తులసి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తులసి
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
ఓ. టెన్యుయిఫ్లోరమ్
Binomial name
ఓసిమం టెన్యుయిఫ్లోరమ్
Synonyms

ఓసిమం శాంక్టమ్ లి.

తులసి (ఆంగ్లం Tulasi, Tulsi, Holy Basil) ఔషధీ పరంగానూ, హిందూ సంప్రదాయాలలోనూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న మొక్క. దీని శాస్త్రీయ నామం ఓసిమం టెన్యూఫ్లోరం (Ocimum tenuiflorum). ఇందులో రెండు జాతులున్నాయి. ముదురు రంగులో ఉండే జాతిని కృష్ణ తులసి అనీ, కొంచెం లేత రంగులో ఉండేదానిని రామతులసి అనీ అంటారు. వీటిలో సాధారణంగా కృష్ణతులసిని పూజకు వాడుతారు. ఆయుర్వేద ఔషధాలలో కూడా కృష్ణతులసిని అధికంగా వాడుతారు. షోడశోపచార పూజా విద్ధానములో తులసికి విశిష్ట స్థానం ఉంది.నేడు విదేశీయులు సైతం తులసిలోని విశేషమును అంగీకరించుచున్నారు. పరమపవిత్రమైనదిగా భావించే తులసి కోట అన్ని ఇళ్ళల్లో ఉంటుంది. హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తులసీ పత్రాలను దేవతార్చనలో వాడతారు. ఈ పత్రి తులసీ వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు ఏడవది.

తులసి ప్రాముఖ్యత

హిందూ మతంలో, ప్రత్యేకించి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో తులసి మొక్క పట్ల ఎంతో భక్తి, పూజావిధానాలు ఉన్నాయి. ఆడువారు తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండడానికి తులసిని పూజిస్తారు. తులసి పూజకు సంబంధించి చాలా విధానాలు, నియమాలు, వ్రతాలు, పండుగలు, స్తోత్రాలు, భక్తి గేయాలు ఆచారంలో ఉన్నాయి. తులసి తీర్థం అన్నమాట తరచు వింటాము. తులసి తీర్థం లేదా తులసి రసం భారతీయ సాంప్రదాయంలో ప్రముఖ స్థానాన్ని కలి ఉంది. దీన్ని సర్వరోగ నివారణిగా భావిస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం మనిషి చనిపోయే ముందు నోటిలో తులసి తీర్థం పోస్తారు. తులసి 24 గం.లూ ప్రాణవాయువును వదులుతూ ఉంటుంది. ఆ వాయువును పీల్చుట వలన ' యజ ' చేయగా వచ్చు ఫలితము వచ్చుచున్నది.కావున ప్రతి ఇంట్లో కనీసం 10 మొక్కలయినా పెంచి, వాతావరణ కాలుష్యాన్ని నివారించి, ఆరోగ్యాన్ని రక్షించుకొని, తులసి తీర్థం సేవించండి. త్రికాలములందు తులసిని సేవించినచో అనేక చాంద్రాయణ వ్రతములకంటే మిన్నగా శరీరశుద్ధియగును.తులసి యొక్క సువాసన వ్యాపించి ఉన్న వాతావరణంలో నివసించు ప్రాణికోటి పవిత్రులు, నిర్వికారులు కాగలరు.తులసి మొక్క వున్న చోట త్రిమూర్తులు మొదలగు సర్వ దేవతలు నివసింతురు.తులసి దళములందు పుష్కరాది తీర్ధములు, గంగ మొదలగు నదులు, వాసుదేవది దేవతలు నివసింతురు.

వేలాది సంవత్సరాలుగా ఆయుర్వేదంలో తులసి ఒక ముఖ్యమైన ఔషధిగా వాడబడుతున్నది. రెండు వేల సంవత్సరాలకంటే పురాతనమైన ఆయుర్వేద గ్రంథం చరక సంహితంలోనూ, అంతకంటే పురాతనమైన ఋగ్వేదంలోనూ కూడా తులసి ప్రస్తావన ఉంది. తులసిని ఇంకా చాలా గృహ వైద్యంచిట్కాలలో కూడా వాడుతారు. దీని ఔషధీగుణంపై ఇప్పుడు మరింత పరిశోధన జరుగుతున్నది. అనేక ఆధునిక ఔషధాలలో కూడా తులసిని వాడుతున్నారు. శరీరంలో వివిధ ప్రక్రియలను సమతుల్యం చేసే ప్రభావం ఉన్న అనుకూలంగా తులసిని గుర్తించారు. కనుక మానసిక వత్తిడిని తగ్గించే ప్రభావం, ఆయుర్వృద్ధి కలిగించే ప్రభావం తులసిలో ఉన్నాయని అభిప్రాయుం. ఇదే జాతికి చెందిన థాయ్ బేసిల్ మొక్కను ఒకోసారి తులసి (హోలీ బేసిల్) గా పొరపడటం జరుగుతుంది. కాని రెండింటికీ రూపంలోనూ, రుచి, వాసనలోనూ తేడాలున్నాయి.

ఔషధంగా తులసి

తులసి మొక్క.

