Jump to content

భారత రాష్ట్రపతి

వికీపీడియా నుండి
(రాష్ట్రపతి నుండి దారిమార్పు చెందింది)
భారత రాష్ట్రపతి
Bhārata kē Rāṣṭrapati
Logo of The President of India
f
Incumbent
ద్రౌపది ముర్ము

since 2022 జులై 25
రిపబ్లిక్ ఆఫ్ ఇండియా
భారత ప్రభుత్వ కార్యనిర్వాహక శాఖ
విధం
    • గౌరవనీయ రాష్ట్రపతి
      (భారతదేశంలోనే)[1]
    • హర్ ఎక్స్ లెన్సీ
      (Outside India)[1]
    • గౌరవనీయుడు
      (Within కామన్వెల్త్)
రకం
AbbreviationPOI
అధికారిక నివాసంరాష్ట్రపతి భవన్
స్థానంన్యూ ఢిల్లీ, ఢిల్లీ, భారతదేశం
నియామకంఎలక్టోరల్ కాలేజ్ ఆఫ్ ఇండియా
కాలవ్యవధి5 సంవత్సరాలు
పునరుద్ధరణపై పరిమితి లేదు
స్థిరమైన పరికరంభారత రాజ్యాంగం (ఆర్టికల్ 52)
అగ్రగామిభారత చక్రవర్తి
(అతని ప్రతినిధి భారత గవర్నరు జనరల్)
నిర్మాణం26 జనవరి 1950; 74 సంవత్సరాల క్రితం (1950-01-26)
మొదట చేపట్టినవ్యక్తిబాబూ రాజేంద్ర ప్రసాద్
ఉపభారత ఉపరాష్ట్రపతి
జీతం 5,00,000 (US$6,300) (per month)
60,00,000 (US$75,000) (annually)[2]

సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమైన భారతదేశానికి దేశాధినేత రాష్ట్రపతి (Rashtrapati / President). రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరుడు, సర్వ సైన్యాధ్యక్షుడు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి కార్యనిర్వాహక దేశాధినేత. శాసన విభాగమైన పార్లమెంటు ఉభయసభలను రాష్ట్రపతి సమావేశపరుస్తారు. ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రిని నియమిస్తారు. అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు. అయితే, వాస్తవానికి కార్యనిర్వాహక అధికారాలన్నీ ప్రభుత్వాధినేత ప్రధానమంత్రివే. ప్రధానమంత్రి సలహా మేరకే, రాష్ట్రపతి సంతకంతో ఉత్తర్వులు జారీ అవుతాయి. రాష్ట్రపతి పదవి అలంకార ప్రాయమైంది.

రాష్ట్రపతి దేశాధినేతగా 1950 జనవరి 26భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిననాటి నుండి గుర్తించబడింది. అప్పటి వరకు గవర్నర్ జనరల్ దేశాధినేతగా ఉండేవాడు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, భారతదేశానికి ఇద్దరు గవర్నర్ జనరల్ గా పనిచేసారు.

అర్హతలు

భారత రాష్ట్రపతిగా ఎన్నికయేందుకు క్రింద తెలిపిన అర్హతలు ఉండాలి.

  • భారత పౌరుడై ఉండాలి.
  • వయసు 35 ఏళ్ళు లేదా ఆ పైబడి ఉండాలి.
  • లోక్‌సభ సభ్యుడయేందుకు కావలసిన అర్హతలు ఉండాలి.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో గానీ, ఆ ప్రభుత్వాల నియంత్రణలోనున్న సంస్థలలో గాని సంపాదనగల స్థానం కలిగి ఉండకూడదు.

ఒక వ్యక్తి ఎన్నిసార్లు అయినా రాష్ట్రపతిగా ఎన్నిక కావచ్చు. రాష్ట్రపతిగా ఎన్నికవ్వబోయే వ్యక్తి, పార్లమెంటు ఉభయసభల్లోగాని, రాష్ట్ర శాసనసభల్లోగాని సభ్యుడిగా ఉండరాదు. ఒకవేళ అటువంటి సభ్యుడు రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తే వెంటనే సదరు సభల్లో సభ్యత్వం కోల్పోతారు.

రాష్ట్రపతి వేతనం పార్లమెంటు నిర్ణయిస్తుంది. పదవీకాలం ముగిసే వరకు రాష్ట్రపతి వేతనంలో కోత ఉండదు. అధికరణ 360 కింద ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో రాష్ట్రపతి వేతనంలో కోత విధించరాదు.

ఎన్నిక విధానం

రాష్ట్రపతిని కింది సభ్యులు గల ఎలెక్టోరల్ కాలేజి ఎన్నుకుంటుంది.

