Jump to content

వాము

వికీపీడియా నుండి

వాము
వాము మొక్క పూలు '
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
T. ammi
Binomial name
Trachyspermum ammi
Synonyms[1][2]
  • Ammi copticum L.
  • Carum copticum (L.) Link
  • Trachyspermum copticum Link
వాము గింజలు

వాము వంటలలో ఉపయోగించే ఒక విధమైన గింజలు. వాము లేదా ఓమను సంస్కృతం లో దీప్యక అని, హిందీలో అజ వాన్‌ అని అంటారు. వాము మొక్క మొత్తం సువాసన కలిగి ఉంటుంది. పువ్వులు గుత్తులు గుత్తులుగా ఉంటాయి. ఈ పువ్వులనుంచే విత్తులు వస్తాయి. వాము శరీరంలో వాతాన్ని హరింపజేస్తుంది. శూలలను తగ్గిస్తుంది. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. కడుపు ఉబ్బరం, ప్లీహవృద్ధిని తగ్గిస్తుంది. వాంతులను తగ్గిస్తుంది. గుండెకు కూడా అత్యంత ఉపయోగకారి. దీని శాస్త్రీయ నామము ట్రాకీస్పెర్మమ్ కాప్టికమ్ (Trachyspermum copticum).

వాము భారతీయులకు తెలిసిన గొప్ప ఓషధి. దీనిని భారతదేశమంతటా పండిస్తారు. ఎక్కువగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంతో సహా మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సాగుచేస్తారు. చలి వాతావరణంలో బాగా పెరుగుతుంది. ఇది తెల్లని పూలు కలిగిన చిన్న ఏక వార్షికపు మొక్క. దీని గింజల నుంచి సుగంధ తైలాన్ని డిస్టిలేషన్ విధానం ద్వారా వేరుపరిచి థైమాల్‌గా మార్కెట్ చేస్తుంటారు.

వంటింట్లో వాము[3]

[మార్చు]

వాము సాధారణంగా అన్ని ఇళ్లల్లో కనిపించేదే. వంటింట్లో ఇదో దినుసు. ఆహారం జీర్ణం కానపుడు 'కాసింత వాము వేణ్ణీళ్లతో కలిపి నమలవే. సమస్య తీరిపోతుంది' అని పెద్దలు అంటూంటారు. సాధారణంగా వామును చక్రాలలో (జంతికలు, మురుకులు) వాడుతుంటారు. వాము జీర్ణశక్తికి మంచిది. వాము జీలకర్రలా అనిపించినా వాము గింజ జీలకర్ర కంటే పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది. రుచి కొంచెం ఘాటుగా, కారంగా ఉంటుంది. రూపంలో చిన్నదైనా, అది చేసే మేలు మాత్రం పెద్దది.[4].వాము గింజల నుండివాము ఆవశ్యక నూనెను స్టీము డిస్టిలేసను ప్రక్రియ ద్వారా సంగ్రహిస్తారు.

ఔషధోపయోగాలు[5]