తులసి ఆకుల రసం ఆయుర్వేదంలోనూ, ఇంటి వైద్యం చిట్కాలలోనూ విస్తృతంగా వాడుతారు. జలుబు, తలనొప్పి, పొట్టకు సంబంధించిన వ్యాధులు, వాపులు, గుండె జబ్బులు, విషాహారాలు, మలేరియా వంటి చాలా రకాల రుగ్మతలను నయం చేయడానికి తులసి వాడుతారు.[1]

కొన్ని ఉపయోగాలు
  • తులసి ఆకులకు ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ ఆకులు నాడులకు టానిక్‌లాగా, జ్ఞాపకశక్తిని పెంపొందించేవిగా పనిచేస్తాయి.
  • తులసి ఆకుల్ని పలురకాల జ్వరాల్లో ఉపశమనానికి ఉపయోగించుకోవచ్చు. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ జ్వరం వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు లేత తులసి ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించి తాగితే ఈ రకం జ్వరాల నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. జ్వరం మరీ తీవ్రంగా ఉంటే తులసి ఆకులనూ, యాలకుల పొడినీ కలిపి అరలీటరు నీళ్లలో మరిగించి కషాయం తయారు చేయాలి. అందులో చక్కెర, పాలు కలిపి తాగితే జ్వర తీవ్రత తగ్గుతుంది. తులసి ఆకుల్ని మెత్తగా నూరి నీటిలో కలుపుకుని రెండుమూడు గంటలకోసారి తాగొచ్చు.
  • పలురకాల ఆయుర్వేద దగ్గు మందుల్లో తులసిని తప్పకుండా కలుపుతారు. బ్రాంకైటిస్‌, ఆస్థమాల్లో కఫాన్ని తొలగించటంలో తోడ్పడుతుంది. తులసి ఆకుల్ని నోట్లో పెట్టుకుని నమలటం వల్ల జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • తులసి ఆకులతో మరిగించిన నీళ్లను తాగితే గొంతులో గరగర నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ నీళ్లతో నోటిని పుక్కిలించినా మంచి ప్రయోజనం కనిపిస్తుంది.
  • చిన్నపిల్లల్లో సర్వసాధారణంగా కనిపించే దగ్గు, జలుబు, జ్వరం, డయేరియా, వాంతులు వంటి సమస్యలకు తులసి ఆకుల రసాన్ని తాగిస్తే మంచి ఉపశమనం కనిపిస్తుంది.
  • ప్రతిరోజు 5 లేదా 6 ఆకులు, మిరియాలు, ధనియాలు కలిపి నూరి తింటే వాంతులు, దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. నులిపురుగులు నశిస్తాయి.
  • ఎండిన తులసి ఆకులను ధాన్యం నిలవ చేసిన చోట్ల ఉండుతారు - కీటకాలను దూరంగా ఉంచడం కోసం. ఆకుల రసం (పసరు), ఎండిన ఆకుల పొడి, మరగించిన నీరు, హెర్బల్ టీ, నేతిలో మరగ పెట్టడం - ఇలా తులసిని చాలా విధాలుగా తీసుకోవచ్చును. ఇటీవల అధ్యయనాలలోని ఫలితాల ప్రకారం చాలా నొప్పి నివారక పదార్ధాలలాగా తులసి ఒక cox-2 inhibitor కావచ్చును. ఇందుకు కారణం తులసిలో అధిక మోతాదులో ఉన్న యూజినాల్' (Eugenol) (1-హైడ్రాక్సీ-2-మీథాక్సీ-4-అల్లైల్ బెంజీన్).[2][3] ఇంకా ఇతర అధ్యనాలలో తులసికి రక్తంలో చక్కెర మోతాదును తగ్గించగలిగే శక్తి తులసికి ఉంది. కనుక డయాబెటిస్ (చక్కెర వ్యాధి) వైద్యంలో కూడా తులసి పనికొస్తుంది.[4]
  • రక్తంలో కోలెస్టరాల్ను తగ్గించడానికీ, 'యాంటీ ఆక్సిడెంట్' గుణాల వలన బ్లడ్ షుగర్ తగ్గించడానికీ కూడా పనికొచ్చే పదార్ధాలు తులసిలో ఉన్నాయని మరి కొన్ని పరిశోధనలలో తేలింది.[5]
  • 'రేడియేషన్' కు గురైనందువలన కలిగే విషమ పరిస్థితి నుండి రక్షణకు కూడా తులసి ఉపయోగ పడవచ్చునని కొన్ని అధ్యయనాలు సూచించాయి.[6] అలాగే కంటి శుక్లాల సమస్యకు కూడా.[7]
  • రెండు స్పూనుల తులసి రసాన్ని కొద్దిగా తేనె కలిపి తాగితే పైత్యం తగ్గుతుంది.
  • మూత్ర విసర్జన సమయంలో మంటతో బాధపడేవారు తులసి ఆకులను దంచి, ఆ రసానికి కొద్దిగా పాలు, చక్కెర కలిపి తాగడం వలన ఉపశమనం దొరుకుతుంది.
  • తులసి ఆకులను నూరి మొఖానికి రాసుకుంటే మచ్చలు, మరకలు పోయి ముఖం అందంగా కాంతివంతంగా మారుతుంది.
  • 10 గ్రాములు తులసి ఆకులు రసాన్ని, 20-30 గ్రాముల తాజా పెరుగు లేక 2-3 స్పూన్లు తేనెలో కలిపి తినడం వలన క్యాన్సర్ నయం అయ్యే అవకాశం ఉంది.
  • ప్రతి రోజు రెండుసార్లు 12 తులసి ఆకులను తినడం వలన రక్త శుద్ధి జరుగుతుంది, ఒత్తిడి తగ్గి మనసు ఉత్తేజితం అవుతుంది.
  • తులసి ఆకులను మజ్జిగతో కలిపి సేవిస్తే బరువు తగ్గుతారు.
  • తులసి ఆకులు తినడం వలన చెడు శ్వాస తగ్గుతుంది.

