా అనేక ఇడుములు పడ్డాడు. సుయోధనుడు శకుని, దుశ్శాసన, కర్ణాదులతో చేరి వారిని అనేక అవమానాల పాలు చేసాడు. పాండవులు సాయం సంతరించుకునే లోపే వారిని ఎదుర్కోవడానికి సన్నాహాలు చేస్తున్నాడు. కనుక పాండవులు వారికి సహాయాన్నందించే వారిని సమీకరించడం అనివార్యం. వారి బలపరాక్రమాలను ప్రదర్శించ వలసిన సమయం ఆసన్నమైంది. అయినా కౌరవుల మనసులో ఏముందో తెలుసుకుని తదుపరి కార్యక్రమ రచన చేయడం ఉచితం కనుక హస్తినా పురానికి ఒక దూతను పంపుట ఉచితం. వారు పాండవులకు రాజ్యభాగం శాంతి మార్గంలో ఇస్తే ఇరువర్గాలకు మంచిది. లేకుంటే ఏది ఉచితమో తరువాత నిర్ణయిస్తాము " అన్నాడు. అప్పుడు బలరాముడు లేచి " తమ్ముడు శ్రీకృష్ణుడు చెప్పినది ఉచితం. ఇరువర్గాలకూ ఇది క్షేమకరం. మనం ఒక దూతను కౌరవేంద్రుని వద్దకు పంపుదాము. జూదం ఆడటం సరిగా ఎరుగని ధర్మనందనుడు జూదానికి సిద్దంగావున్న కర్ణ దుర్యోధనాదులను వదిలి జూదంలో నిపుణుడైన శకునిని ఆటకు పిలిచి అతని చేతిలో ఓడిపోతూ, రోశావేశంతో జూదంను కొనసాగించి ఓడిపోయాడు. దానిలో శకుని తప్పేమీ లేదు. తన ప్రావీణ్యంతో రాజ్యాన్ని జూదంలో గెలిచి సుయోధన పరం చేసాడు. ఇందులో దుర్యోధనుని అపరాధం ఏమీ లేదు. కనుక ఇక్కడి నుంచి వెళ్ళే దూత ధృతరాష్ట్రుడికి నమస్కరించి వినయపూర్వకంగా వారికి ఏ విధంగానూ కోపం తెప్పించకుండా సంభాషించి కార్యాన్ని చక్కబెట్టేలా ఉండాలి " అన్నాడు.
సాత్యకి ఆవేశం
[మార్చు]బలరాముని మాటలు సాత్యకికి కోపం తెప్పించాయి " బలరామా ! నువ్వు ఇలా మాట్లాడటం తగదు. ఇలా మాట్లాడటం నీకే తగింది.మనుష్యునికి ఎలాంటి హృదయం వుంటే వారు అటువంటి మాటలే మాట్లాడుతారు. దుర్యోధనుడు మంచి వాడంటున్న నిన్ను మాట్లాడించి వింటున్న వారిని అనాలి. ధర్మరాజు వేడుక పుట్టి జూదం ఆడాడా? దుర్యోధనాదులంతా కుట్రపన్ని ధర్మరాజుని క్షత్రియ ధర్మాన్ని అనుసరించి జూదానికి పిలిచి, కపట జూదం ఆడి అతడి రాజ్యలక్ష్మిని అపహరించి అతని సోదరలను ధర్మ పత్నిని అవమానించారు. ధర్మరాజు ధర్మగుణం లోకానికి తెలియనిదా? నియమం ప్రకారం వనవాసం నుండి విముక్తుడు కాగానే వారి రాజ్యంను పొందడానికి ధర్మరాజు అర్హుడైనాడు. దీనుడై అతడు రాజ్యంను యాచించడం తగదు.? పాండవుల వద్ద అపహరించిన రాజ్యం పాండవులకు ఇవ్వక తప్పదు. లేకున్న పాండవులు యుద్ధంలో వారి రాజ్యాన్ని పొందగలరు. భీమార్జునలను ఎదిరించి యుద్ధభూమిలో నిలువగల వాడెవడు. విరాటుని పరాక్రం తక్కువా? పాంచాల వీరులు, వృష్టి వీరులు యుద్ధంలో తలపడి సుయోధనుని తమ్ములను హతమార్చక మానరు. రాజ్యం ఇవ్వకుంటే యుద్ధం తప్పదు. దూతను పంపండి కానీ న్యాయంగా ఇస్తే సరి. అంతేగాని యాచన వలదు " అన్నాడు.
దృపదుడు తన అభిప్రాయం వెలిబుచ్చుట
[మార్చు]సాత్యకి మాటలను ప్రోత్సహిస్తూ ద్రుపదుడు లేచి " సాత్యకి చెప్పింది సమ యోచితంగా ఉంది. బలరాముని మాటలు అంగీకరించడం వీలుకాదు. సుయోధనుడు మంచి మాటలతో వినకుంటే యుద్దమే శరణ్యం. భీష్మ, ద్రోణాదులు సుయోధనుని ఆశ్రయంలో ఉన్నారు కనుక వారు అతనికి సహాయంగా ఉంటారు. అశ్వథ్థామకు సుయోధనుడంటే అభిమానం మెండు కనుక అతడు సుయోధనుని వైపు యుద్ధం చేస్తాడు. పుత్రప్రేమను జయించలేని ద్రోణుడూ సుయోధనుని వీడడు. కృపాచార్యుని బంధుత్వం అతడిని సుయోధనుని వైపు కట్టుబడేలా చేస్తుంది. దృతరాష్ట్రునికి పుత్రుడంటే విపరీతమైన ప్రేమ కనుక అతడు సుయోధనుని అకృత్యాలను ఖండించి రాజ్యభాగాన్ని పాండవులకు ఇప్పించలేడు. శకుని మేనల్లుని అకృత్యాలను పెంచి పోషిస్తాడు, కర్ణుడు యుద్ధోన్మాది అతడు సుయోధనుని యుద్ధానికే ప్రోత్సహిస్తాడు దుశ్శాసనాది సోదరులు అన్నఆజ్ఞ మీరరు కనుక సుయోధనుడు సంధికి అనుకూలంగా స్పందించడు. యుద్ధం అనివార్యం సుయోధనుడు ఇప్పటికే ఆప్రయత్నాలు కొనసాగిస్తుంటాడు. రాజులు ముందుగా అడిగిన వారికే సహాయపడతారు కనుక మనము రాజుల సహాయాన్ని ముందుగా కోరడం మంచిది. వెంటనే మనం మన మిత్ర రాజులైన కేకయరాజు, జరాసంధుని కుమారుడు, దుష్టకేతు మొదలైన వారికి సమాచారం అందించి సహాయం కోరడం తక్షణ కర్తవ్యం " అని చెప్పాడు దృపదుడు ఆపై తన పక్కనే ఉన్న బ్రాహ్మణుని చూపి " ఇతడు నాకు అగ్ర పురోహితుడు. ఇతడు చతురసంభాషణలో ఘటికుడు. ఇతడు భీష్మ, ద్రోణ, దృతరాష్ట్రాదులతో యుక్తంగా మాటాడగలడు. ఇతడి అన్ని విషయములు చెప్పి మన దూతగా దృతరాష్ట్రుని వద్దకు పంపుతాము " అన్నాడు.
దృపదుడు దూతను పంపుట
[మార్చు]శ్రీకృష్ణుడు " ధర్మజా! మీరు దృపదుడు చెప్పిన మాట జరిగేలా చెయ్యండి. పెళ్ళికి వచ్చిన వారము ఎక్కువ రోజులు ఇక్కడ ఉండటం మంచిది కాదు మేము వెళతాము " అని, దృపదుని చూసి " మీరు మా అందరికి గురు స్థానంలో ఉన్నారు. మీ మాట అంటే దృతరాష్ట్రునికి మన్నన, భీష్ముడు మిమ్ము ఆదరిస్తాడు, ద్రోణ, కృపులతో మీకు స్నేహం ఉంది. కనుక పాండవుల తరఫున దూతను పంపు బాధ్యత మీదే. మీ మాట మేము అంతా ఆదరిస్తాము. మీరు కోరినట్లు సుయోధనుడు రాజ్యం ఇవ్వకపోతే యుద్ధం తప్పదు. మీరంతా మీమీ నగరాలకు వెళ్ళి యుద్ధ సన్నాహాలు చెయ్యండి " అని శ్రీకృష్ణుడు తన వారితో ద్వారకకు వెళ్ళాడు. పాండవులు, దృపదుడు, విరాటుడు యుద్ధ సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాలు చారుల ద్వారా తెలుసుకుని దుర్యోధనుడు తాను కూడా యుద్ధ సన్నాహాలు చెయ్యడం మొదలు పెట్టాడు. పాండవుల తరఫున దూతగా వెళ్ళిన బ్రాహ్మణుని పిలిచి దృపదుడు " విప్రోత్తమా! నీవు మాకు హితుడవు, బుద్ధి కుశలత కలవాడవు, చరురభాషణలో నేర్పరివి, సమయస్పూర్తి కలవాడవు, ఉన్నతకుల సంజాతుడవు మాకు సన్నిహితుడవు కనుక నిన్ను దూతగా పంపుతున్నాను. ధర్మరాజు ధర్మాత్ముడు. పరిశుద్ధుడు. క్షత్రియ ధర్మాలను పాటించేవాడు. దుర్యోధనుడు కుటిలుడు. శకుని తాను జూదంలో నిపుణుడై జూదం సరిగా రాని ధర్మరాజును బుద్ధిపూర్వకంగా జూదానికి పిలిచి కపటంతో ఓడించాడు. ధృతరాష్ట్రుడికి తెలిసే ఇందంతా జరిగింది. నీవు దృతరాష్ట్రునితో మాట్లాడి పాండవుల రాజ్యం ఇమ్మని అర్ధించాలి. పాండవులు అడవులలో పడిన కష్టాలు చెప్పి అక్కడి వారిని ఒప్పించాలి. శ్రీకృష్ణాదులు పలికిన పలుకులు సమయోచితంగా తెలియజేయాలి. భీష్మ, ద్రోణ, కృపాచార్యుల మనసెరిగి మాట్లాడాలి. దైవకృప వలన సుయోధనుడు అంగీకరిస్తే అందరికీ క్షేమమే " అని చెప్పాడు. విప్రుడు అందరి వద్ద శలవు తీసుకుని హస్థినకు వెళ్ళాడు.