[మార్చు]
  • వాంతులు: వామును నీళ్లలో నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి.
  • జ్వరం: వాము, ధనియాలు, జీలకర్ర - ఈ మూడింటినీ దోరగా వేయించి కషాయం చేసి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది.
  • అజీర్ణం: వాము, మిరియాలు, ఉప్పు సమభాగాలుగా తీసుకుని, చూర్ణం చేసి ప్రతిరోజూ భోజనానికి ముందు సేవిస్తుంటే అజీర్ణం, ఉదరశూల తగ్గుతాయి.
  • దంత వ్యాధులు: వామును త్రిఫలాలనే కరక్కాయ, ఉసిరికాయ, తానికాయ లతో కలిపి ముద్దగా నూరి దంతాల మూలాలలో పెట్టుకుంటే అన్ని రకాలైన దంత వ్యాధులు తగ్గుతాయి.
  • వాత వ్యాధులు: వాము నూనె అన్ని వాత వ్యాధులకు ఎంతో ఉపయోగకారి.
  • గొంతులో బాధ: వామును బుగ్గన పెట్టుకుని నమిలి చప్పరిస్తూ రసాన్ని మింగితే గొంతులో నొప్పి, గొంతులో గురగుర శబ్దాలు తగ్గుతాయి.
  • మూత్రాశయంలో రాళ్ళు: వామును వివిధ అనుపానాలతో సేవిస్తే మూత్రపిండాలలో, మూత్రాశయంలో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది. వాము, వెనిగార్‌ లేక తేనెతో కలిపి వారం తీసుకుంటే మూత్రపిండాలలో ఉన్న రాళ్లు మూత్రం ద్వారా వెళ్లిపోతాయని ఆయుర్వేదం చెబుతోంది.
  • చనుబాలు వృద్ధి: ప్రసవానంతరం స్త్రీలు వామును వాడితే చనుబాలు వృద్ధి అవుతాయి.
  • జలుబు, తలనొప్పి: జలుబు, మైగ్రెయిన్‌ తలనొప్పికి ఇది మంచి మందు. వాము పొడిని ఒక గుడ్డలో కట్టి మెల్లగా వాసన చూస్తే సమస్య తీరిపోతుంది.
  • ఆస్తమా: ఆస్తమా వ్యాధిగ్రస్తులు వాము, బెల్లం కలిపి తీసుకుంటే మంచిది.
  • గుండె వ్యాధులు: గుండెవ్యాధులు రాకుండా నివారించడంలో వాము ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
  • కీళ్ళ నొప్పులు: వామునూనె కీళ్లనొప్పులను తగ్గిస్తుంది.
  • కాలిన గాయాలకు: కాలిన గాయాలకు ఇది మంచిదని వైద్యశాస్త్రం చెబుతోంది.
  • దంత సమస్యలకు: పంటినొప్పికి వామును గోరువెచ్చని నీటితో నమిలి పుక్కిలించి చూడండి.
  • దగ్గు: దగ్గు వచ్చినపుడు వేడినీటిలో కొద్దిగా వాము తీసుకుని నమలాలి. వాముకు తమలపాకు కలిపి రాత్రిపూట నమిలితే రాత్రి పొడిదగ్గు రాదు.

