సమైక్యాంధ్ర ఉద్యమం
సమైక్యాంధ్ర ఉద్యమం,ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విభజించాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రజలు స్వచ్ఛందంగా చేపట్టిన ఉద్యమం
నేపధ్యం
[మార్చు]2009 డిసెంబరు 9న అప్పటి కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రారంభమైందని చేసిన ప్రకటన ఈ ఉద్యమ పుట్టుకకు కారణమైంది. దీనితో తెలంగాణా ప్రాంతాలలో సంబరాలు ప్రారంభం కాగా సీమాంధ్రలో భగ్గుమంది. మిన్నంటిన నిరసనల మధ్య అప్పటి కేంద్రప్రభుత్వం తన నిర్ణయాన్ని సమీక్షించి 2009 డిసెంబరు 23 న విభజన ప్రక్రియ పై అందరి అభిప్రాయాలను తీసుకుంటామని, అదే మంత్రిచేత మరొక ప్రకటన విడుదల చేయించింది.
తీవ్రత
[మార్చు]2010 నిరసనలు
[మార్చు]2010 జనవరిలో కృష్ణా జిల్లాలో ఉద్యమకారులు రైల్ రోకో, రహదారుల దిగ్భంధనం చేశారు. దక్షిణ మధ్య రైల్వే, విజయవాడ డివిజన్ లో దాదాపు 46 రైళ్ళు నిర్భంధానికి గురయ్యాయి. కానీ రైల్వే ఆస్తులకు ఎలాంటి నష్టం చేకూరలేదు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన పలువురు శాసనసభ్యులు ఈ నిరసన కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు.[1] సమైక్యాంధ్ర రాష్ట్రం కోసం తిరుపతిలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు.[2]
ఫిబ్రవరిలో తిరుపతిలో ఏర్పడిన సమైక్యాంధ్ర మెడికల్ జాయింట్ ఏక్షన్ కమిటీ ఆంధ్రరాష్ట్రాన్ని విడగొట్టి తన స్వంత రాష్ట్రమైన తమిళనాడుకు లబ్ధి చేకూర్చాలనేదే కేంద్ర మంత్రి పి. చిదంబరం ఆశయమని తీవ్ర ఆరోపణలు చేశారు[3].
సెప్టెంబరులో సమైక్యాంధ్ర అన్ని విశ్వవిద్యాలయాల ఐక్య కార్యాచరణ సమితి విశాఖపట్నం జిల్లా లోని రహదారులకు దిగ్భంధనం చేశారు. వరంగల్ జిల్లాకి చెందిన ఒక విద్యార్థి విశాఖ జిల్లాలోని ఒక బి.ఇడి కళాశాలలో చేరడానికి వెడితే స్థానికులు అతడిని తీవ్రంగా కొట్టారనే ఆరోపణలు చేయడంతో వీరు ఈ చర్యకు పూనుకున్నారు. తర్వాత ఈ విద్యార్థి చేసిన ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదని తేలింది. అసలు ఇతను క్లాసులలే వెళ్ళలేదనే విషయం స్పష్టమైంది. అయినా ఆ విద్యార్థి వరంగల్లో నిరసన దీక్షకు దిగడం, దీనికి స్థానిక తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు మద్దతు పలకడం అప్పటిలో తీవ్ర వివాదాస్పదమైంది.[4]
2013 నిరసనలు
[మార్చు]హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నదని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవహారాల పరిశీలకుడు దిగ్విజయ్ సింగ్ ప్రకటనతో ఈ ఉద్యమం ఒక్కసారిగా మరలా సీమాంధ్రలో రాజుకుంది.
సీమాంధ్ర ఉద్యోగుల నిరసనలతో సమైక్య ఉద్యమం పతాక స్థాయికి చేరింది. ఎన్జీఓల సమ్మె సకల జనుల సమ్మెగా మారింది. రోజులుగా జరుగుతున్న ఉద్యమం నిరవధిక సమ్మెగా రూపాంతరం చెందింది. ఆగస్టు 12, సోమవారం అర్ధరాత్రి నుంచే విద్యార్థి, ఉద్యోగసంఘాలతో పాటు మొత్తం 71 శాఖలకు సంబంధించిన 70 వేల మందికి పైగా ఉద్యోగులు సకలజనుల సమ్మె చేపట్టారు
ఆగస్టు 14, బుధవారం నాడు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సమైక్యాంధ్ర సింహాగర్జన బహిరంగ సభ విజయవంతమైంది. విద్యార్థి జేఏసీ సారథ్యం వహించిన ఈ సభకు వివిధ పార్టీలకు చెందిన నేతలు, అన్ని విభాగాల జెఎసి నేతలు, వివిధ ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.