సహాయార్ధియై దుర్యోధనుడు ద్వారకకేగుట
[మార్చు]హస్థినలో కూడా ఇలాంటి చర్చలే జరుగుతున్నాయి. శ్రీకృష్ణుని వద్దకు దూతను పంపాలనుకున్న దుర్యోధనుడు మనసు మార్చుకుని తనే స్వయంగా ద్వారకకు పయనమయ్యాడు. అర్జునుడు కూడా అదే రోజు ద్వారక చేరాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు శయనించి ఉన్నాడు. ముందుగా వచ్చిన సుయోధనుడు శ్రీకృష్ణుని తలవైపు ఉన్న ఆసనంపై కూద్చున్నాడు. తరువాత వచ్చిన అర్జునుడు శ్రీకృష్ణుని కాళ్ళ వైపు వినయంగా చేతులు కట్టుకుని నిల్చున్నాడు. శ్రీకృష్ణుడు నిద్రలేచి ముందుగా అర్జునిని వైపు చూసి తరువాత దుర్యోధనుని చూసాడు. ఇద్దరినీ తగురీతిన సత్కరించి వచ్చిన కారణం అడిగాడు. సుయోధనుడు ముందుగా " కృష్ణా! పాండవులకు మాకు యుద్ధం సంభవిస్తే యుద్ధంలో మాకు మీ సహాయం కోరడానికి వచ్చాను. నీకు పాండవులెంతో మేము అంతే . పైగా నేను ముందు వచ్చాను ముందుగా వచ్చిన వారిని ఆదరించడం లోక నీతి కనుక నాకు నీ సహాయాన్ని అందించ కోరుతున్నాను. అందుకు శ్రీకృష్ణుడు " సుయోధనా నీవు ముందు ఏతెంచిన మాట వాస్తవం. కాని నేను ముందుగా అర్జునుని చూసాను కనుక మీ ఇద్దరికి సహాయాన్నందించడం నా విధి. మీ ఇద్దరికీ సమ్మతమయ్యేలా ఒక మార్గం చెప్తాను. నా వద్ద సుశిక్షితులైన నాతో సమాన రూపం కల " నారాయణ " నామం గల పది లక్షల మంది యుద్ధ విద్యా నిపుణులు ఉన్నారు. వారిని ఎంచుకున్న వారి వైపు వారు యుద్ధం చేస్తారు. నేను ఒక వైపు ఉంటాను అయితే నేను మాత్రం యుద్ధం చేయను. ఆయుధం పట్టను. కోరుకున్న వారికి హితుడుగా ఉంటాను. మీరిరువురు ఎవరికి ఇష్టమైంది వారు కోరుకోండి. అర్జునుడు చిన్నవాడు కనుక అతడు ముందు కోరుకోవడం ధర్మం " అన్నాడు. వెంటనే అర్జునుడు " నాకు శ్రీకృష్ణుడు కావాలి " అన్నాడు. సుయోధనుడు మనసులో సంతోషించి పది లక్షల నారాయణ సైన్యంను తీసుకుని బలరాముని వద్దకు వెళ్ళి సహాయం కోరాడు. బలరాముడు " సుయోధనా! అభిమన్యుని వివాహ సమయంలో నేను నిన్ను సమర్ధించాను.అందుకు కొందరు వ్యతిరేకించారు ఆ విషయం నీకు తెలిసే ఉంటుది. ఇరుపక్షాల్తోను మనకు సమాన బంధుత్వం వున్నదని గుర్తుచేశాను. నా మాటను కృష్ణుడు స్వీకరించ లేదు. నాకు కృష్ణుడంటే అభిమానం. అతడిని విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. కనుక నేను ఎవరి పక్షం వహించక ఊరక ఉంటాను " అన్నాడు. సుయోధనుడు బలరాముని వద్ద వీడ్కోలు తీసుకుని కృతవర్మ వద్దకు వెళ్ళి సహాయం అర్ధించాడు. కృతవర్మ ఒక అక్షౌహిణి సైన్యాన్ని సహాయంగా ఇచ్చాడు. దానిని తీసుకుని సుయోధనుడు హస్థినకు తిరిగి వెళ్ళాడు.
అర్జునుని అంతర్యం
[మార్చు]శ్రీకృష్ణుడు " అర్జునా! అదేమిటి నన్ను కోరుకున్నావు. ఆయుధము పట్టని యుద్ధం చేయని నా వల్ల నీకు మేలు ఏమిటి " అన్న్నాడు. అర్జునుడు " కృష్ణా! నీవు యుద్ధంలో వారందరిని సంహరించ గలవాడవు. వారిని చంపితే ఆ కీర్తి నీకు చెందుతుంది. నేనుకూడా వారిని సంహరించి ఆ కీర్తిని పొందాలనుకుంటున్నాను. . నిన్ను ఎదిరించి నేను గెలువగలనా? పైగా నీవు ఉన్న వైపు విజయలక్ష్మి ఉంటుంది కనుక నీ తోడ్పాటు చాలు. దానితో నేను యుద్ధం చేసి రాజ్యం హస్థగతం చేసుకుని ధర్మరాజుని నిలపడమే అతనికి ఖ్యాతి గాని నీవు గెలిచిన రాజ్యానికి ధర్మజుని రాజుని చేయడం ధర్మమా? నీవు మా వైపు ఉంటే చాలు. నా చిరకాల వాంఛ అయిన నీ సారథ్యం ప్రసాదించి నన్ను అనుగ్రహించు అదేచాలు " అన్నాడు. శ్రీ కృష్ణుడు " అర్జునా! నీ కోరిక తప్పక తీరుతుంది. నీకు సారథ్యం వహించి విజయలక్ష్మిని నీకు స్వంతం చేస్తాను. మనం వెళ్ళి ధర్మరాజుతో ఆలోచించి తదుపరి కార్యాచరణ చేద్దాము పద " అని అర్జునునితో ఉపప్లావ్యం చేరాడు.
శల్యుడు సుయోధనునికి సాయం అందించుట
[మార్చు]ధర్మరాజు పంపిన దూతలు శల్యుని వద్దకు వెళ్ళి పాండవులకు సైన్య సహాయం చేయమని ధర్మజుని కోరిక వెలిబుచ్చారు. శల్యుడు ఆనందంగా సైన్య సమేతుడై మహారాధులైన పుత్రులతో కలిసిఉపప్లావ్యంకు బయలుదేరాడు. చారుల ద్వారా విషయం గ్రహించిన సుయోధనుడు శల్యుడు వచ్చు మార్గంలో తన మనుషుల ద్వారా వారి సైన్యానికి సకల మర్యాదలు, ఆహార పానీయములు, సౌకర్యాలు సమకూరేలా చేసాడు. విందులూ , వినోదాలు ఏర్పాటు చేసి రాజమర్యాదలు చేసాడు. ఇవి చూసిన శల్యుడు " ఈ మర్యాదలు చేస్తున్న వారు నా మర్యాదకు అర్హులు. ఈ ఏర్పాట్లను చేసిన ధర్మరాజు అమాత్యులను పిలిపించండి " అన్నాడు. దుర్యోధనుడి సేవకులు ఆశ్చర్యబోయి దుర్యోధనుడికి విన్నవించారు. అప్పుడు శల్యుడు తన ప్రాణములు ఇవ్వడానికి కూడా సిద్ధమైనంత సంతోషంతో వున్నాడు. అప్పుడు సుయోధనుడు శల్యుని వద్దకు వెళ్ళి అవన్నీ తాను చేసినట్లు చెప్పాడు. శల్యుడికి దుర్యోధనుడి ప్రయత్నం అర్ధం చేసుకున్నాడు. కానీ మాట తప్పలేడు. శల్యుడు " ఏమి కావాలో కోరుకో " అన్నాడు. అందుకు సుయోధనుడు " ఆర్యా ! సత్యవాక్కువై నాకు మాట ఇవ్వు. నీవు సర్వసైన్యానికి అధ్యక్షుడవు కాదగిన వాడవు. నీకు పాండవులు ఎలాంటి వారో నేనూ అంతే. నేను నీ భక్తుడను. ఆదరించ దగిన వాడను. కాబట్టి నా కోరికను మన్నించి నాకు సహాయం చేయి." అన్నాడు. శల్యుడు అందుకు సమ్మతించాడు. ఆ తరువాత శల్యుడు నేను ధర్మరాజు వద్దకు వెడుతున్నాను. అతనిని దర్శించిన తరువాత నీ దగ్గరకు వస్తాను " అన్నాడు. సుయోధనుడు " అలాగే వెళ్ళండి కాని నాకిచ్చిన మాట మరవ వద్దు " అన్నాడు. శల్యుడు అందుకు అంగీకరించి ధర్మరాజు చూడటానికి ఉపప్లావ్యం చేరాడు. ధర్మరాజు తన తమ్ములు, ద్రౌపది, సుభద్ర, అభిమన్యుడు ఇతర బంధు మిత్రులతో శల్యునికి సాదర స్వాగతం పలికాడు. శల్యుడు ధర్మరాజును ఆలింగనం చేసుకుని " ధర్మరాజా! కష్టసాధ్యమైన అరణ్యవాసాన్ని, అంతకంటే కష్టమైన అజ్ఞాత వాసాన్ని పూర్తి చేసారు. మీరు నమ్ముకున్న సత్యనిష్ఠా, ధర్మ నిష్ఠకు నిలబడ్డారు " అని శ్లాఘించి సుయోధనునికి ఇచ్చిన వరాన్ని వివరించాడు. ధర్మరాజు " మీరు సుయోధనునికి ఇచ్చిన వరం మంచిదే. దానిని నెరవేర్చండి. అలాగే నా కోరిక నెరవేర్చండి. రాబోవు యుద్ధంలో అర్జునునకు శ్రీకృష్ణుడు సారధ్యం వహిస్తున్నాడు. సుయోధనుని పక్షంలో మీకంటే సారధ్యంలో నేర్పరి లేడు. కర్ణుడు అర్జునుని మీద పగద్వేషంతో రగిలి పోతుంటాడు. నా పరిశీలనను బట్టి కర్ణార్జునులు ఇద్దరికీ ద్వంద్వయుద్ధం వచ్చిన్నప్పుడు కర్ణునికి మిమ్మల్ని సారధ్యం చేయమంటే ఆ బాధ్యత తీసుకుని కర్ణునికి ఉత్సాహ భంగం చేస్తూ అర్జునుని కాపాడండి. ఇది అకృత్యం అని తలపక నా కోరిక మన్నించండి " అని కోరాడు. శల్యుడు ధర్మరాజు అంతర్యం గ్రహించాడు " ధర్మనందనా ! సుయోధనుడు కోరితే కర్ణునికి సారధ్యం వహించి నీ కోరిక నెరవేరుస్తాను. జూద సమయంలో కర్ణుడు పలికిని పరుష వాక్యాలు, అందు వలన మీరు పడిన కష్టాలు అన్ని సుఖ దయాలు అవుతాయి. ధర్మరాజా ! ఇదే కాదు నీవు ఇంకేమి కోరినా చేస్తాను. మీకు జరిగిన అవమానం అడవులలో మీరు పడిన కష్టాలు మరవడం ఎవరి తరం? నువ్వే కాదు ఇంతకు పూర్వం ఇంద్రుడు కూడా ఇలాగే అనుభవించాడు. విధి రాతను తప్పించడం పరమ శివునకు కూడా సాధ్యం కాదు కదా? " అన్నాడు.