జలుబు, దగ్గు లాంటివి బాధిస్తున్నప్పుడు మాత్రల్ని వాడతాం. ఈసారి అలాంటి లక్షణాలు కనిపించినప్పుడు మాత్రల కన్నా.. కొన్ని తులసి ఆకుల్ని నమిలి చూడండి. వాటివల్ల జలుబు, దగ్గు మాత్రమే కాదు, మరికొన్ని సమస్యలూ అదుపులోకి వస్తాయి.

  • తులసి, తేనె కలిపి పరగడుపున తీసుకోవడం వల్ల కొన్ని పోషకాలు, విటమిన్లు పుష్కలంగా అందుతాయి. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఈ కాలంలో వచ్చే పలు ఇన్‌ఫెక్షన్లు దూరంగా ఉంటాయి. చిన్నారులకు తులసి అలవాటు చేయడం చాలా మంచిది.
  • ఈ కాలంలో జలుబు, దగ్గు ఎక్కువగా బాధిస్తాయి. అలాంటప్పుడు తులసి ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. రకరకాల వైరస్‌లూ దూరం అవుతాయి. ఇతర వ్యాధులు కూడా ఇబ్బంది పెట్టవు. జలుబు త్వరగా తగ్గుతుంది.
  • దగ్గుతో బాధపడుతున్నవారు తులసి ఆకులను మెత్తగా చేసి అందులో తేనె, కొద్దిగా మిరియాలపొడి కలిపి తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల రాత్రిళ్లు దగ్గు బాధించదు. తొందరగా అదుపులోకి వస్తుంది.
  • అలర్జీలు ఉన్నవారు తేనె, తులసి తీసుకుంటే చాలా మంచిది. ఇందులో యాంటీసెప్టిక్‌ గుణాలు అధికం. చర్మ సంబంధిత అలర్జీలు తగ్గుతాయి. తులసి ఆకుల రసాన్ని ముఖం రాయడం వలన ముఖం వెంటనే చల్లగా ఉంటుంది.
  • తులసి తినడం వల్ల వయసు పైబడుతున్న లక్షణాలు తగ్గుతాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు కొత్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. చర్మం యవ్వనంగా ఉండటానికి తోడ్పడతాయి.
  • తులసిని తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి. మూత్రంలో వ్యర్థాలను తొలగించే గుణం తులసిలో ఉంది. అలానే కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. గుండెకు రక్తప్రసరణ సక్రమంగా అవుతుంది. హృద్రోగాలూ దూరం అవుతాయి.
  • సబ్జా గింజల్లో శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు, పీచు పదార్థం సమృద్ధిగా ఉంటాయి. సబ్జా గింజలను నీళ్ళలో నానా బెట్టి, ఆ పానీయం తాగితే మహిళలకు ఫోలేట్, నియాసిన్, విటమిన్ ఇ వంటి పోషకాలు లభిస్తాయి. ఇవి వారికి ఎంతగానో అవసరం.[8]
  • తులసిలో విటమిన్ సి, జింక్ పుష్కలంగా ఉన్నాయి. ఇది సహజ రోగనిరోధక శక్తిని పెంచే విధంగా పనిచేస్తుంది, అంటువ్యాధులను దూరంగా ఉంచుతుంది. ఇందులో అపారమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుండి మనలను రక్షిస్తాయి. తులసి ఆకుల సారం T సహాయక కణాలు, సహజ కిల్లర్ కణాల కార్యకలాపాలను పెంచుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
  • తులసి రక్తంలో లిపిడ్ కంటెంట్‌ను తగ్గించడం, ఇస్కీమియా, స్ట్రోక్‌లను అణచివేయడం, రక్తపోటును తగ్గించడం, అధిక యాంటీఆక్సిడెంట్ లక్షణాల కారణంగా హృదయ సంబంధ వ్యాధుల చికిత్స, నివారణపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
  • తులసి శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది, మూత్రవిసర్జన లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గిస్తుంది, ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణం. యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడం గౌట్‌తో బాధపడుతున్న రోగులకు కూడా ఉపశమనం కలిగిస్తుంది.[9]