సేవ్ ఆంధ్రప్రదేశ్
[మార్చు]ఏపి ఎన్జీఓల ఆధ్వర్యంలో 'సేవ్ ఆంధ్రప్రదేశ్' పేరుతో ఎల్బి స్టేడియంలో 2013 సెప్టెంబరు 7, శనివారం నిర్వహించిన భారీ బహిరంగ సభ జరిగింది. ఇది ఎటువంటి అవాంఛనీయ సంఘటనకు తావులేకుండా ఒక పక్క తెలంగాణ బంద్, మరో పక్క సమైక్యాంధ్ర బహిరంగ సభ ప్రశాంతంగా జరిగిపోయాయి. పోలీసులకు టెన్షన్ తగ్గింది. బహిరంగ సభ మూడు గంటల 20 నిమిషాల సేపు సాగింది. ఉదయం 10 గంటల నుంచి స్టేడియం దగ్గర సందడి మొదలైంది. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు సీమాంధ్ర జిల్లాల నుంచి వేల సంఖ్యలో ఉద్యోగులు తరలివచ్చారు. మహిళా ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
రాజకీయ అంశాల జోలికి వెళ్లకుండా సభను ముగించారు. ఇది అంతం కాదు ఆరంభమని ఏపి ఎన్జిఓ నేతలు ప్రకటించారు. విభజన ప్రకటన వెనక్కి తీసుకోవాలి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సికింద్రాబాద్‌లో మిలియన్ మార్చి నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రైవేట్ ఉద్యోగులు కూడా సభకు హాజరయ్యేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అయితే వారిని స్టేడియం లోపలకు అనుమతించలేదు. వారు బయటే ఉండి నిరసన తెలిపారు. సభ ముగిసేవరకు వారు బయటే ఉన్నారు. అనుకున్న సమయానికి సభను జనగణమనతో ముగించారు. సభ ముగిసినతరువాత ఆంధ్రకు బయలుదేరిన బస్సులపై దాడి జరిగిందని ఎపిఎన్జివో సమాఖ్య అధ్యక్షుడు అశోక్ బాబు ఆరోపించాడు.[5]
ఉద్యమ నేతృత్వం
[మార్చు]2013 ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు నేతృత్వం వహించాయి. రాష్ట్రరోడ్డురవాణా సంస్థ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనటంతో సీమాంధ్రలో ప్రభుత్వ బస్సులు తిరగలేదు.
కారణాలు
[మార్చు]ఆంధ్రప్రదేశ్ తన రాజధాని హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసే ప్రాంతంగా మాత్రమే ఉండిపోయింది. ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులన్నీ హైదరాబాద్‌లోనూ, దాని చుట్టుపక్కల ప్రదేశాలలోనే కేంద్రీకృత మయ్యాయి. అభివృద్ధిలో ఆంధ్ర ప్రాంతం తన న్యాయమైన వాటాను పొందలేకపోయింది. భెల్, ఐడిపి ఎల్, ఇసి ఐ ఎల్, మిధాని, ఎన్ ఎమ్ డిసి, డి ఆర్ డి ఓ తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నిటినీ హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రాంతానికి కనీసం ఒక్కటీ దక్కలేదు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యవసాయ పరిశోధనా సంస్థలను సైతం హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశారు. ఆంధ్ర ప్రాంతాన్ని విస్మరించారు. ఈ ధోరణి ఎంత విపరీతంగా పరిణమించిందనడానికి ఒక ఉదాహరణ. కోస్తాంధ్ర ప్రయోజనాల కోసం ఉద్దేశించిన తుపాను హెచ్చరికా కేంద్రం ఎన్ డిఎమ్ఎను సైతం హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశారు. ఎంత హాస్యాస్పదమైన విషయమిది! రాష్ట్రంలో మత్స్యరంగానికి నెలవు కోస్తాంధ్ర కాగా జాతీయ మత్స్యరంగ అభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. కోస్తాంధ్రలోని కృష్ణా -గోదావరి బేసిన్‌లో సహజ వాయువును ఉత్పత్తి చేస్తున్నారు. అయితే ఓ ఎన్ జిసి ప్రాంతీయ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రాంతంలో ఒక్క సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కూడా లేదు. రోగులు అమిత వ్యయభారంతో హైదరాబాద్‌కు రావలసి వస్తోంది. దాదాపు 25 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు లేదా విశ్వవిద్యాలయంతో సమానమైన ప్రతిపత్తి ఉన్న ఇతర ఉన్నత విద్యా సంస్థలు అన్నిటినీ హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశారు. ఆంధ్ర ప్రాంతానికి ఒక్క దాన్నీ ఇవ్వ లేదు. ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేసిన ఏకైక ఐ ఐటిని సైతం హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశారు. ఇటువంటి ఉదాహరణలు వందల సంఖ్యలో చెప్పగలను. ఆంధ్రప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నట్టయితే ఈ ప్రభుత్వరంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలలో కొన్నిటిని చాలాకాలం క్రితమే కోస్తాంధ్రలో ఏర్పాటుచేసి వుండే వారు కాదా? ఆంధ్రప్రాంతానికి చెందిన పారిశ్రామికవేత్తలు పలువురు తమ పరిశ్రమలను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశారు. సినిమా, మీడియా, ఆరోగ్యభద్రత, ఆతిథ్య రంగాలు కూడా హైదరాబాద్‌లోనే అభివృద్ధి చెందాయి. వాటిని ప్రమోట్ చేసింది ఆంధ్రప్రాంతానికి చెందిన వారే. హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కనుకనే అందరూ అక్కడే తమ వ్యాపారాలను నెలకొల్పి అభివృద్ధి చేసుకున్నారు. ఈ హైదరాబాద్ కేంద్రిత అభివృద్ధి చంద్రబాబునాయుడు హయాంలో పరాకాష్ఠకు చేరింది. ఆయన ప్రారంభించిన హైటెక్ సిటీ ఇప్పటికీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తుంది. దానిని మొదటనే విభజించి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాలలో కూడా ఏర్పాటు చేసి వుండవల్సింది.
ఆంధ్రప్రాంత యువజనులు కొంతమంది రాష్ట్ర విభజనను ఇందుకే వ్యతిరేకిస్తున్నారు.రాష్ట్ర విభజన జరిగితే తమకు ప్రైవేట్‌రంగంలో ఉపాధి అవకాశాలు, స్వయంఉపాధి అవకాశాలు తగ్గిపోతాయని భయపడుతున్నారు.ఉద్యోగాలకోసం హైదరాబాద్‌కు మినహా మరే నగరానికి వేళ్ళే అవకాశం లేదు. ఆంధ్రప్రాంతపు ప్రతి గ్రామంలోని ప్రతికుటుంబం నుంచి ఎవరో ఒకరు హైదరాబాద్‌లో స్థిరనివాసాన్ని ఏర్పరచుకుని ఉన్నారు. విభజనతో తాము నష్టపోతామని వారు భయపడుతున్నారు. ఈ విషయమై వారిలో నెలకొన్న భయాందోళనలను తొలగించాలి.విభజన మూలంగా తమకు తొలుత సమస్యలేర్పడినప్పటికీ దీర్ఘకాలంలో ఆంధ్రరాష్ట్రం వల్ల తమకు అధిక ప్రయోజనాలు సమకూరుతాయనే భరోసా వారికి కల్పించాలి. హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రుల భవిష్యత్తుకు ఎటువంటి ఢోకా ఉండదనే నమ్మకం కూడా వారిలో కల్పించాలి.
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Agitation affects transport services". The Hindu. 2010-01-06. Archived from the original on 2010-01-10. Retrieved 2013-07-12.
- ↑ "United Andhra Pradesh Movement: Suicide In Tirupati". News.fullhyderabad.com. 2010-01-25. Retrieved 2013-08-04.
- ↑ "Chidambaram accused of 'conspiracy'". The Hindu. 2010-02-08. Archived from the original on 2013-11-05. Retrieved 2013-07-12.
- ↑ "Student JAC holds up traffic". The Hindu. 2010-09-21. Archived from the original on 2010-09-24. Retrieved 2013-07-12.
- ↑ http://www.youtube.com/watch?v=Is2a7veWPqA#t=31 ఈటీవి2 వార్త