ఇంద్రుడు పదవీచ్యుతుడై తిరిగి పట్టాభిషిక్తుడగుట
[మార్చు]శల్యుని మాటలు విన్న ధర్మరాజు " మహానుభావా! ఇంద్రుడు, శచీదేవి ఎందుకు కష్టాల పాలయ్యారు. కొంచం వివరించండి " అన్నాడు. శల్యుడు ఇలా చెప్ప సాగాడు. దేవతలలో త్వష్ట అనే వాడు ఉన్నాడు. అతడు ఉత్తముడు. అతడు తన తపోశక్తితో మూడతలలున్న ఒక వ్యక్తిని సృష్టించాడు. అతని పేరు విశ్వరూపుడు. విశ్వరూపుడు ఇంద్ర పదవి కోరి ఘోరతస్సు చేస్తున్నాడు. ఇది తెలుసుకున్న ఇంద్రుడు అతని తపస్సు భగ్నం చేయటానికి అప్సరసలను పంపాడు. విశ్వరూపుడు అప్సరసల తళుకుబెళుకులకు లొంగక పోవడంతో ఇంద్రుడు విశ్వరూపుని చంపి ఆ విషయం ఒక సంవత్సరం రహస్యంగా దాచాడు. తరువాత అందరికీ ఆవిషయం తెలిసి ఇంద్రుని చర్యను నిరసించారు, అతడు బ్రహ్మహత్యా పాతకం చేసాడని ఖండించారు. తనకు అంటిన బ్రహ్మహత్యా పాతకం పోగొట్టడానికి ఒక యాగం చేసి తనకంటిన పాపాన్ని సముద్రానికి, స్త్రీలకు, వృక్షాలకు పంచి పెట్టి బ్రహ్మహత్యా దోషాన్ని కడిగి వేసాడు.
వృత్తాసుర వధ
[మార్చు]ఇది తెలిసిన త్వష్ట కోపించి నిష్కారణంగా నిరపరాధి అయిన విశ్వరూపుని చంపినందుకు ఇంద్రుని చంపడానికి ఒక శక్తిని సృష్టించి అతడికి వృత్తుడు అని నామకరణం చేసాడు. అధిక బల సంపన్నుడైన వృత్తుడు ఇంద్రుని జయించి అతనిని మింగి కడుపు బరువెక్కడంతో నిద్రకుపక్రమించి గట్టిగా ఆవలించాడు. అప్పుడు ఇంద్రుడు తన శరీరాన్ని చిన్నదిగా చేసి బయటకు వచ్చాడు. ఇంద్రుడు తిరిగి వృత్తాసురునితో యుద్ధానికి దిగాడు. వృత్తుని ధాటికి తట్టుకోలేక దేవతలు మంధర పర్వత శిఖరానికి చేరి వృత్తుని చంపే ఉపాయంకోసం ఆలోచించారు. అందరూ మహా విష్ణువు వద్దకు వెళ్ళి వృత్తుని చంపే ఉపాయం చెప్పమని అర్ధించారు. మీరు వెళ్ళి ఇంద్రునికి వృత్తునికి సంధి చేయండి. నేను తగిన సమయం చూసి ఇంద్రుని వజ్రాయుధంలో ప్రవేశించి అతడు అంత మయ్యేలా చేస్తాను " అన్నాడు. ఋషులంతా వృత్తుని వద్దకు వెళ్ళి " ఇంద్రుడు అజేయుడు నీవా అధిక బలశాలివి మీరు ఒకరిని ఒకరు జయించడం ఎన్నటికీ సాధ్యం కాదు. కనుక ఇంద్రునితో మైత్రి చేసుకో " అని నచ్చచెప్పారు. వృత్తుడు అందుకు అంగీకరిస్తూ " బదులుగా నాకు ఒక వరం ప్రసాదించండి. నేను తడిసిన దానితో కాని ఎండిన దానితో కాని రాత్రి కాని పగలు కాని సంహరించబడకూడదు. అందుకు ఒప్పుకుంటే ఇంద్రునితో సంధి చేసుకుంటాను " అన్నాడు. వృత్తుడు మైత్రి చేసుకున్నా ఇంద్రుడు మాత్రం వృత్తుని సంహరించే మార్గం అన్వేషిస్తూ ఉన్నాడు. ఒక రోజు అసుర సంధ్యలో సముద్రతీరంలో విహరిస్తున్న వృత్తుని చూసి అతడిని సంహరించడానికి అది తగిన సమయమని గ్రహించిన ఇంద్రుడు విష్ణువుని ప్రార్ధించి తన వజ్రాయుధాన్ని సముద్ర జలాల నురుగులో ముంచాడు. విష్ణువు ఆ నురుగులో ప్రవేశించాడు. ఆ నురుగు సాయంతో వృత్తుని సంహరించాడు.
నహుషుడు
[మార్చు]ఈ విషయం తెలిసిన భూతాలు బ్రహ్మ హత్య చేసినందుకు నిందించాయి. బ్రహ్మహత్యా పాతకం వెంట తరమగా ఇంద్రుడు పదవీచ్యుతుడై నిషధాచలంలో తలదాచుకున్నాడు. దేవతలంతా ఇంద్రపదవి కోసం తగిన వాడి కోసం అన్వేషిస్తూ భూలోకంలో నూరు అశ్వమేధయాగాలు చేసిన నహుషుడు అనే మహారాజుని ఆ పదవిలో కుర్చోమని అర్ధించారు. నహుషుడు మాత్రం అందుకు అంగీకరించ లేదు ఇంద్ర పదవి అధిష్టించేంత సామర్ధ్యం తనకు లేదన్నాడు. యముడు, అగ్ని, వరూణాది దేవతలు తమ శక్తిని అతనికి పంచారు. నహుషుడు దానితో అధిక బల సంపన్నుడైనాడు. నహుషుడు ఇంద్రపదిని అధిష్టించి ధర్మ పరుడై సమస్త లోకాలను పాలిస్తున్నాడు. కిన్నెరలూ, కింపురుషులు, యక్షులు, సిద్ధులు, విద్యాధరులు, గంధర్వులు, గరుడులూ సమస్త దేవతల నుండి తేజో భాగములు స్వీకరించి అత్యంత తేజోమయుడయ్యాడు. మునులంతా నహుషుని సేవిస్తున్నారు, తుంబురు నారదులు గానంతో వినోదం అందిస్తున్నారు, రంభ, మేనక, తిలోత్తమ, ఊర్వశి మొదలైన అప్సరసలు నాట్యంతో వినోదం కలిగిస్తున్నారు. ఇన్ని భోగాలు ఒక్క సారిగా సంక్రమించగానే నహుషునిలో గర్వం తొంగిచూసింది.
నహుషుడు శచీదేవిని కోరుట
[మార్చు]నహుషుడు ఇంద్రుని భార్య శచీదేవిని చూసి ఆమె అందానికి ముగ్ధుడై ఆమెను మోహించాడు. అతడు దేవతలను పిలిచి " నేను స్వర్గాధి పతిని అందరూ నన్ను చూడటానికి వచ్చారు. కాని శచీ దేవి మాత్రం నా వద్దకు రాలేదు. వెంటనే ఆ సుందరాంగి శచీదేవిని ఇక్కడకు పిలిపించండి " అని ఆజ్ఞాపించాడు. అది విని శచీదేవి భయపడి దేవ గురువు బృహస్పతిని శరణు వేడింది. జరిగినదంతా విన్న బృహస్పతి " అమ్మా! శచీదేవి ఊరడిల్లుము. నీభర్త తిరిగి రాగలడు. నేను నిన్ను కాపాడతాను " అన్నాడు. ఇది తెలిసిన నహుషుడు " నేను కోరిన వనితకు బృహస్పతి రక్షణ కల్పిస్తాడా? " అని ఆగ్రహించగా దేవతలు " దేవేంద్ర పదవిలో ఉన్న మీరు పరస్త్రీలను కోరుట తగదు " అని నచ్చ చెప్పారు. అందుకు నహుషుడు నవ్వి " ఇంద్రుడు గౌతముని భార్యను కామించినప్పుడు ఈ బుద్ధులు మీరెందుకు చెప్ప లేదు? మీరు వెంటనే శచీదేవిని నా వద్దకు తీసుకు రండి " అన్నాడు. దేవతలు మునులతో బృహస్పతి వద్దకు పోయి " గురుదేవా! ఇంద్రపదవిలో ఉన్న నహుషుడు శచీదేవిని కోరడానికి అర్హుడు. కనుక శచీదేవిని అతని వద్దకు పంపి అతని కోపం పోగొట్టండి " అని ప్రార్ధించారు. బృహస్పతి నవ్వి " నహుషుడు శచీదేవిని కోరడమా? అందుకు మీరు అంగీకరించడమా? ఇది లోక హితమా? ఇంతటి మహా కార్యాన్ని ఆచరించ వలసినదే కాని శరణు వేడిన వారిని విడుచుట ధర్మం కాదు కనుక నేను ఆమెను పంపను " అన్నాడు. మునులు " అయితే తగిన కర్తవ్యం ఆలోచించండి " అని అర్ధించారు. బృహస్పతి " ఒక పని చేద్దాము శచీదేవి నహుషుని వద్దకు వెళ్ళి కొంత సమయం అడుగుతుంది. ఆ తరువాత జరగ వలసినది ఆలోచిస్తాము " అన్నాడు. బృహస్పతి ఆదేశానుసారం శచీదేవి నహుషుని వద్దకు వెళ్ళింది " నేను ఇంద్ర పత్నిని ఇంద్రుడు ఉన్నాడో లేదో తెలియలేదు. నా మనసు శంకిస్తుంది ఏవిషయం తెలియకుండా తొందర పడకూడదు. నాకు కొంత సమయం కావాలి " అన్నది. నహుషుడు అందుకు అంగీకరించాడు. మునులు రహస్యంగా విష్ణుమూర్తిని కలుసుకుని ఇంద్రుని పాపం పోగొట్టమని అడిగారు.