  • పార్లమెంటు రెండు సభలలో గల ఎన్నికైన సభ్యులు
  • కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరి శాసన సభలలో ఎన్నికైన సభ్యులు
  • రాష్ట్ర శాసన సభలలోని ఎన్నికైన సభ్యులు.
  • 2/3 వంతు సభ్యుల ఆధిక్యత ఉండాలి.

అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతిచే ప్రమాణ స్వీకారం చేయిస్తారు.[3]

ఏ కారణం చేతనైనా రాష్ట్రపతి పదవి ఖాళీ అయినపుడు, ఆరు నెలలలోగా కొత్త రాష్ట్రపతి పదవీ స్వీకారం జరగాలి. మొదట్లో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక ఎంపి లేదా ఎమ్మెల్యే ప్రతిపాదించి మరో ఎంపి లేదా ఎమ్మెల్యే బలపరిస్తే సరిపోయేది. 1974 లో జరిగిన రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రతిపాదించే వారి సంఖ్య, బలపరిచే వారి సంఖ్యను 10 కి పెంచారు. 1997 లో జరిగిన మరో సవరణ ప్రకారం ఈ సంఖ్యను 50 కి పెంచారు. రాష్ట్రపతి ఎన్నికల్లో నోటా (ఎవరికీ ఓటు వేయకపోవడం) అవకాశం లేదు. ఓటు వేసే వాళ్ళు కచ్చితంగా ఎవరినో ఒకరిని ఎన్నుకోవాల్సిందే. ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలట్ ఉండదు. సాధారణంగా రాజకీయ పార్టీలు తమ సభ్యులు ఓటింగ్ లో పాల్గొనేటపుడు ఫలానా వారికే ఓటు వేయాలని విప్ జారీ చేస్తాయి. కానీ రాష్ట్రపతి ఎన్నికకు మాత్రం విప్ జారీ చేయరు. ఒకసారి రాష్ట్రపతిగా ఎన్నికైనా కూడా ఎన్ని సార్లయినా తిరిగి ఆ పదవికి పోటీ చేయవచ్చు.[4]

ప్రస్తుత రాష్ట్రప‌తి ఎన్నిక

రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ పద‌వీ కాలం 2022 జూలై 24తో ముగియ‌నున్న నేపథ్యంలో, జూలై 25లోగా నూత‌న రాష్ట్రప‌తి ఎన్నిక పూర్తి కావాల్సి ఉంది. 2022 జూన్ 9న ఢిల్లీలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ రాజీవ్ కుమార్, భార‌త రాష్ట్రప‌తి ఎన్నిక‌ల షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు.[5]

దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూలు

రాష్ట్రపతి ఎన్నికకు 2022 జూన్ 9న కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ ‎కుమార్ షెడ్యూల్ ప్రకటించాడు. రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నిక నిర్వహిస్తున్నట్లు చీఫ్ ఎన్నికల కమిషనర్ తెలిపాడు.[6]

సంఖ్య ఎన్నికల ప్రకియ తేదీ వారం
1. ఎన్నికకు నోటిఫికేషన్ 2022 జూన్ 15 బుధవారం
2. నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ 2022 జూన్ 29 బుధవారం
3. నామినేషన్ల పరిశీలన 2022 జూన్ 30 గురువారం
4. నామినేషన్ల ఉపసంహ‍రణకు చివరి తేదీ 2022 జూలై 2 శనివారం
5. ఎన్నిక 2022 జూలై 18 సోమవారం
6. కౌంటింగ్ 2022 జూలై 21 గురువారం

ఎన్నిక ఫలితాలు

2022 భారత అధ్యక్ష ఎన్నికల ఫలితాలు[7][8]
అభ్యర్థి సంకీర్ణ వ్యక్తిగత

ఓట్లు

ఎలక్టోరల్

కాలేజీ ఓట్లు

%
ద్రౌపది ముర్ము ఎన్‌డీఏ 2,824 676,803 64.03
యశ్వంత్ సిన్హా ఉమ్మడి ప్రతిపక్షం 1,877 380,177 35.97
ఎన్నికల సరళి
చెల్లుబాటు ఓట్లు 4,701 1,056,980 98.89
ఖాళీ, చెల్లని ఓట్లు 53 15,397 1.11
మొత్తం 4,754 1,072,377 100
నమోదైన ఓటర్లు / పోలింగ్ శాతం 4,809 1,086,431 98.86

రాష్ట్రపతి పదవీకాలం

రాష్ట్రపతి ఐదేళ్ళు పదవిలో ఉంటారు. అయితే కింది పద్ధతుల ద్వారా రాష్ట్రపతి పదవీకాలం ముందే/తరువాత ముగియవచ్చు.

