Jump to content

అహల్య

వికీపీడియా నుండి


Ahalya
దేవనాగరిअहल्या
సంప్రదాయభావంRishi (sage)
ఆవాసంGautama's hermitage
భార్యGautama

(సంస్కృతం: अहल्या) గౌతమ మహర్షి భార్య.

ఈమె వృత్తాంతము రామాయణములో పేర్కొనబడినది. గౌతమ మహర్షి శాపము వలన అదృశ్య రూపముల కప్పబడి తీవ్ర తపస్సు చేసిన అహల్య, రాముని దర్శనము తో శాప విమోచనమై తిరిగి యధా రూపము ధరించిందని కొన్ని రామాయణ వృత్తాంతాలలో పేర్కొనబడినది. వీరికి నలుగురు కుమారులు, వారిలో జేష్టుడు శతానంద మహర్షి.

పుట్టుక

[మార్చు]

బ్రహ్మ అహల్యను అత్యంత సౌందర్యవతిగా సృష్టించాడు. దేవతలందరూ ఆమెను పరిణయమాడాలనుకున్న వారే. అప్పుడు బ్రహ్మ త్రిలోకాలను ఎవరైతే ముందుగా చుట్టి వస్తారో ఆమెను వివాహమాడడానికి అర్హులని ప్రకటిస్తాడు. ఇంద్రుడు తన శక్తులన్నింటినీ ఉపయోగించి ముల్లోకాలను తిరిగి వచ్చి అహల్యను ఇచ్చి వివాహం జరిపించమని బ్రహ్మను కోరుతాడు. అప్పుడు నారదుడు వచ్చి గౌతముడు ఇంద్రుడికంటే ముందుగా ముల్లోకాలను చుట్టి వచ్చాడని చెపుతాడు. గౌతముడు తన దైనందిన పూజలో భాగంగా గోవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడని. ఒకరోజు అలా ప్రదక్షిణ చేస్తుండా ఆవు లేగ దూడకు జన్మనిచ్చిందనీ, శాస్త్రాల ప్రకారం శిశువును ప్రసవిస్తున్న ఆవు ముల్లోకాలతో సమానమనీ అందుకే అతనికి ఆ ఫలితం దక్కిందనీ తెలియజేస్తాడు. కాబట్టి అహల్యను గౌతముడికే ఇచ్చి పెళ్ళి చేయమని చెపుతాడు.