శచీదేవి ఇంద్రుని వద్దకు పోవుట
[మార్చు]విష్ణుమూర్తి " ఇంద్రునిచేత అశ్వమేధయాగం చేయించండి అతని పాపం పోతుంది " అన్నాడు. మునులు అలాగే ఇంద్రునిచేత అశ్వమేధయాగం చేయించారు. ఇంద్రుని పాపం పరిహారం కాగానే అమరావతికి వెళ్ళాడు. అక్కడ నహుషుడు అమిత తేజోమయుడై ఉండటం చూసి భయపడి ఎవ్వరికీ చెప్పకనే వెళ్ళి పోయాడు. ఇంద్రుని జాడ తెలియని శచీదేవి కలత పడి ఉపశ్రుతి అనే దేవతను ఆరాధించి ఆమెను సాక్షాత్కరింప చేసుకుంది. ఉపశ్రుతి " అమ్మా శచీదేవి! నేను నీ పాతివ్రత్యానికి మెచ్చి వచ్చాను. నీవు నా వెంట వచ్చిన ఎడల నీ భర్తను చూడగలవు " అని ఉపశ్రుతి శచీదేవిని హిమాలయాలకు ఉత్తర దిక్కున ఉన్న మంజుమంతము అనే పర్వతము వద్దకు తీసుకు వెళ్ళింది. అక్కడ ఉన్న సరోవరంలో ప్రవేశించారు. ఆ తరువాత ఒక తామరపుష్ప కాడలో ప్రవేసించారు. అక్కడ సూక్ష్మరూపంలో ఉన్న ఇంద్రుని చూపి ఉపశ్రుతి " అమ్మా! నీ భర్త ఇక్కడ ఉన్నాడు చూడు " అని చెప్పి ఉపశ్రుతి అదృశ్యమైంది. ఇంద్రుడు ఆశ్చర్యపడి " నేను ఇక్కడ ఉన్నది నీకెలా తెలుసు " అని శచీదేవిని అడిగాడు. శచీదేవి జరిగినది అంతా చెప్పి " నాధా! నీవు నహుషుని చంపి నన్ను రక్షించాలి " అని వేడుకుంది. ఇంద్రుడు " దేవీ ! నహుషుడు ఇప్పుడు నా కంటే బలవంతుడు. దేవతలు ఋషులు అతనికి తమ శక్తులు ప్రసాదించారు. కనుక అతను అజేయుడు. శత్రు శక్తి సంపన్నుడై ఉన్నప్పుడు వేచి ఉండటం రాజనీతి. అతనికి నీ మీద మోహం కలిగింది మనం దానిని అనుకూలంగా మార్చుకోవాలి. నీవు అతనితో సఖ్యం నటించి " నీవు నన్నుపొందాలంటే సప్తఋషి వాహనంపై రమ్మని చెప్పు దానితో అతని పుణ్యం క్షీణించి పతనం కాక తప్పదు. ఆ పై నేను అతనిని జయించడం సులువు " అన్నాడు. అందుకు అంగీకారం చెప్పి శచీదేవి అమరావతికి తిరిగి వచ్చింది. నహుషుడు మరలా శచీదేవి వద్దకు వచ్చి తన కోరిక తీర్చమని అడిగాడు.శచీదేవి " మహేంద్రా! నేను పెట్టిన గడువు ఇంకా మిగిలి ఉంది. ఆ గడువు తీరగానే నీవు సప్తఋషి వాహనం మీద వస్తే నేను నిన్ను వరించగలను " అని చెప్పింది. మోహావేశంలో ఉన్న నహుషుడు ఉచితానుచితాలు మరచి మునులను వాహనంగా చేసుకుని తిరగసాగారు. శచీదేవి " బృహస్పతి వద్దకు పోయి నన్ను నా నాధుని రక్షించండి " అని అడిగింది. బృహస్పతి " శచీదేవీ! చింతించ పని లేదు నహుషుడు ఋషి వాహనంతో శక్తిని కోల్పోతాడు " అన్నాడు.
బృహస్పతి ఇంద్రుని వెతికించుట
[మార్చు]బృహస్పతి అగ్ని దేవుని పిలిచి ఇంద్రుడు ఎక్కడ ఉన్నాడో వెతకమని చెప్పాడు. అగ్ని ఒక స్త్రీ రూపం ధరించి మనోవేగంతో అంతా వెతికి చూసాడు. అష్ట దిక్కులు, భూమి, అంతరిక్షం, కొండలు అడవులు ఎక్కడ వెతికినా ఇంద్రుని జాడ తెలియ లేదు. అగ్ని " దేవగురూ! నాకు సాధ్యమైనంత వెతికాను ఎక్కడా కనిపించ లేదు. సృష్టి క్రమంలో నీటి నుండి అగ్ని, బ్రాహ్మణుల నుండి క్షత్రియులు, రాళ్ళ నుండి లోహములు పుట్టాయి. ఆ విధంగా పుట్టిన వాటికి తమ ప్రతాపం ఎక్కడ చెల్లినా తమ జన్మ స్థానంలో చెల్లదు. కనుక నాకు జలప్రవేశం నిషిద్ధం కనుక అక్కడ నేను వెతకలేను " అన్నాడు. బృహస్పతి " అగ్నిదేవా! నీకు సకల చరాచరములలో ప్రవేశం కలదు. నీవు చేరజాలని ప్రదేశం లేదు. నీకు నేను నీటిలో ప్రవేశించే అర్హత కలిగిస్తాను. అక్కడ కూడా ఇంద్రుని కొరకు వెతుకు " అన్నాడు. ఆ తరువాత అగ్ని జలరాశులలో కూడా వెతికి తామర తూడులో ఉన్న ఇంద్రుని కనుగొన్నాడు. వెంటనే బృహస్పతి ఇంద్రుని వద్దకు వెళ్ళాడు. అతనితో " ఇంద్రా! నీ తప్పు ఏమీ లేదు. వృత్తాసురుని వధ ఎలా పాపం ఔతుంది. నీ తప్పు లేకనే నువ్వు పదవి త్యజించావు. మార్గాంతరం లేక నహుషునికి పదవి కట్ట పెడితే అతడు దేవతలు ఇచ్చిన శక్తితో బలగర్వితుడై ప్రవర్తిస్తున్నాడు. తనను మోయడానికి ముని పల్లకి ఉపయోగించి తన శక్తి క్షీణింప చేసుకున్నాడు కనుక ఇది అతనిని జయించడానికి తగిన సమయం. నీవు వచ్చిన సమయంలో నహుషుడు బలవంతుడు కాని ఇప్పుడు అతడు శక్తి హీనుడు. అశ్వమేధయాగం చేసి పాపాన్ని పోగొట్టుకున్న నీవు ఇప్పుడు ఇంద్ర పదవికి అర్హుడవు కనుక నీవు వచ్చి నహుషుని జయించి నీ పదవిని తిరిగి స్వీకరించు " అన్నాడు. అష్టదిక్పాలకులు కూడా ఇంద్రుని వద్దకు వచ్చారు. అందరూ నహుషుని జయించే ఉపాయం గురించి ఆలోచిస్తున్న సమయంలో అగస్త్యుడు అక్కడకు వచ్చి " ఇంద్రా నహుషుడు పదవీ భ్రష్టుడు అయ్యాడు. ఇక నీవీ నీ సింహాసనం అధిష్టించ వచ్చు " అన్నాడు.