  • రాష్ట్రపతి తన రాజీనామాను ఉపరాష్ట్రపతికి సమర్పించినపుడు
  • రాజ్యాంగంలో సూచించిన విధంగా పార్లమెంటు అభిశంసన తీర్మానం చేసినపుడు
  • పదవీకాలం ముగిసిన తరువాత కూడా, వారసుడు పదవి చేపట్టే వరకు
  • తన రాజీనామాను ఉపరాష్ట్రపతికి సమర్పించిన విషయాన్ని లోక్‌సభ అధ్యక్షునికి తెలియజేసినపుడు

విధులు, అధికారాలు

ప్రభుత్వంలోని మూడు వ్యవస్థలకు సంబంధించి, రాష్ట్రపతికి కింది అధికారాలు ఉంటాయి. అయితే ఈ అధికారాలన్నీ అలంకారప్రాయమైనవే. దాదాపుగా అన్ని విధులూ, ప్రధానమంత్రి సలహా మేరకే జరుగుతాయి.

శాసనాధికారాలు

రాష్ట్రపతికి శాసన వ్యవస్థకు సంబంధించిన కింది అధికారాలు ఉంటాయి

  • పార్లమెంటు ఉభయ సభలను సమావేశపరుస్తారు, ముగిస్తారు, లోక్ సభను రద్దుచేస్తారు
  • ప్రతి సంవత్సరం ఉభయసభల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ప్రసంగం కూడా, కేంద్ర మంత్రివర్గం ఆమోదించినదే అయి ఉంటుంది
  • పార్లమెంటు ఆమోదించిన బిల్లులపై రాష్ట్రపతి సంతకం చేసాకే చట్టంగా మారుతాయి. ఏ బిల్లునైనా తిరిగి పరిశీలించవలసిందిగా వెనక్కు పంపవచ్చు. అయితే పార్లమెంటు మళ్ళీ ఆ బిల్లును సంతకం కొరకు పంపినపుడు, రాష్ట్రపతి తప్పనిసరిగా సంతకం చేయవలసి ఉంటుంది.
  • పార్లమెంటు సమావేశాలు జరగని సమయంలో చట్టాలు చెయ్యవలసి వస్తే, రాష్ట్రపతి సంతకంతో ఆర్డినెన్సును జారీ చెయ్యవచ్చు. అయితే తరువాత సమావేశాల్లో సదరు ఆర్డినెన్సును పార్లమెంటు ఆమోదించాలి.

కార్యనిర్వాహక అధికారాలు

రాజ్యాంగం ప్రకారం కార్యనిర్వాహక అధికారాలన్నీ రాష్ట్రపతివే. అవి:

న్యాయ వ్యవస్థ అధికారాలు

  • నేరస్తులకు క్షమాభిక్ష ప్రసాదించవచ్చు,శిక్షతగ్గించవచ్చు, శిక్షను మార్చవచ్చు.
  • ప్రజా ప్రయోజనకర విషయాల్లో అవసరమనిపిస్తే అత్యున్నత న్యాయస్థాన అభిప్రాయం తీసుకోవచ్చు. కానీ ఆ అభిప్రాయాన్ని పాటించవలసిన అవసరం రాష్ట్రపతికి లేదు.

అత్యవసర అధికారాలు

జాతీయ అత్యవసర పరిస్థితి

352వ ప్రకరణం ప్రకారం యుద్ధం, విదేశీ దురాక్రమణ, సాయుధ తిరుగుబాటు జరిగినప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తారు. ఇప్పటికి ఇది 3 సార్లు విధించబడింది

రాష్ట్రపతి పాలన

356వ అధికరణ ప్రకారం ఏదైన రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు దీనిని విధిస్తారు. ఇప్పటికి ఇది సుమారుగా 126 సార్లు విధించబడింది

ఆర్థిక అత్యవసరపరిస్థితి

360వ ప్రకరణం ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడినప్పుడు దీనిని విధిస్తారు. ఇప్పటికి ఇది ఒక్కసారి కూడా విధించబడలేదు.

మహాభియోగ తీర్మానం విధానం

రాష్ట్రపతి తొలగింపు ప్రక్రియను రాజ్యాంగంలో వివరించటం జరిగింది. ఈ విషయంలో పార్లమెంటు ఉభయ సభలకు సమాన అధికారములు ఉన్నాయి.