పురాణాలలో తులసి

తులసిని గురించి హిందూమతంలో ఎన్నో కథలు, నమ్మకాలు, ఆచారాలు ఉన్నాయి. తులసి పవిత్రత గురించి బ్రహ్మవైవర్త పురాణంలో తులసి వరింపబడింది. పరశురాముడు తన గురువైన శివుడిని దుర్గాదేవి గణపతిని అన్ని పుష్పములతో అర్చించాడు కాని తులసితో అర్చించక పోయినా గణపతి ఆ పూజలు ఎందువలన స్వీకరించాడు అని నారదుడు నారాయణ మునిని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వృత్తాంతాన్ని చెబుతారు. ఒక్కప్పుడు యవ్వనము నందున్న తులసి నారాయణుడిని మనసులో తలచుకొనుచు వెళ్ళుచుండగా గంగానది తీరంలో చందనము రాసుకొని రత్నాలంకారములతో నారాయణుడి గురించి ధ్యానం చేసుకొనుచున్న గణపతి కనిపించెను. ఆయనను చూసి తులసి కామ పీడితురాలై గణపతితో వికారముగా గజముఖమును కలిగి లంబోదరముతో ఏకదంతము కలిగి నువ్వు ధ్యానం వదిలి పెట్టి బాహ్య ప్రపంచములోకి రమ్ము అని అంటుంది. దానికి సమాధానంగా, తల్లి శ్రీకృష్ణ పాదపంకజాలను స్మరిస్తున్న నన్ను ఏలా నా ధ్యానాన్ని భంగము చేయుచున్నావు, నీ తండ్రి ఎవరు, నీకు ఏ విఘ్నాలు కలగకుండ ఉండుగాక నీ విషయాలు తెలుపుము అని అంటాడు. అప్పుడు తులసి తాను ధర్మద్వజుడు కుమార్తెనని భర్త కోసం తపం ఆచరిస్తున్నానని గణపతిని భర్తగా అవ్వమని కోరుకొంటుంది. అప్పుడు గణపతి వివాహానికి నిరాకరించి పెళ్ళి దుఃఖం కలిగించునని శ్రీహరి సాన్నిధ్యము నుండి వేరు చేయునని, మోక్షమార్గానికి కవాతం కాదని వారిస్తాడు. తులసి దానికి కోపించి గణపతిని ఈ విధంగా శపిస్తుంది "నీభార్య అందరివద్ద ఉండుగాక". ఈ శాపవచనమును విన్న గణపతి ప్రతిశాపంగా "నువ్వు రాక్షస జన్మ ఎత్తుతావు, శరీరాన్ని పరిత్యజించిన తరువాత వృక్షానివి అవ్వుతావు" అంటాడు. ఆ ప్రతిశాపం విన్న తులసి రోదించి గణపతిని స్తుతించింది, అది విని గణపతి ప్రసన్నుడై

 
పుష్పాణాం సార భూతాం త్వం భవిష్యసి మనోరమే
కళాంశేన మహాభాగే స్వయం నారాయం ప్రియా
ప్రియత్వం త్వరదేవానాం శ్రీకృష్ణస్య విశేశతః
పూజా విముక్తిదా నౄణాం మయాభోగ్యాన నిత్యశః
ఇత్యుక్త్వాతాం సురశ్ర్ష్ఠో జగామ తపసేపునః
హరేరాధన నవ్యగ్రో బదరి సన్నిధింయయౌ

పుష్పములన్నింటికి ప్రధానదానవు అవుతావు, సమస్త దేవతలకు ప్రత్యేకంగా శ్రీకృష్ణపరమాత్మకు ప్రీతి పాత్రురాలు అవుతావు, నీచేత చేయబడిన పూజ మానవులకు మోక్షాన్ని ఇస్తుంది అని చెప్పి గణపతి బదరికా వనానికి వెళ్ళి పోతాడు. ఆ తరువాత తులసి శంఖచూడునకు అనే రాక్షసుడికి కుమార్తెగా జన్మిస్తుంది, శంఖచూడుడు శివుని చేత శూలంతో సంహరించబడ్డాక తులసి వృక్షరూపాన్ని పొందుతుంది. అందువల్ల గణపతి ప్రతి నిత్యం తులసితో పూజించరాదు.ఈ విషయాలు ధర్ముడు తనకు చెప్పెనని నారాయణ ముని నారదునితో చెప్పడంతో ఆ వృత్తాంతం ముగుస్తుంది. తులాభారం శ్రీ కృష్ణ తులాభారం కథలో -సత్యభామ బారువులకొలది బంగారం వేసినా సరితూగని కృష్ణుడు రుక్మిణి ఒక్క తులసి ఆకు వేయగానే తూగాడు. భగవంతుడు భక్తికి అందుతాడని ఈ గాథ సందేశం.

ఆచారాలలో తులసి

తులసికి సంబంధించిన ఆచారాలకు మౌలికమైన నమ్మకాలు:

  • తులసి విష్ణువునకు ప్రియమైన భక్తురాలు. విష్ణుపూజలో తులసిని విరివిగా వాడుతారు.
  • తులసి పూజ చేస్తే మాంగల్యం చిరకాలం నిలుస్తుంది.
  • తులసి ఉన్నచోట దుష్ట శక్తులు ప్రవేశించవు.
  • ఉదయాన్నే తులసిని దర్శించుకుంటే పాపాలు నశిస్తాయి.

కార్తీక శుక్ల ఏకాదశి నాటినుండి పౌర్ణమి వరకు తులసీ వివాహం ఉత్సవం జరుగుతుంది.