నహుషుడు పదవీ భ్రష్టుడు అగుట
[మార్చు]ఇంద్రుడు అగస్త్యునకు నమస్కరించి నహుషుడు ఎలా పదవీచ్యుతుడైనాడు చెప్పని అడిగాడు. అగస్త్యుడు " మునులంతా అతని వాహనం మోస్తూ బాధపడుతున్న సమయంలో ఒకనాడు నహుషుడు బ్రాహ్మణులతో ఇష్టాగోష్టి జరుపుతున్న సమయంలో ఋషులు ఇలా అడిగారు " గో సంప్రోక్షణమందు బ్రాహ్మణములయిన మంత్రములు చెప్పబడినవి అవి నీకు ప్రమాణ భూతములా " అని అడిగారు. అందుకు నహుషుడు " గర్వంతో అవి నాకు ప్రమాణమలు కావు " అన్నాడు. నేను అతనికి అడ్డు చెపుతూ " ఋషులచే అభినందితమైన మంత్రములను నిందించుట అజ్ఞానము " అన్నాను. అందుకు నహుషుడు కోపించి నా తలపై తన్నాడు. దానితో అతని పుణ్యమూ, తేజమును కోల్పోయాడు. అప్పుడు నేను " నహుషా ! మునులను వాహనంగా చేసుకుని వారిని అవమానించావు. వారు గౌరవించు మంత్రములు ప్రమాణములు కాదని నిరసించావు. నన్ను అవమానించావు కనుక నీవు పదవీ భ్రష్టుడివై ఇంద్రలోకం నుండి పతనమై భూలోకమున సర్ప రూపమున అనేక సంవత్సరములు నివసించెదవు కాక " అని శపించాను. నహుషుడు నన్ను పరి పరి విధాల ప్రార్ధించగా అతడికి శాపవిమోచనం చెప్పాను. ధర్మపరుడు సత్పురుషుడైన యుధిష్టరుని చూసిన తరువాత అతని పాపములు పరిహారమై పుణ్యలోక ప్రాప్తి కాగలదు అని చెప్పాను " అన్నాడు. ఇంద్రుడు అగస్త్యునికి పూజించాడు. అమరావతి అంతా అక్కడికి వచ్చి ఇంద్రుని అభినందించింది. ఇంద్రుడు అమరావతికి పోయి ఇంద్ర పదవిని అధిష్టించి శచీదేవితో సుఖంగా ఉన్నాడు " అని వివరించాడు. శల్యుడు మరలా " ధర్మరాజా! ఇంద్రుని వంటి వారే తమ అధికారానికి భంగం జరిగినప్పుడు అజ్ఞాతవాసం అనుభవించాడు. కనుక మీరు మీ దురవస్థకు దుఃఖించ వలదు. దుర్యోధనుడు నహుషుని వలె నశించక తప్పదు " అన్నాడు. ధర్మరాజు శల్యునికి కర్ణుని నిరుత్సాహ పరచడం గురించి గుర్తు చేసాడు. శల్యుడు అందుకు అంగీకారం తెలిపి ఇంకా ఏమైనా ఉంటె తప్పకచేస్తానని సేనలతో హస్థినకు బయలు దేరాడు.
సేనలసమాయత్తం
[మార్చు]సాత్యకి ఒక అక్షౌహిని సేనతో పాండవుల వద్దకు వచ్చాడు. చేధి దేశాధీశుడు, శిశుపాలుని కుమారుడు దృష్టకేతు , జరాసంధుని కుమారుడు సహదేవుడు ఒక్కొక్క అక్షౌహిని సేనతో వచ్చి కలిసారు. కేకయ రాజులు కూడా ఒక్క అక్షౌహినితో కలిసాడు. ద్రుపదుడు బంధువులతో ఒక్క అక్షౌహినితో కలిసాడు. పర్వత రాజు ఒక్క అక్షౌహినితో కలిసాడు. విరాట రాజు తన సైన్యముతో కలిసాడు. పాండ్యరాజు ఒక్క అక్షౌహినితో కలిసాడు. ఇలా పాండవ సైన్యం ఏడు అక్షౌహినులైంది. ఇక సుయోధనుడు కూడా తన సైన్యాన్ని సమాయత్తం చేస్తున్నాడు. భగదత్తుడు ఒక్క అక్షౌహినితోను, కాంభోజరాజు సుదక్షిణుడు ఒక్క అక్షౌహినితోను, భూరిశ్రవుడు ఒక్క అక్షౌహినితోనూ, శల్యుడు ఒక్క అక్షౌహినితోను, సింధురాజు జయద్రధుడు ఒక్క అక్షౌహినితోనూ, మాహిష్మతీపతి నీలుడు ఒక్క అక్షౌహినితోనూ, యాదవరాజు కృతవర్మ ఒక్క అక్షౌహినితోను, అవంతీరాజులు విందాను విందులు తలా ఒక్క అక్షౌహినితోనూ , వివిధదేశముల నుండి వచ్చిన సైన్యం మూడు అక్షౌహినులయ్యాయి. మొత్తం పదకొండు అక్షౌహినుల సైన్యం కౌరవపక్షాన చేరింది.
ద్రుపదరాజు పంపిన పురోహితుని రాయభారం
[మార్చు]ద్రుపదరాజు పంపిన పురోహితుడు హస్థినకు చేరాడు. అతడు భీష్ము, ద్రోణ, కృపాచార్యు, విదుర దుర్యోధనాధులను కలుసుకున్నాడు. మరునాడు దృతరాష్ట్రసభలో " ధృతరాష్ట్రుడు, పాండురాజు అన్నదమ్ములు. వారి పుత్రులైన కౌరవ, పాండవులకు రాజ్యంపై సమాన హక్కు ఉందని మీకంతా తెలుసు. పాండవులను చంపడానికి చేసిన అనేక ప్రయత్నాలు వాటి నుండి వారు తప్పించుకున్న విధం మీకు తెలుసు. పాండవులు తమ బాహు బలంతో నూతన రాజ్యాన్ని స్థాపించి, వృధి చేసిన రాజ్యంను శకునితో కలిసి కుట్రపన్ని జూదం వంకతో దుర్యోధనుడు అపహరించిన విషయం మీకు తెలుసు. వీటిని అంగీకరించిన దృతరాష్ట్రుని ఏమనాలి. పాండవపత్నిని సభలో వలువలు వలిచి అవమానించిన విషయం, వారి రాజ్యం అపహరించిన విషయం ఎలా మరువగలము. నాటి నిర్నయానుసారం ఇప్పుడు వారు అరణ్య అజ్ఞాత వాసాలు ముగించుకుని మునుపటి తప్పులను తలంచక వారి రాజ్యభాగం కోరుతూ సంధి నిమిత్తం నన్ను పంపారు. కౌరవ, పాండవ ప్రవర్తను ఎరిగిన మీరు దుర్యోధనుడికి నచ్చ చెప్పటం మంచిది. పాండవులు బల హీనులు కారు. జననష్టం లేకుండా తమ రాజ్యంను పొందాలనుకుంటున్నారు. వారి వైపు ఏడు అక్షౌహినుల సైన్యమే ఉంది, మా వద్ద పదకొండు అక్షౌహినుల సైన్యం వుందని అనుకుంటున్నారేమో సాత్యకి, భీముడు ఒక్కొక్కరు వెయ్యి అక్షౌహినులకు సమం. అర్జునిని ఎదిరించి నిలువగలిగిన వీరుడు ముల్లోకాలలో లేడు. అన్నిటికి మించి చతురోపాయములో సమర్ధుడైన శ్రీకృష్ణుడు వారి వైపు ఉండగా వారిని విజయలక్ష్మి వరించకుండా ఉండ కలదా? వారిని పిలిపించి వారి రాజ్య భాగం ఇప్పించి అందరూ క్షేమంగా సుఖంగా ఉండండి " అని చెప్పి కూర్చున్నాడు.
దృతరాష్ట్ర సభలో సంధివిషయంలో చెలరేగిన వివాదాలు
[మార్చు]బ్రాహ్మణుని మాటలు విన్న భీష్ముడు లేచి " పాండవులు శ్రీకృష్ణునితో కలసి ఉండటం వారు శాంతియుతంగా సమస్యా పరిస్కారానికి దారులు వెదకడం అదృష్టం. మీ మాటలు వినడానికి కొంత కటువుగా ఉన్నా ఆమోదయోగ్యం. పాండవులు అనుభవించిన కష్టాలు మనందరికి తెలుసు. కనుక వారిని సగౌరవంగా వారి రాజ్య భాగాన్ని ఇవ్వడం సముచితం. కాని పక్షంలో ఆగ్రహించిన అర్జునిని యుద్ధంలో ఎవరు ఆపగలరు. సాక్షాత్తూ వజ్రాయుధం ధరించిన ఇంద్రుడు కూడా అర్జునుడి ముందు నిలువలేడు. ఇక తక్కిన ధనుర్ధారుల సంగతి చెప్పనేల. అతని బాణాగ్నికి సర్వం ఆహుతి కాక తప్పదని నా అభిప్రాయం " అన్నాడు. భీష్ముడు ఇలా మాట్లాడుతుండగా కర్ణుడు లేచి "బ్రాహ్మణోత్తమా! అందరికి తెలిసిన విషయాన్ని మాటి మాటికి ప్రస్తావించడం వ్యర్ధం. దుర్యోధనుని కొరకు శకుని జూదం ఆడాడు ధర్మరాజు సకలము ఓడాడు. ఇందులో అపరాధం లేదు. అనుకున్న ప్రకారం అజ్ఞాత వాసం ముగియకనే రాజ్యభాగం కోరడం తప్పు. విరాటుడు, ద్రుపదుడు సహాయంగా ఉన్నారని రాజ్యభాగం అడగటంలో ఏమి న్యాయం ఉంది? ఇంత అన్యాయం ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? " అన్నాడు. అందుకు భీష్ముడు బాధపడుతూ " కర్ణా! ఏమిటిది? పెద్ద వీరుడి మాదిరి మాట్లాదుతున్నావు. గోగ్రహణంలో అర్జునుడు మనందరిని గెలిచాడు. పలుమార్లు నీవు అతనితో తలపడి ఓడిన నీ పరాక్రమం ఏమిటో అప్పుడే చూశాం. ఇప్పుడు నువ్వు మాటలతో గెలుస్తున్నావు. గోగ్రహణ సమయంలో సుయోధనునికి నేను అజ్ఞాత వాసం ముగిసిందని చెప్ప లేదా ఇప్పుడు మరలా ఆ ప్రస్తావన ఎందుకు ? ఈ బ్రాహ్మణుడు చెప్పినట్లు చేయకపోతే యుద్ధంలో మనం ఆర్జునుడి చేతిలో దెబ్బలు తిని మట్ట్టి కరువక తప్పదు" అని కోపంగా అన్నాడు. దృతరాష్ట్రుడు భీష్ముని శాంతింప చేసి కర్ణుడిని నిందించి " విప్రోత్తమా! మీరు చెప్పింది సావధానంగా విన్నాను. తగు విధంగా ఆలోచించి మేము ఒక సౌమ్యుని పాండవుల వద్దకు పంపి మా మనసులో మాట తెలియచేస్తాము. మీరు వెళ్ళి రండి " అన్నాడు.