ఆయుర్వేదంలో వాము

[మార్చు]
  • ఆకలి పెంచటానికి: వాము చూర్ణాన్ని, బిడా లవణాన్ని ఒక్కొక్కటి రెండు గ్రాములను అర గ్లాసు మజ్జిగకు కలిపి తీసుకుంటే ఆకలి పెరుగుతుంది. అరుగుదల పెరుగుతుంది. శరీరంలోపల పెరిగే బల్లలు కరిగిపోతాయి. (చరకసంహిత, వృందమాధవ).
  • అర్శమొలలు తగ్గించుటకు: వాము చూర్ణం, చిత్రమూలం వేరు చూర్ణం ఒక్కొక్కటి రెండేసి గ్రాముల చొప్పున ఒక గ్లాసు మజ్జిగకు కలిపి తీసుకుంటే అర్శమొలలు తగ్గుతాయి.
  • ఆహారం అరుగుదలకు: వాము, శొంఠి, చిరుబొద్ది, దానిమ్మ రసం, బెల్లం వీటిని ఉప్పు కలిపిన మజ్జిగతో తీసుకుంటే అరుగుదల పెరుగుతుంది.
  • కడుపునొప్పికి: వాము, సైంధవ లవణం, కరక్కాయ పెచ్చులు, శొంఠి వీటి చూర్ణాలను సమంగా కలిపి రెండు గ్రాముల మోతాదుగా అరకప్పు వేడి నీళ్లకు కలిపి తీసుకుంటే కడుపునొప్పి తగ్గుతుంది.
  • దద్దుర్లు తగ్గించుటకు: వామును బెల్లంతో కలిపి వారంపాటు తీసుకుంటే దద్దుర్లు తగ్గుతాయి.
  • కొండనాలుక వాపు తగ్గుటకు: వామును బుగ్గనుంచుకొని రసం మింగుతుంటే కొండనాలుక వాపు తగ్గుతుంది. ఇలా ఒక పగలు, ఒక రాత్రి నిరంతరమూ చేయాలి.
  • దంత సమస్యలకు: రాత్రిపూట వామును, వస కొమ్మును సమభాగాలను పలుకులుగా చూర్ణించి చిటికెడు మోతాదుగా నోట్లో ఉంచుకొని దంతాలమధ్య ఒత్తిపట్టి ఉంచుకుంటే దంత సంబంధ సమస్యలు తగ్గుతాయి.
  • ముక్కుదిబ్బడ, తల నొప్పి: 200నుంచి 250 గ్రాముల వామును పెనంమీద వేడి చేసి, మెత్తని పల్చని నూలుగుడ్డలో పోసి మూటగాకట్టి పెనంమీద వేడి చేసి బాగా గాఢంగా వాసన పీల్చితే తుమ్ములు వచ్చి ముక్కు దిబ్బడ, జలుబు, తలనొప్పి వంటివి తగ్గుతాయి.
  • ముక్కు దిబ్బడ: ఒక గుప్పెడు వామును కచ్చాపచ్చాగా దంచి ఒక నూలు గుడ్డలో మూటకట్టండి. దీనిని పిల్లలు పడుకునే దిండు పక్కన ఉంచండి. దీని నుంచి వచ్చే ఘాటు వాసనకు పసి పిల్లల్లో ముక్కుదిబ్బడ తొలగిపోతుంది.
  • ఉబ్బసం, బ్రాంకైటిస్: ఒక గుప్పెడు వామును కాటన్ గుడ్డలో మూటగా చుట్టండి. దీనిని ఒక పెనం మీద వేడి చేయండి. సుఖోష్ణ స్థితిని తడిమి చూసి ఛాతిమీద మెడమీద ప్రయోగిస్తే ఉబ్బసం, బ్రాంకైటిస్ వంటి సమస్యలు తగ్గుతాయి.
  • జలుబు: పావు టీ స్పూన్ వాము చూర్ణాన్ని, ఒక టీ స్పూన్ పసుపును ఒక బొవెన్‌లో తీసుకోండి. ఒక టీ కప్పు వేడి నీళ్ళు కలపండి. దీనిని ఒక టేబుల్ స్పూన్ మోతాదుగా, ఒక టీ స్పూన్ తేనె కలిపి తీసుకుంటే జలుబు, జలుబువల్ల వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి.
  • కఫం: అర లీటర్ మరిగే నీళ్లకు ఒక టీ స్పూన్ వాము చూర్ణాన్ని, ఒక టీ స్పూన్ పసుపు చూర్ణాన్ని కలిపి చల్లార్చండి. దీనిని ఒక టేబుల్ స్పూన్ మోతాదుగా, ఒక టీ స్పూన్ తేనె కలిపి తీసుకుంటే, జలుబు ఛాతిలో కఫం పేరుకుపోవటం వంటి సమస్యలు తగ్గుతాయి.
  • దగ్గు: అర టీ స్పూన్ వామును, రెండు లవంగాలను, ఒక చిటికెడు ఉప్పును కలిపి చూర్ణించి అరకప్పు వేడి నీళ్లకు కలిపి కొద్దికొద్దిగా చప్పరిస్తూ తాగితే దగ్గు తగ్గుతుంది.
  • ఊపిరితిత్తుల మార్గం శుభ్రం: రెండు టీ స్పూన్ల వామును మెత్తగా దంచండి. ఒక గ్లాసు మజ్జిగకు కలిపి తీసుకుంటే కఫం పల్చబడి ఊపిరితిత్తుల్లోకి గాలిని చేరవేసే మార్గాలు శుభ్రపడతాయి.
  • తలనొప్పి, పడిసెం: వాము చూర్ణాన్ని రెండునుంచి మూడు గ్రాములు వేడి నీళ్లలో గాని లేదా వేడి పాలతో గాని రోజుకు రెండు లేదా మూడుసార్లు తీసుకుంటే జలుబు, తలనొప్పి, పడిశము వంటివి తగ్గుతాయి.

సూచికలు

[మార్చు]
  1. "USDA GRIN entry". Archived from the original on 2012-04-27. Retrieved 2013-11-13.
  2. [1] ITIS entry for Trachyspermum ammi
  3. వంటింట్లో వినియోగం[permanent dead link]
  4. |వంటింట్లో వుండె వాముతొ మీకు కొన్ని లభాలు
  5. ఆయుర్వేద వైద్యంలో వాము[permanent dead link]

ఇతర లింకులు

[మార్చు]
  • Ajwain[permanent dead link] from The Encyclopedia of Spices
  • Ajwain page from Gernot Katzer's Spice Pages
  • Hawrelak, JA; Cattley, T; Myers, SP (2009). "Essential oils in the treatment of intestinal dysbiosis: A preliminary in vitro study". Alternative medicine review : a journal of clinical therapeutic. 14 (4): 380–4. PMID 20030464.

ఇతర పఠనాలు

[మార్చు]

Hill, Tony. (2004) "Ajwain" in The Contemporary Encyclopedia of Herbs and Spices: Seasonings for the Global Kitchen. Wiley. p. 21-23. ISBN 978-0-471-21423-6.