ఇతర మతాలలో

తులసి భర్త పేరు జలంధరుడు

తులసిని గురించిన సూక్తులు, ప్రార్ధనలు

ఇంటి ప్రాంగణములో తులసికోట
తులసీ స్తోత్రం నుండి

జగద్ధాత్రి నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే
యతో బ్రహ్మాదయో దేవాః సృష్టి స్థిత్యంత కారిణీ
నమస్తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియే శుభే
నమో మోక్షప్రదే దేవి నమ సంపత్ప్రదాయికే

తులసీ శ్రీ మహాలక్ష్మీర్విద్యా యశస్వినీ
ధర్మా ధర్మా నవా దేవీ దేవ దేవః మనఃప్రియా
లక్ష్మీప్రియసఖీ దేవీద్యౌర్భమిరచలాచలా
షోడశైతాని నామాని తులస్యాః కీర్తెయేన్నరః

లభతే సుతరాం భక్తిమంతే విష్ణుపదం భవేత్
తులసీ భూర్మహాలక్ష్మీః పద్మినీ శ్రీర్హరిప్రియా
తులసి శ్రీసఖి శుభే పాపహారిణి పుణ్యదే
నమస్తే నారదనుతే నారాయణ మనఃప్రియే

దేవతగా తులసి

దేవతామూర్తి రూపములో పూజించబడుతున్న తులసి

తులసి ఇంటి ప్రాంగణములో ఉండటం ఆ ఇంట్లో నివసించే హిందూ కుటుంబము యొక్క సాంప్రదాయ నిష్టను సూచిస్తుంది. వైష్ణవం వంటి అనేక సంప్రదాయాలలో తులసి మొక్క ఇంట్లో లేనిదే ఆ ఇళ్ళు అంసపూర్ణమని భావిస్తారు. ఇటువంటి కుటుంబాలలో తులసి ఒక ప్రత్యేకమైన స్థానములో తులసికోట కట్టించి అందులో నాటతారు. తులసికోటకు నలువైపులా దేవతాచిత్రాలు ఉండి నాలుగు వైపులా ప్రమిదలు లేదా దీపం పెట్టడానికి చిన్న గూళ్ళు ఉంటాయి. కొన్ని ఇళ్ళలో వరండాలో ఒక డజను దాకా తులసి మొక్కలు పెంచుతారు. ఒక చిన్నపాటి పొదలాగా పెరిగిన దీన్ని తులసీవనం లేదా తులసీ బృందావనం అని పిలుస్తారు.

తులసి చెక్కతో చేసిన జపమాల

గంధర్వతంత్రము ప్రకారం ఏకాగ్రత, నిష్టతో ధాన్యము చేసుకోవటానికి, పూజలు చేసుకోవటానికి అనుకూలమైన స్థలాల్లో, తులసి మొక్కలు గుబురుగా పెరిగిన ప్రదేశాలు కూడా ఉన్నవి. అటువంటి ఆలయాలలో ఒకటైన వారణాసిలోని తులసీ మానస్ మందిర్ లో ఇతర హిందూ దేవతలతో పాటు తులసి కూడా పూజలందుకొంటున్నది. వైష్ణవులు, విష్ణువుకు తులసి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా గౌరవించి నైవేద్యములో భాగముగా తులసి ఆకులను స్వీకరిస్తారు. వీళ్లు తులసి కాండముతో చేసిన పూసల దండలను ధరిస్తారు. తులసి దండల తయారీ, అనేక తీర్ధయాత్రా స్థలాల్లో కుటీర పరిశ్రమగా కొనసాగుతున్నది. గౌడియ వైష్ణవ సాంప్రదాయంలో తులసికి, బృందావన దేవత, బృందాదేవి లేదా వృందాదేవి అని కూడా మరోపేరు కలదు. అమృతం మాదిరిగానే తులసి కూడా క్షీరసాగరాన్ని మధించే సందర్భంలో ఉద్భవించినదని మన పురాణాలు చెబుతాయి. అందుకే భారతీయ సంస్కృతిలో తులసికి పవిత్ర స్థానం, ప్రధాన స్థానం ఉంది. * తులసిని ప్రత్యక్ష దైవంగా హిందువులు పూజిస్తారు. మనుషులకు అకాల మరణం కలగకుండా తులసి చెట్టు కాపాడుతుందనే నమ్మకం ఉంది. * హిందువులే కాకుండా ఇతర ప్రాంతాల, దేశవాసులు కూడా తులసికి ప్రాధాన్యత ఇస్తారు. ఉదాహరణకు హైషియన్ వర్తకులు తమ అంగళ్లలో దుష్టశక్తులు రాకుండా తులసి నీళ్లను జల్లుతారు. నవీన మెక్సికన్ గ్రామ ప్రాంతపు ప్రజలు తమ మనీపర్సుల్లో తులసి ఆకులను పెట్టుకుంటారు. ఇలాచేయడంవల్ల ధనలక్ష్మి కరుణిస్తుందని వారు నమ్ముతారు. మెక్సికన్ సంస్కృతిలో మహిళలు, తమ భర్తలు ఇతర మహిళల వెంట పడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో తమ రొమ్ముల మీద తులసి పొడిని జల్లుకోవటం ఆచారంగా ఉంది.