సంజయుని సంధి కొరకు ఉపప్లావ్యం పంపుట
[మార్చు]దృతరాష్ట్రుడు సంజయుని పిలిచి " సంజయా! పాండు రాజకుమారులు ఉపప్లావ్యంలో ఉన్నారు. నీవు వారి వద్దకు వెళ్ళి శ్రీకృష్ణుని సాన్నిధ్యంలో వారితో అరణ్య, అజ్ఞాతవాసాలు ముగించుకున్నందుకు అభినందిస్తున్నాని చెప్పు. సుయోధనుడు వివేచనా శూన్యుడు కనుక ఇన్ని అనర్ధాలు జరిగాయి అని తెలుపుము. ధైర్యవంతులు, ఉత్సాహవంతులు అయిన పాండవుల దోషం ఏమీ లేదని చెప్పు. పాలు, నీళ్ళ లాగా అన్నదమ్ములను కలిసి ఉండమని చెప్పు. వారు వారి తండ్రి రాజ్యభాగానికి అర్హులని చెప్పు. మనలను అసత్యవాదులని పాండవులు నమ్మరు. కాని ధర్మాత్ముడైన ధర్మరాజుకు రాజ్యభాగం ఇవ్వకుండా ఉండలేము కదా. మేము గర్వించి ఇవ్వకున్న శ్రీకృష్ణుని సారథ్యంలో అర్జునుడు ముల్లోకాలను క్షోభపెట్టగలడు. భీముని తలచిన దడ పుడుతుంది. నకుల, సహదేవుల పరాక్రమం సామాన్యం కాదు. ద్రుపద, సాత్యకులు తక్కువ వారు కాదు. వారి మిత్రులు కేకయ రాజు, పాండ్యుడు ఎవరికీ తీసి పోరు. ఇక ధర్మజుని ఆగ్రహం ఎదుర్కొనుట రుద్రునికైనా సాధ్యం కాదు. కనుక ధర్మజుని వద్దకు వెళ్ళి అతని తమ్ములకు ఆగ్రహం కలుగకుండా ప్రీతి కలిగేలా మాట్లాడు. శాంతి కలిగేలా మాట్లాడి కార్యం సఫలం చేసుకుని రా " అన్నాడు.
సంజయుని రాయబారం
[మార్చు]సంజయుడు ఉపప్లావ్యం చేరి అర్జునినితో కూడి ఉన్న శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళాడు. మరునాడు సభలో ధర్మజునితో " ధర్మజా ! నిన్ను కలుసుకోవడం నా అదృష్టం. మీ తండ్రి ధృతరాష్ట్రుడు మీరు ఇక్కడ క్షేమంగా ఉన్నందుకు ఆనందించాడు. మీ యోగ క్షేమం కనుక్కు రమ్మని నన్ను పంపాడు " అన్నాడు. ధర్మరాజు " మా పెదనాన్న దయ వలన మేము క్షేమంగా ఉన్నాము. మా క్షేమం కొరకు పెదనాన్న మిమ్ము పంపడం మా అదృష్టం. నిన్ను చూస్తూ వుంటే సాక్షాత్తూ మా పెదనాన్నను చుసినట్లున్నది. వారు క్షేమమా , వారి పుత్రులు క్షేమమా, మనుమలు క్షేమమా, భీష్మ ద్రోణ, కృప అశ్వథామలు క్షేమమా? కౌరవులు వారిని ఆదరిస్తున్నారా? బ్రాహ్మణులను కౌరవులు ఆదరిస్తున్నారా? వారికి మేమిచ్చిన గ్రామాలను దుర్యోధనుడు లాగుకొన లేదు గదా ? గురు ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు మా విషయంగా దోషములను ఎంచడం లేదు కదా! ఒక్కసారిగా పిడుగులవంటి అరవై తీష్ణ బాణములను ప్రయోగింప గల అర్జునుడి బాహుబలమును స్మరిస్తున్నారా! గద చేత ధరించి దట్టమైన అడవులలో సంచరించే మదపుటేనుగులాగా యుద్ధరంగంలో సంచరించే భీమసేనుడిని స్మరిస్తున్నారు గదా! మునుపు రాజసుయయాగ సందర్భంగా తన కెదురైన కళింగ రాజును జయించిన సహదేవుని, శిబిని, త్రిగర్త రాజులను జయించిన నకులుడిని స్మరిస్తున్నారా! దురాలోచనతో ద్వైత వనంలోకి ఘోషయాత్రకు వచ్చి బందీలైన ధృతరాష్ట్ర కుమారులను బంధ విముక్తి చేసిన భీమార్జునులను, ఆ సంగతిని స్మరిస్తున్నారా!" అన్నాడు. సంజయుడు దానిలోని అంతరార్ధం అర్ధం చేసుకుని తన వాదన వినిపించడం మొదలు పెట్టాడు " ధర్మజా! నీవు అడిగినట్లే అందరు కుశలంగా వున్నారు. సుయోధనుని చుట్టూ అవినీతి పరులు, దూరంహంకారులు, నీతి మంతులు, సత్వసంపన్నులు ఇలా అనేక ప్రవృత్తులు కలవారు ఉన్నారు.వారు ఒకరి మాట ఒకరు వినరు. కౌరవులు యుద్ధ ప్రసంగంలో మీ గురుంచి, వీరాగ్రేసరులైన భీమార్జునుల గురుంచి స్మరిస్తున్నారు. ధర్మజా! నీవు మంచి మనసుతో సంధి ప్రయత్నం చేసావు కాని వృద్ధుడైన దృతరాష్ట్రునికి మనసు నిలకడగా లేదు. కొడుకుల మాట కాదన లేక పోతున్నాడు. మనసులో మధన పడుతున్నాడు. కనుక అజాత శత్రువైన నీవు పెద్ద మనసు వహిస్తే బాగుంటుంది. ఇచ్చిన దానం తిరిగి స్వీకరించడం ధర్మమా? హస్థినాపుర ప్రజలు శత్రువులను ఎదుర్కొన్నప్పుడు మిమ్ములను తలచుకుంటున్నారు. పగవారికి కూడా హాని తలపెట్టరని మిమ్ము కీర్తిస్తున్నారు. ధర్మజా! శ్రీకృష్ణుని సమక్షంలో నిండు సభలో నీతమ్ములు వింటుండగా నాకు తోచినది చెప్తాను " అనగానే ధర్మరాజు " సంజయా నీవు చెప్పదలచినది చెప్పవచ్చు " అన్నాడు.
సంజయుడి దౌత్యం
[మార్చు]సంజయుడు అందరిని ఒక్క సారి పరికించి " మీ పెదనాన్న ధృతరాష్ట్రుడు శాంతిని కోరుతూ సంధి చేయమని శాంతి సందేశంతో నన్ను పంపాడు. ఇది పాండవులకు కూడా రుచిస్తే శాంతి ఏర్పడుతుంది. ఇది సంయమనం పాటించ వలసిన సమయం. మీరు ధర్మస్వరూపులు, శాంత స్వభావులూ. మీరు ఓ చిన్న దోషం చేసినా అది తెల్లని వస్త్రం మీద నల్లని మరకలా స్పష్టంగా కనినిపిస్తుంది. మీకు సుయోధనుని వలన కష్టం కలిగింది.. దానిని నీవు తుడిచి వేయాలి. యుద్ధం వలన జన నష్టం జరుగుతుంది. జయాపజయములు సుఖాన్ని ఇవ్వవు. బంధువులు, మిత్రులు, బాలలు, వృద్ధులు నశిస్తారు. అందరిని పోగొట్టుకుని ఎవరు మాత్రం సుఖ పడతారు. మీకు శ్రీకృష్ణుడు పెట్టనికోట, దృపదుడు, సాత్యకి మేరు పర్వతాలు. భీమార్జునులు అరివీర భయంకరులు ఇక నిన్ను గురించి చెప్పనవసరం లేదు. మిమ్ము దేవతలైనా జయించ లేరు. సుయోధనుని పక్షాన భీష్మ, ద్రోణ, కృపాచార్య, అశ్వత్థామ, కర్ణ, శల్యులు అతని కొరకు తమ ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. సుయోధనుని తమ్ములూ, కుమారులు అజేయులు. సోమదత్త, బాహ్లికులను శివుడు కూడా జయించ లేరు. ఇలాంటి వారు ఒకరితో ఒకరు యుద్ధానికి తలపడితే వినాశనం కాక ఇంకేమి మిగులుతుంది. కృష్ణార్జునలారా! మీకు చేతులెత్తి నమస్కరిస్తాను. మిగిలిన పాండవులు వారి బంధు మిత్రులందరికి సవినయంగా మనవి చేస్తున్నాను. పాండవులారా! శాంతించండి. ఆగ్రహమును వీడండి. మిమ్ము శరణు వేడుతున్నాను. ఇది సర్వలోక సమ్మతం. ఇందుకు భీష్మాదులు సంతసిస్తారు " అని పలికి కూర్చున్నాడు.