శాపము

[మార్చు]
రాముని పాదము రాయిని తాకిన తరువాత అహల్యగా మారుచున్నరాయి

ఒకరోజు అహల్య భర్తయైన గౌతముడు ఉదయాన్నే నదీ స్నానానికి వెళ్ళగా ఆమె మీద కోరికతో దేవేంద్రుడు ఆమె భర్త రూపంలో వచ్చి కోరిక తీర్చమని అడుగుతాడు. ఇంద్రుడి మోసం తెలిసీ అహల్య అందుకు అంగీకరిస్తుంది.(मुनि वेशम् सहस्राक्शम् विज्ञा रघुनन्दना - సంస్కృత రామాయణం, బాలకాండ, 48వ సర్గ, 19వ శ్లోకము). అదే సమయానికి గౌతముడు తిరిగివచ్చి ఆమెని శపిస్తాడు. “ ఇహవర్ష సహస్రాణి బాహూని నిసిశ్యసి.వాయు భక్ష్యా నిరాహారా తప్యాని భస్మశాయినీ. అదృశ్య సర్వ భూతానాంఆశ్రమే అస్మిన్ నివసిష్యసి” (సంస్కృత రామాయణం, బాలకాండము, 48వ సర్గ,30వ శ్లోకము.) అనగా, “బహు సంవత్సరాలునీవు గాలిని భక్షిస్తూ ఆహారము లేక తపస్సు చేసుకుందువు. నీపైన పరాగము(బూడిద) కప్పబడుతుంది. నీవెవరికీ కనబడవు. అదృశ్య రూపమున ఇక్కడనే తపస్సు చేసికొనుము. “ , త్రేతా యుగంలో మహా విష్ణువు రాముని అవతారమెత్తి ఆయన పాదధూళిచే (ఆయన రాక వలన, దర్శనము వలన) ఆమెకు శాపవిమోచనం అవుతుందని తెలియబరుస్తాడు. (శ్రీమత్ ఆంధ్ర వాల్మీకి రామాయణము, యదాతథ అనువాదము, వావికొలను సుబ్బారావు గారు, 1932). అలాగే ఇంద్రుణ్ణి తన శరీరమంతా స్త్రీ జననేంద్రియాలతో నిండిపోయేలాగా శపిస్తాడు. వృషణాలు నేలరాలిపోయేటట్లు చేస్తాడు. కానీ ఇంద్రుడు ఇతర దేవతల సాయంతో ఒక జీవాన్ని బలి ఇచ్చి దాని వృషణాలను అతికించేటట్లు చేస్తాడు. అమ్మవారిని గురించి తపస్సు చేసి తన శరీరంపై ఉన్న స్త్రీ జననేంద్రియాలను కన్నులులాగా కనిపించేటట్లు వరం పొందుతాడు. అందుకనే ఆయన్ను సహస్రాక్షుడు అని కూడా వ్యవహరిస్తారు. “ఇట్లు అహల్య శిలగానయ్యెనని కొన్ని గ్రంధములయందు గలదు. కానియది వాల్మీకి మతముగాదు. దుఃఖభావము లేక శిలవలె యుండిన, పాపఫలమేమి అనుభవించినట్లు? కావున నహల్య స్త్రీగానుండియే తపమాచరించెను. “ - వావికొలను సుబ్బారావు గారు, వాల్మీకి రామాయణ ఆంధ్ర అనువాద కర్త.

విమోచనం

[మార్చు]

గౌతముడు చెప్పినట్లుగానే త్రేతాయుగంలో శ్రీరాముడు తమ గురువైన విశ్వామిత్రుడు, లక్ష్మణుడితో కలిసి గౌతమ మహర్షి ఆశ్రమం గుండా సీతా స్వయంవరానికి వెళుతుంటారు. నిర్మానుష్యమైన, కళావిహీనమైన ఆ ఆశ్రమాన్ని చూచి అది ఎందుకు అలా ఉంది? అని రాముడు విశ్వామిత్రుని ప్రశ్నించగా , ఆయన వారి వృత్తాంతాన్ని రాముడికి వివరిస్తాడు. రాముడు వేంచేయటముతో అక్కడితో అహల్యకు శాపవిమోచనము కలిగినదని వివరిస్తాడు. వాల్మీకి రామాయణములో అహల్య శిలగా వుండుట, రాముడు శిలను కాలితో స్పర్శించుట అనునది లేదు, ఇక్కడ శిల అనునది , కదలకుండా , తీవ్ర తపోనిష్ఠలో వుండుటకు వ్యుత్పత్తి అనుకోవచ్చును. పరాగము కప్పబడి ఆ ప్రాంతమంతయు అహల్య అదృశ్యరూపములో అహల్య వుండెను. శ్రీరాముని పాదస్పర్శ యనిన ఇక్కడ గౌతమముని ఆశ్రమములో రాముడు పాదములు మోపుట అని భావింపవలెను. అనగా, కేవలము శ్రీరాముని ఉనికి మాత్రం చేత గౌతమముని ఆశ్రమము నందు అహల్యకు శాపవిమోచనము కలిగెనను. గౌతముడు కూడా వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యి సీతా స్వయంవరంలో జయం కలిగేలా దీవిస్తాడు.

మూలాలు

[మార్చు]

https://sanskritdocuments.org/sites/valmikiramayan/baala/sarga48/balaitrans48.htm - https://www.freegurukul.org/z/Ramayanam-106 - page 841