  • సర్ జె.సి.బోస్ తను చేసిన వృక్షశాస్త్ర అధ్యయనాల్లో మొక్కలు కూడా మనుషుల మాదిరిగానే స్పందిస్తాయని సాక్ష్యాధారాలతో సహా రుజువుచేసారు. హిందూ సంస్కృతిలో మొక్కలను పవిత్రంగా, తోటి జీవకోటిగా గౌరవించటం ఆచారంగా ఉంది. ఇదే ఉద్దేశ్యంతోనే తులసిని పవిత్రంగా పూజిస్తారు. ఇలాంటి అనేక అంశాలను దృష్టిలో ఉంచుకొని, ఆయుర్వేద గ్రంథాలు అవసరం లేకుండా మొక్క భాగాలను పీకడం, తుంచటం వంటివి చేయవద్దని హితవు చెబుతాయి. * తులసికి సంస్కృతంలో చాలా పేర్లున్నాయి. సురస (మంచి రసం కలిగినది), సులభ (సులభంగా లభించేది), విష్ణువల్లభ (విష్ణుమూర్తికి ఇష్టమైనది), అపేతరాక్షసి (రాక్షస బాధను తొలగించే సామర్థ్యం కలిగినది), పావని (పవిత్ర చేసేది), శూలఘ్నీ (శూలను లేదా నొప్పిని తగ్గించేది)... ఈ పేర్లన్నీ తులసి గుణ ధర్మాలను స్పష్టం చేస్తాయి. * తులసి మొక్కలో ఆకులకు, వేర్లకు, గింజలకు ఔషధ తత్వాలు ఉన్నాయి. * తులసి స్వరసాన్ని 10-20మి.లీ. (2-4 టీ స్పూన్లు) మోతాదులోనూ, వేరు కషాయాన్ని 50-100 మి.లీ. (అర కప్పు- ఒక కప్పు) మోతాదులోనూ, చూర్ణాన్ని 3-6 (గ్రాముల (అర టీ స్పూన్- టీ స్పూన్) మోతాదులోనూ వాడాలి. గృహ చికిత్సలు ఆంత్రకృమి--తులసి ఆకులను, గింజలను ఎండబెట్టి, పొడిచేసి అర చెంచాడు మోతాదుగా చెంచాడు తేనెతో కలిపి తీసుకోవాలి. అజీర్ణం--తెల్ల తులసి వేరును, శొంఠిని నలగ్గొట్టి నీళ్లలో వేసి కషాయం కాచి తీసుకుంటే వెంటనే అజీర్ణం తగ్గుతుంది. గాయం, దెబ్బలు---గాయంమీద వాలిన ఈగలను, గాయం మీద పేరుకున్న ఈగల గుడ్లను తొలగించడానికి తులసి గింజలను, వెల్లుల్లి రెబ్బలను మెత్తగా నూరి లేపనం చేయాలి. వ్రణం--తులసి ఆకులు, ఉమ్మెత్తాకులు, నల్లతుమ్మ పట్ట... వీటిని దంచి నీళ్లలోవేసి కషాయం తయారుచేసి గాయాన్ని కడిగితే త్వరగా మానుతుంది. చెవి నొప్పి--తులసి గింజలతో తైలపాక విధానంలో తైలన్ని తయారుచేయాలి. (1 భాగం గింజల, 4 భాగాలు నువ్వుల నూనె, 16 భాగాలు నీళ్లు తీసుకొని కలిపి నీరంతా ఆవిరయ్యేవరకూ చిన్న మంటమీద మరిగిస్తే సిద్ధతైలం తయారవుతుంది) దీనిని కొద్దిగా వేడిచేసి చెవుల్లో డ్రాప్స్‌గా వేసుకుంటే చెవి నొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది. కంటి వ్యాధులు (కళ్లకలక)--తులసి ఆకుల రసాన్ని తేనెతో కలిపి కళ్లకు అంజనంగా(కాటుకగా) వాడితే కళ్లకలక తగ్గుతుంది. దగ్గు--కృష్ణ తులసి ఆకుల రసాన్ని 2 చెంచాలు మోతాదులో చెంచాడు తేనెతో కలిపి తీసుకుంటే కఫంతోకూడిన దగ్గు తగ్గుతుంది. చలి జ్వరం (మలేరియా)--తులసి ఆకుల రసం నాలుగు టీస్పూన్లూ, మిరియం పొడి పావు చెంచాడూ కలిపి తీసుకుంటే చలి జ్వరం దిగుతుంది. తలలో విషం చేరితే--కృష్ణ తులసి గింజల పొడిని ముక్కుపొడుము మాదిరిగా పీల్చితే తలలో సంచితమైన విష పదార్థాల తీవ్రత తగ్గుతుంది. ప్రసవానంతర నొప్పులు (మక్కల్ల శూల)--తులసి ఆకుల రసాన్ని చెంచాడు మోతాదులో పాత బెల్లం, ద్రాక్షతో తయారైన మద్యంతో (ద్రాక్షాసవంతో) కలిపి తీసుకుంటే ప్రసవానంతరం ఇబ్బందిపెట్టే నొప్పి తగ్గుతుంది. పిల్లల్లో కనిపించే దగ్గు, జలుబులు---తులసి ఆకులు, లవంగ మొగ్గలు, పొంగించిన వెలిగారం (టంకణం/ బొరాక్స్/ బోరిక్ పౌడర్)... వీటిని మూడింటిని సమసమ భాగాలు తీసుకొని మెత్తగా నూరి పావుచెంచాడు మోతాదులో ఇస్తే చిన్న పిల్లలకు వచ్చే జ్వరం, దగ్గు, ఉబ్బసం, కడుపు నొప్పి వంటివి తగ్గుతాయి. దద్దుర్లు--తులసి ఆకుల రసాన్ని స్థానికంగా ప్రయోగిస్తే దద్దుర్లు తగ్గుతాయి. మానసిక ఒత్తిడి--ఇటీవల జరిగిన అధ్యయనాల్లో తులసి ఎడాప్టోజెన్‌గాను, యాంటీస్ట్రెస్‌గా పనిచేస్తుందని తేలింది. ప్రతినిత్యం ఉదయసాయంకాలాలు 10 తులసీ దళాలను నమిలి తింటుంటే మానసిక ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. కాలేయ సమస్యలు--10-15 తులసి ఆకులను వేడి నీళ్లలో కడిగి ప్రతిరోజూ ఉదయం పూట తిని ఒక గ్లాసు వేడినీళ్లు తాగితే కాలేయం సమస్యల్లో హితకరంగా ఉంటుంది. చర్మవ్యాధులు--చర్మవ్యాధులు మొండిగా మారిపోయి ఇబ్బంది పెడుతున్నప్పుడు తులసి ఆకులను దంచి రసం పిండి 2-4 టీ స్పూన్ల మోతాదులో ప్రతినిత్యం ఉదయం పూట తీసుకోవాలి. దద్దుర్లు, గౌట్ నొప్పి--తులసి ఆకులను నిమ్మ రసంతో సహా నూరి దద్దుర్లు, గౌట్ వ్యాధివల్ల వచ్చే నొప్పి, చర్మవ్యాధి వంటి వాటిమీద బాహ్యంగా ప్రయోగిస్తే లాభప్రదంగా ఉంటుంది.