సంజయునికి ధర్మజుని స్పందన
[మార్చు]ధర్మరాజు " సంజయా! నా మాటలలో యుద్ధం అన్న మాట ధ్వనించిందా? మాకు మాత్రం యుద్ధమంటే ప్రియమా? యుద్ధానికి దిగకనే కార్య సాఫల్యత కలిగితే కావలసిన దేముంది. భీమార్జునులు జనహితమైన పనులే చేస్తారు కాని అప్రియములు చేయరు. దురాశకు పోయి యుద్ధానికి దిగితే యుద్ధం దుఃఖం కాక సుఖం ఇస్తుందా? సంజయా! మా పెదనాన్న ధృతరాష్ట్రుడు తాను అక్రమ మార్గాన నడుస్తూ నన్ను ధర్మ మార్గాన నడవమనడం న్యాయమా? తాము ఉత్తమ మార్గాన నడుస్తూ ఎదుటి వారికి చెబితే బాగుంటుంది. ఇప్పుడు మాకు సంపద లేదు, బలం లేదు. మమ్ము పిలిచి ఆదరించడానికి ధృతరాష్ట్రుడు వెర్రి వాడా? ఆయన ప్రవర్తన మాకు కొత్త కాదు అప్పుడే పెద్దల మాటలు వినని వాడు ఇప్పుడు వింటాడా? జూదపు సిరికి ఆశపడకూడదని విదురుడు అప్పుడు చెప్పిన మాటలు విని ఉంటే ఇప్పుడు ఇంత దూరం వచ్చేది కాదు. అతడు సుయోధనుడు విషం తాగమన్నా త్రాగుతాడు కాని మంచి మాటలు వింటాడా? దృతరాష్ట్రునికి సుయోధనుడు అత్యంత పరాక్రమ వంతుడని నమ్మకం. సుయోధనుడు కర్ణుని భుజబలంతో రాజ్యం నిష్కంటకం చేసుకోవాలని అనుకుంటున్నాడు. కానీ అది అతడి భ్రమ. ఎందుకంటే ఇంతకు ముందు అనేక యుద్ధాలు జారిగాయి. అప్పుడు కర్ణుడు కౌరవులను ఎందుకు గెలిపించ లేక పోయాడు. ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు, దుశ్సాసనుడు, కర్ణాదుల మాటలు వింటాడు కాని మంచి మాటలు వినరు. అన్నీ తెలిసిన నీవు ఇలా మాట్లాడటం అవివేకమా లేక లౌకికమా? భీష్మాదులకు యుద్ధం అంటే తెలియదా? ఆశాపాశ బంధితులై కళ్ళు కానని వారికి అర్జునిని గాండీవ కాంతులు పూర్తిగా గుడ్డి వారిని చేయక మానవు . సంజయా ! మా పరాక్రమం పొగుడుతూనే వారితో పోరి గెలవలేమని చెప్తున్నావు. నీకు పక్షపాత బుద్ధి ఏల. యుద్ధంలో గెలువగలమా లేదా అన్నది విడువుము. నీవు గుణవంతుడవు కనుక మా కోపం పోయేలా మాట్లాడావు. మేము ఇప్పటి వరకూ ఎవరికీ అపకారం చేయ లేదు ఇక ముందు అలాగే సహనంగా ఉంటాము. నిజంగా ధృతరాష్ట్రుడు మంచి వాడై మా మీద ప్రేమ ఉంటే మమ్ములను పిలిచి గౌరవించి మారాజ్యభాగం మాకు ఇచ్చి బంధుత్వం నిలుపమని చెప్పు. నీవు చెప్పినట్లు నేను గూడా శాంతిని వహిస్తాను, ఇంద్రప్రస్థం నా రాజ్యంగా ఉండు గాక " అన్నాడు.
సంజయుని ప్రతి స్పందన
[మార్చు]సంజయుడు లేచి " ధర్మజా! ఎన్ని తప్పులనైనా సహించి ఓర్పు వహించగలవు కనుకే ఇన్ని మాటలు చెప్పాను. నీవు నమ్మిన సత్యం, అహింసలే నీకు సంపదలు. కౌరవులు మీకు రాజ్యభాగం ఇవ్వకున్న, మీకు ఆ నెత్తురు కూటికన్నా, భిక్షమెత్తి జీవించుట మేలు కదా? నీవు యుద్ధ రూపమైన పాపమును చేయవద్దు. రాజసూయం నిర్వహించిన నీ చరిత్రను హింసతో కళంకితం చేసుకోకు. నీతో మాయాజూదం ఆడి నిన్ను అవమానపరచిన కౌరవులను లోక నిందితులను చేసావు. అరణ్యములలో కష్టాలు అనుభవించిన నీవు ఇలా నీచమైన యుద్ధానికి తలపడి బంధు మిత్రులను చంపుట ధర్మం కాదు. ఇంతకు ముందు కూడా ఈ శ్రీకృష్ణుడు, సాత్యకి ద్రుపదాదులు, శత్రుసంహారుకులయిన నీ తమ్ములు నీ వెంట వున్నా వనాలకు వెళ్ళారు గదా! దుర్యోధన, దుశ్శాసన, భీష్మ ద్రోణ కర్ణ శల్య బాహ్లీకాడులను చంపి నీవేం సుఖ పడతావు. చెప్పు. హాలాహలం దిగమింగిన ఈశ్వరుడిలా నీవు నీ కోపాన్ని దిగమింగి నీ కీర్తిని కాపాడుకో " అన్నాడు.
సంజయునికి ధర్మజుడు బదులిచ్చుట
[మార్చు]సంజయుని మాటలు విన్న ధర్మరాజు " సంజయా! నీవు పలికింది నిజమే. కర్మలలో ధర్మం శ్రేష్టమైనదనుట సత్యం. ఒక్కొక్క చోట ధర్మం అధర్మ రూపంలో కనపడుతుంది. మరొకచోట ధర్మం అధర్మంగా కనపడుతుంది. ఇంకొకచోట ధర్మం తన సహజమైన ధర్మ రూపాన్నే ధరిస్తుంది. విద్వాంసులు తమ బుద్ది చేత దాని అసలు రూపాన్ని చూడగలరు. ధర్మాధర్మాలు ఆపత్కాలంలో భిన్న లక్షణాన్ని పొందుతాయి. ఆపత్ధర్మం యొక్క స్వభావం వీరేగా ఉంటుదని తెలుసుకో. కనుక నన్ను నిందించదలచుకున్న నేను చేసినది అధర్మం అని నిరూపించి నిందించు. నువ్వు చెప్పినట్లు కోపం నివారించదగినది. అహింస పరమ ధర్మమే. కానీ లోక కంటకులను, వంశనాశకులను, పాపాత్ములను నిర్మూలించి ప్రజలను రక్షించుట క్షత్రియ ధర్మమని పెద్దలు చెప్పగా విన్నాను. ఈ భూమండలం మీదున్న సమస్త ధనం లభిస్తుందన్నా,దేవతల సంపత్తి లభిస్తుందన్నా, దానికంటే గొప్పదైన బ్రహ్మలోక వైభవం వస్తుందన్నా సరే నేను అధర్మం స్వీకరించను. ఇక్కడ ధర్మానికి అధినాయకుడు, నీతిజ్ఞుడు, కుశలుడు, కర్తవ్యాకర్తవ్యములను, ధర్మాధర్మములను నిర్ణయించుటకు శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఆ శ్రీకృష్ణుడు నేను చేయునది ధర్మమా అధర్మమా అని నిర్ణయించి చెప్పగలడు. అతడు రెండు వైపులా హితాన్ని కోరువాడు. అతని ఆధ్వర్యంలో అంధక, భోజక, యదు, వృష్టి, శృంజయ, కేకయ రాజులు నడుచుకుంటున్నారు. మాకు అతని మాట శిరోధార్యం " అన్నాడు.
సంజయునికి శ్రీకృష్ణుడి సమాధానం
[మార్చు]ఈ మాటలు విన్న శ్రీకృష్ణుడు " సంజయా! నేను పాండవుల మేలు కోరుకుంటున్నాను. అదే విధంగా దృతరాష్ట్రుని అభివృద్ధిని కూడా కాంక్షిస్తాను. నేను ఇద్దరినీ శాంతించమనే చెప్తాను. నా కోరిక కూడా అదే. నా వల్లగాని యుధిష్ఠిరుని వల్ల గాని ధర్మ లోపం జరుగదు. ఈ విషయం నీకు కూడా తెలుసు. ధృతరాష్ట్రుడు ఇప్పుడు తెలివి తెచ్చుకుని పాండవులను పరామర్శించడానికి నిన్ను పంపాడు. నీవూ నీకు తోచిన ధర్మాన్ని వినయంగా చెప్పావు. నీ శాంతి వచనాలు సంతోషం కలిగించాయి. పైకి సవ్యంగా కనిపిస్తున్నా ధర్మరాజు మాటలు సంధి పొసగదని భావిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ధర్మరాజు మాటలు సరి అయినవే. ఎందుకంటే పుత్రపక్షపాతి అయిన ధృతరాష్ట్రుడు కొడుకు మాటలు విని పాండవుల రాజ్యంను ఆశిస్తూ వుంటే ధృతరాష్ట్రుడి తీపి మాటలకు పాండవులు రాజ్య భాగం వదులుతారా? యుధిష్ఠిరుడు స్వధర్మాన్నే ఆచరిస్తాడు. ఒకవేళ తమ స్వధర్మాచరనలో దైవ వశం చేత మృత్యువును కూడా పొందవచ్చు. అది కూడా వారికి మంచిదే. నీకు అన్ని ధర్మాలు తెలుసు. గతాన్ని మరచి పాండవులు కౌరవులతో సఖ్యంగా బ్రతకాలని అనుకుంటున్నారు. అది వారి కరుణ గొప్పతనం. ధర్మం ప్రకారం తమ తండ్రి రాజ్యం పాండవులకు ఇవ్వకుంటే వారు యుద్ధానికి సన్నద్ధం కావడం అధర్మమా? అవమానాలు నిరంతరం సహిస్తూ బతకడం కంటే యుద్ధం చేయడం మేలు అని నాకు అనిపిస్తుంది. యుద్ధం క్షత్రియ ధర్మం కాదా? అని ధర్మరాజు అడిగాడు కదా! ద్విజులకు ధర్మాధర్మాలు నిర్ణయించిన పెద్దలు క్షత్రియులు యాచించ కూడదు వారు ఇవ్వడమే కాని తీసుకోకూడదు అని చెప్పిన విషయం లోక విదితం. వర్ణాశ్రమ ధర్మ రక్షకులైన క్షత్రియులు వారి ధర్మాన్ని వదులుతారా? ధర్మంగా సంపాదించిన సంపదను అధర్మ మార్గాన కాజేసిన వారిని శిక్షించడం ధర్మమని శాస్త్రాలు భోదించ లేదా? సంజయా! ఇక్కడ వచించిన ధర్మాలు కౌరవులకు చెప్పలేదా ? వారు కాదా అధర్మంగా ప్రవర్తించినది. వారు కాదా నిండు సభలో ద్రౌపదిని వలువలు లాగి అవమానించి పాండవులకు అవమానం కలిగించినది. లోకంలో జూదం ఎవరూ ఆడలేదా వారిని ఇలాగే అవమానించారా? పాండవులు సంధికీ సిద్ధమే యుద్ధం చేయడానికి సిద్ధమే. ఈ రెండు పరిస్థుతులు గ్రహించి నీవు ధృతరాష్ట్రుడికి వున్నది ఉన్నట్లుగా చెప్పు" అని సంజయుడిని నిలదీశాడు