తులసి ఆకులను గుప్పెడు తీసుకొని నీళ్లకు వేసి మరిగించి కషాయం తయారుచేసి చిటికెడు సైంధవ లవణం కలిపి తీసుకుంటే అరుగుదల మెరుగవుతుంది. జిగట విరేచనాలు, గ్యాస్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. తులసి ఆకుల స్వరసం, సున్నం రాయి, ఆవునెయ్యి... వీటిని అన్నిటినీ కలిపి నూరి బాహ్యంగా ప్రయోగిస్తే చర్మవ్యాధుల్లో ఉపశమనం లభిస్తుంది. 20 గ్రాముల తులసి గింజల పొడికి 40గ్రాములు పటికబెల్లం పొడిని కలిపి మెత్తగా నూరి నిల్వచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గ్రాము మోతాదులో రోజువారీగా తీసుకుంటే దుర్భలత్వం దూరమవుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. చీటికి మాటికి జలుబులు చేయకుండా ఉంటాయి. తులసి గింజల చూర్ణాన్ని లేదా ముద్దను పావు టీస్పూన్ మోతాదులో కప్పు పాలకు కలిపి ఇస్తే పిల్లల్లో కడుపు ఉబ్బరింపు, పొట్ట నొప్పి వంటివి తగ్గుతాయి. జీర్ణక్రియ మెరుగవుతుంది. తులసి పూగుత్తిని నీడలో ఆరబెట్టి పొడిచేసి పావు చెంచాడు మోతాదులో తేనెతో కలిపి తీసుకుంటే శిరోవ్యాధుల్లో ఉపశమనంగా ఉంటాయి. తులసి గింజలను పొడిచేసి గోరువెచ్చని నీళ్లతో కలిపి ముఖంమీద లేపనం చేసుకుంటే సైనస్‌లోని ఒత్తిడి తగ్గి నొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది. తులసి ఆకుల రసాన్ని వేడి చేసి, గోరువెచ్చని స్థితిలో చెవుల్లో బిందువులుగా వేసుకుంటే చెవి నొప్పి తగ్గుతుంది. తులసి ఆకులను 5 చొప్పున ప్రతిరోజూ నీళ్లతో తీసుకుంటే ఆందోళన తగ్గి మనోశక్తి వికసిస్తుంది. తులసి ఆకులతో తయారుచేసుకున్న తైలాన్ని (1 భాగం తులసి ఆకులు, 4 భాగాలు నువ్వుల నూనె, 16 భాగాలు నీళ్లు తీసుకొని కలిపి నీరంతా ఆవిరయ్యేవరకూ చిన్న మంటమీద మరిగిస్తే సిద్ధతైలం తయారవుతుంది). ముక్కు రంధ్రాల్లో నస్యంగా వేసుకుంటుంటే ఎక్కువ కాలం నుంచి బాధించే మొండి తలనొప్పి దూరమవుతుంది. తులసి నూనెను తలకు రాసుకుంటే పేలు నశిస్తాయి. తులసితో చేసిన తైలాన్ని ముఖంమీద ప్రయోగించి రుద్దితే నల్లమచ్చలు క్రమంగా తగ్గిపోయి ముఖం తేటగా ప్రకాశిస్తుంది. తులసి ఆకులను, నల్లమిరియాలను మెత్తగా నూరి, ఉండచేసి పంటి కింద ఉంచుకుంటే దంతాల నొప్పి తగ్గుతుంది. తులసి ఆకుల పొడికి ఆవనూనె కలిపి చిగుళ్లను, దంతాలను శుభ్రపరచుకుంటే చిగుళ్లనుంచి చీముకారడం, నోటి దుర్వాసన వంటివి తగ్గుతాయి. తులసి కషాయాన్ని చందనం పేస్టుతో కలిపి నుదుటికి లేపనం చేసుకుంటే తల నొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే తులసి ఆకుల పొడిని చిటికెడు మోతాదులో ముక్కుపొడుం మాదిరిగా పీల్చాలి. తులసి ఆకులను (10-12), లవంగ మొగ్గలను (4), శొంఠి పొడిని (టీస్పూన్) కలిపి మెత్తని ముద్దగా నుదుటి మీద పట్టువేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో 20 తులసి ఆకులను తిని గ్లాసు నీళ్లు తాగుతుంటే శరీర దుర్గంధం తగ్గుతుంది. తులసి ఆకుల రసాన్ని గోరువెచ్చని నీళ్లకు కలిపి గొంతు తగిలేలా పుక్కిట పడితే గొంతులో అసౌకర్యం తగ్గుతుంది. తులసి ఆకుల రసం కలిపిన నీళ్లకు పసుపును, సైంధవ లవణాన్ని కలిపి పుక్కిట పడితే దంతాలు, చిగుళ్లు, నాలుక, గొంతులకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. తులసి మొక్క పంచాంగ చూర్ణాన్ని, కందగడ్డ చూర్ణాన్ని కలిపి నిల్వచేసుకోవాలి. దీనిని 250 మి.గ్రా. మోతాదులో తమలపాకు మధ్య పెట్టుకొని తింటే పురుషుల్లో పుంస్త్వశక్తి పెరుగుతుంది. తులసి ఆకుల రసాన్ని వైద్య పర్యవేక్షణలో కళ్లలో చుక్కలుగా వేసుకుంటుంటే రేచీకటిలో హితకరంగా ఉంటుంది. తులసి ఆకులను లేదా పూలగుత్తిని నలిపి వాసన చూస్తే సూక్ష్మక్రిములు నశించి జలుబునుంచి ఉపశమనం లభిస్తుంది. తులసి ఆకుల రసం, చిన్న ఏలక్కాయ గింజల పొడి, అల్లం రసాలను కలిపి తీసుకుంటే వాంతులు, వికారం వంటివి తగ్గుతాయి. డా. చిరుమామిళ్ల మురళీమనోహర్, ఎం.డి. ఆయుర్వేద