శ్రీకృష్ణుడు కౌరవుల తప్పులను ఎత్తి చూపుట
[మార్చు]సంజయుడు " కృష్ణా! నీవే ఇలా మాట్లాడితే సంధి ఎలా పొసగుతుంది? " అన్నాడు. శ్రీకృష్ణడు " ఆ రోజు సభలో భీష్మ, ద్రోణ, కృపాచార్యులు నోరు మెదిపారా? కుమారుల అకృత్యాలను దృతరాష్ట్రుడు ఆపగలిగాడా! దుశ్శాసనుడు వదిన అని చూడక ద్రౌపదిని నిందిస్తూ సభకు ఈడ్చుకు వస్తుంటే మామగారైన దృతరాష్ట్రుడు ఎలా సహించాడు ఆమె ఏడ్పులు వినిపించ లేదా ? విని ఓర్చుకున్నాడా! ఇప్పుడు తగుదునమ్మా అని పాండవుల యోగక్షేమం కనుక్కుని రమ్మన్నాడా! భార్యను అవమానిస్తుంటే పాండవులు మిన్న కున్నారు. ఆమె తనను తాను రక్షించుకున్నది కాబట్టి కౌరవులు బ్రతికి పోయారు లేకుంటే ఆరోజే చచ్చి ఊరకుండే వారు. పాండవులు ఎల్ల కాలం ఇలాంటి అవమానాలను సహించి ఊరకుండవలసినదేనా ! సభలో కర్ణుడు " జూదంలో నీ భర్తలు నిన్ను ఓడారు కనుక వారు ఉండీ లేనట్లే . కనుక సభలో నీకు నచ్చిన వారిని భర్తగా ఎంచుకో అనలేదా ! " శూలాలలా ఆ మాటలు ద్రౌపదిని బాధించిన విషయం నీకు తెలవదా? దుశ్శాసనుడు " ఇక్కడ రోషం ఉన్న మగాడెవరు? నీకు భర్తలు ఉండీ లేనట్లే " అన లేదా? పాండవులు అప్రయోజకులే అయినా అలా మాట్లాడటం వలన వారికి కలిగిన మేలు ఏమి? ఆ తరువాత జరిగినవి సభలో చెప్పతగినవి కాదు. ఈ సంధి పొసగదు. అయినా పాండవులకు నచ్చ చెప్పి నేను ఒప్పించి హస్థినకు వస్తాను. కౌరవులకు బుద్ధి చెప్పి వారి రాజ్య భాగం వారికిమ్మని అడుగుతాను ఇస్తారా బ్రతికి పోతారు. ఏమైనా కుటిలోపాయం చేసారా పాండవుల బాణాగ్నికి వారు సమూలంగా నాశనం కావడం తథ్యం. అలా జరగదని ఆశిస్తున్నాను. సంజయా! సుయోధనుడు రోషంతో కూడిన మహా వృక్షం.దానికి కాండం కర్ణుడు, కొమ్మలు శకుని ఫల పుష్పాదులు దుశ్శాసనాది సోదరులూ ఇతరులు దానికి మూలం దృతరాష్ట్రుడు. అలాగే ధర్మరాజు ధర్మము అనే మహావృక్షం దానికి అర్జునుడు కాండం భీముడు శాఖోపశాఖలు ఫలపుస్పాలు నకుల సహదేవులు ఈ వృక్షానికి మూలం సద్భ్రాహ్మణులు, వేదములు. నిష్పక్షపాతంగా యోచించి రెండింటిలో ఏది మేలో నీవే చెప్పు. పుత్రులతో కూడిన దృతరాష్ట్రుడు ఒక మహారణ్యం. పాండుపుత్రులు అందులో సంచరించే సింహాలు. సింహాలు లేని అడవిని కొట్టేస్తారు. అడవి లేక సింహాలు మనజాలవు. కనుక రెండు ఒకరిని ఒకరూ ఆశ్రయించుకుంటే అందరికీ మేలే. నేను హస్తినకు వస్తాను దృతరాష్ట్రుడు పాండవులను కుమారులలా ఆదరిస్తే వారు కౌరవులను అనుసరించి ఉంటారు.నా మాట అంగీకరిస్తాడో లేదో చూసి కర్తవ్యం నిర్ణయిస్తానని దృతరాష్ట్రుడికి నికి చెప్పు " అన్నాడు.
ధర్మరాజు కౌరవుల ప్రముఖులకు ప్రణామములు చెప్పుట
[మార్చు]సంజయుడు " నేను వచ్చిన పని సఫలం అయిందని ఆశిస్తాను " అని దృపదాదులను చూసి " నాకు అనుజ్ఞ ఇస్తే నేను పోయి వస్తాను . ధర్మజా! నా పలుకులలో తప్పేమి లేదు కదా? " అన్నాడు. ధర్మరాజు " సంజయా! నీ పలుకులలో అనుచితంలేదు అధర్మమైన మాటలు నీవు చెప్పవు కదా! నీ ఓర్పు నేర్పు ఎవరికి ఉంటాయి చెప్పు. నీవు హస్థినకు పోయి తాత భీష్మునకు , గురువు ద్రోణునకు, కృపాచార్యునకు నా నమస్కారాలు అందచెయ్యి. మా తండ్రి దృతరాష్ట్రునికి నమస్కరించానని చెప్పు . దుర్యోధనుని సోదర సమేతంగా క్షేమమడిగానని చెప్పు. విదురుని , శల్యుని వినయంగా అడిగినట్లు చెప్పు. అశ్వద్దామను అక్కున చేరుకున్నానని చెప్పు. బాహ్లికుని, సోమదత్తుని ప్రియంగా పలుకరించానని చెప్పు. కర్ణుడు, శకుని, సైంధవుడు, కృతవర్మలకు వృద్ధులైన రాజులకు మాతో యుద్ధం చేయ సిద్ధమైన సకల రాజులకు ఎవరికి తగినట్లు వారికి సముచిత రీతిలో వినయంగా, వాత్సల్యంగా, బంధుప్రీతిగా నా ప్రణామములు అందచెయ్యి. శత్రువులను జయించి మేము దాసదాసీ జనములను ఉదాసీనపరచకుండా ఆదరించగలమని చెప్పు.
ధర్మరాజు కౌరవులకు పంపిన సందేశం
[మార్చు]మా తండ్రి దృతరాష్ట్రుడు సభలో ఉండగా " అనఘా! శంతనుని రాజ్యాన్ని కాపాడుతున్న నీవు మమ్మునాదరించి చిన్న వయస్సులోనే మారాజ్య భాగాన్ని మాకిచ్చి ఆదరించావు. అలాగే ఇప్పుడు మాకు సంధి చేసి సకల ప్రజానీకాన్ని రక్షించి రాజ్యాన్ని అధర్మం నుండి కాపాడమని చెప్పు. అలా చేస్తే బ్రాహ్మణులు, రాజులు సంతోషిస్తారని చెప్పు అలాగే తాత భీష్మునితో పాండవులు ఇప్పటికీ శాంతి కాముకులని చెప్పు. యుద్ధం తలపెట్టరని చెప్పు. సుయోధనునితో మేము అత్యంత బలవంతులమైనా మమ్ములను రాజ్యం నుండి వెళ్ళగొట్టిన నీ వెర్రి తనం, అడవులలూ వెన్నంటి వచ్చి మమ్ము కష్టపెట్టిన నీ దురుసుతనం, నిండు సభలో ద్రౌపదిని అవమానించిన నీ తులువతనం ధర్మరాజు సహించాడు అని చెప్పు. అతనిని అతని సోదరులను యుద్ధభూమిలో మరణించ వలదని చెప్పు, పరుల సొమ్ముకు ఆశించక మా రాజ్యభాగం మాకిచ్చి క్షేమంగా ఉండమని చెప్పు, యుద్ధానికి దూరంగా ఉండటం వారికే మేలని చెప్పు, సుయోధనునికి ఎవరూ చెప్పేవారు లేక నేను పెద్ద వాడిని కనుక చెప్తున్నాను, మావైపు ఉన్న ధర్మం అతని వైపు ఉన్న అధికబలాన్ని మహా వీరులను హరించగలదని చెప్పు, శ్రీకృష్ణుడు మా పక్షంలో ఉన్నందున మేము జయించగలమని చెప్పు. నా మాట మన్నించి యుద్ధానికి దూరంగా ఉండి అందరినీ కాపాడమని చెప్పు. ఎవరి రాజ్యం వారు చేస్తూ సఖ్యంగా సుఖంగా ఊందామని చెప్పానని చెప్పు, మాకు అర్ధరాజ్యం ఇవ్వ లేకున్న కుశస్థలి, వృక్షస్థలి, వాసంతి వారణావతం ఇచ్చి యుద్ధాన్ని నివారించిన బంధు మిత్రులు క్షేమంగా ఉండగలరని చెప్పు. ఇందు వలన కురు, పాంచాల, మత్స్య, యాదవ, వృష్టి రాజులు పరస్పరం సఖ్యంగా ఉండగలరని చెప్పు. సంజయుడు " ధర్మజా! మీరు ఆనతి ఇచ్చిన ప్రకారం చేస్తాను. మీ తండ్రి గారికి, మీకు, మీ సోదరులకు, వాసు దేవునికి ప్రియంకలిగేలా చేస్తానని విశ్వసిస్తున్నాను " అన్నాడు. అర్జునుడు " మిత్రమా! నీవు నాకు బాల్య మిత్రుడవు. నీ మంచితనం మాకు తెలుసు. ఆ రోజు ధర్మరాజు దయాగుణం అనే అంకుశంతో భీముని ఆపాడు. ఈ రోజు అదే జరుగుతుంది. ఇక సుయోధనునికి విచారమెందుకు వెళ్ళిరా " అన్నాడు. సంజయుడు అందరి వద్ద శలవు తీసుకుని హస్తినకు బయలుదేరాడు.