తులసి పూజ

పూజ కొరకు అలంకరించిన ఒక తులసి మొక్క. పక్కనే బాణాసంచా కాల్చటాన్ని కూడా చూడవచ్చు

ప్రతి సంవత్సరం కార్తీక శుక్ల ద్వాదశి (సాధారణంగా దీపావళికి రెండువారాల తర్వాత) రోజున తులసి మొక్కకు చెరుకు గడలతో పందిరి వేసి, ఆ పందిరికి మామిడి తోరణాలు కట్టి, తులసి మొక్కను పూలతో అందంగా అలంకరించి పూజ చేసే సంప్రదాయము భారతదేశములో ఉంది. దీపావళి ఉత్సవాలలో లాగే తులసి మొక్కచుట్టూ, ఇంటి చుట్టూ మట్టి ప్రమిదలో దీపాలు పెట్టి అలంకరిస్తారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఈ సందర్భంగా బాణాసంచా కూడా కాల్చుతారు. ఉత్తర భారతదేశములో, దక్షిణాన గౌడియ వైష్ణవ సముదాయాలలో ఆ రోజును తులసీ వివాహ్ లేదా తులసికి కృష్ణునితో శిలారూపములో వివాహము జరిగిన రోజుగా భావిస్తారు.

ఇవి కూడా చూడండి

విష్ణు తులసి
కర్పూర తులసి
రామ తులసి
వన తులసి
విభూది తులసి
తులసి ఆకుల నూనె
రుద్రజడ
సబ్జా

మూలాలు

  1. "వినాయకుడి పత్రిలతో కరోనా సంహారం!". web.archive.org. 2021-10-04. Archived from the original on 2021-10-04. Retrieved 2021-10-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. Indian J Exp Biol. 1999 Mar;37(3):248-52.
  3. Prakash P, Gupta N. Therapeutic uses of Ocimum sanctum Linn (Tulsi) with a note on eugenol and its pharmacological actions: a short review.
  4. Effect of Ocimum sanctum Leaf Powder on Blood Lipoproteins, Glycated Proteins and Total Amino Acids in Patients with Non-insulin-dependent Diabetes Mellitus. Journal of Nutritional & Environmental Medicine. V. RAI MSC, U. V. MANI MSC PHD FICN AND U. M. IYER MSC PHD. Volume 7, Number 2 / June 1, 1997. p. 113 - 118
  5. Evaluation of Hypoglycemic and Antioxidant Effect of Ocimum Sanctum,. Jyoti Sethi, Sushma Sood, Shashi Seth, and Anjana Talwar. Indian Journal of Clinical Biochemistry, 2004, 19 (2) 152-155.
  6. Devi, P. Uma; Ganasoundari, A.. Modulation of glutathione and antioxidant enzymes by Ocimum sanctum and its role in protection against radiation injury. Indian Journal of Experimental Biology, v.37, n.3, 1999. March,:262-268.
  7. Sharma, P; Kulshreshtha, S; Sharma, A L. Anti-cataract activity of Ocimum sanctum on experimental cataract. Indian Journal of Pharmacology, v.30, n.1, 1998:16-20
  8. https://telugu.samayam.com/lifestyle/health/sabja-seeds-health-benefits/articleshow/63355202.cms
  9. https://pharmeasy.in/blog/health-benefits-of-tulsi/
  10. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-09-29. Retrieved 2007-04-10.

వెలుపలి లంకెలు

తులసి మాత
తులసి ఉపయోగాలు
తులసి పెంపకం
ఇతరాలు