  • అభిశంసన ప్రతిపాదన పార్లమెంటులోని ఏదో ఒక సభలో ప్రవేశపెట్టాలి. ఈ తీర్మానం ప్రవేశపెట్టేందుకు కనీసం 14 రోజుల ముందు సభలోని కనీసం నాలుగోవంతు సభ్యుల మద్దతుతో కూడిన ఒక నోటీసును ఇవ్వాలి.
  • ఆ తీర్మానాన్ని సదరు సభ మొత్తం సభ్యులలో రెండింట మూడు వంతుల ఆధిక్యతతో ఆమోదించాలి
  • ఈ ప్రతిపాదనపై పార్లమెంటు లోని రెండో సభ దర్యాప్తు చేయడం కానీ, లేదా దర్యాప్తు చేయించడం కానీ చేస్తుంది. రాష్ట్రపతికి తన వాదనను వినిపించే అవకాశం ఉంటుంది.
  • ఈ దర్యాప్తు ముగిసిన తరువాత రెండో సభ కూడా, అభిశంసన ప్రతిపాదనను రెండింట మూడు వంతుల ఆధిక్యతతో ఆమోదిస్తే, అలా ఆమోదించిన తేదీన రాష్ట్రపతిని పదవి నుండి తొలగించినట్లే.

ఇంత వరకు ఏ రాష్ట్రపతి ఈ పద్ధతి ద్వారా తొలగించబడలేదు. తొలగించబడే రాష్ట్రపతి అనర్హతల గురించి రాజ్యాంగంలో వివరించలేదు.

స్వతంత్ర భారత గవర్నరు జనరల్‌ల జాబితా

సంఖ్య పేరు నుండి వరకు
01 లూయీ మౌంట్‌బాటెన్ ఆగష్టు 15, 1947 జూన్ 21, 1948
02 చక్రవర్తి రాజగోపాలాచారి జూన్ 21, 1948 జనవరి 26, 1950

భారత రాష్ట్రపతుల జాబితా

సంఖ్య పేరు నుండి వరకు
01 రాజేంద్ర ప్రసాద్ జనవరి 26, 1950 మే 13, 1962
02 డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ మే 13, 1962 మే 13, 1967
03 డా.జాకీర్ హుస్సేన్ మే 13, 1967 మే 3, 1969
* వరాహగిరి వేంకటగిరి మే 3, 1969 జూలై 20, 1969
* ఎం.హిదయతుల్లా జూలై 20, 1969 ఆగష్టు 24, 1969
04 వరాహగిరి వేంకటగిరి ఆగష్టు 24, 1969 ఆగష్టు 24, 1974
05 ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ఆగష్టు 24, 1974 ఫిబ్రవరి 11, 1977
* బి.డి.జట్టి ఫిబ్రవరి 11, 1977 జూలై 25, 1977
06 నీలం సంజీవరెడ్డి జూలై 25, 1977 జూలై 25, 1982
07 జ్ఞాని జైల్ సింగ్ జూలై 25, 1982 జూలై 25, 1987
08 ఆర్.వెంకటరామన్ జూలై 25, 1987 జూలై 25, 1992
09 డా.శంకర దయాళ్ శర్మ జూలై 25, 1992 జూలై 25, 1997
10 కె.ఆర్.నారాయణన్ జూలై 25, 1997 జూలై 25, 2002
11 డా.ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ జూలై 25, 2002 జూలై 25, 2007
12 ప్రతిభా పాటిల్ జూలై 25, 2007 జూలై 25, 2012
13 ప్రణబ్ ముఖర్జీ జూలై 25, 2012 జూలై 25, 2017
14 రామ్‌నాథ్‌ కోవింద్‌ జూలై 25, 2017 2022 జూలై 25
15 ద్రౌపది ముర్ము 2022 జూలై 25 నేటి వరకూ

గమనిక:* తాత్కాలిక

కొత్త‌ రాష్ట్ర‌ప‌తి

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం జూలై 24తో ముగిసింది. కొత్త రాష్ట్ర‌ప‌తి అభ్యర్థిగా ఎన్.డి.ఎ. కూటమి గిరిజన నేత, ఒడిశా రాష్ట్రమంత్రిగా, గవర్నరుగా, అలాగే జార్ఖండ్ రాష్ట గవర్నరుగా పనిచేసిన ద్రౌపది ముర్మును ప్రతిపాదించింది.భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ద్రౌపది ముర్ము సంయుక్త ప్రతిపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై 2,96,626 ఓట్ల తేడాతో గెలుపొందింది. నూతన రాష్ట్రపతిగా ఎన్నికైవ ద్రౌపది ముర్ము 2022 జూలై 25న భారతదేశ 15వ రాష్ట్రపతిగా భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.[9][10]

కొన్ని విశేషాలు

  • ఇప్పటి వరకు ఇద్దరు రాష్ట్రపతులు పదవిలో ఉండగా మరణించారు - జాకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్.
  • ఇప్పటి వరకు ఏ రాష్ట్రపతినీ అభిశంసించలేదు.
  • 2007 జూలై 25 న ప్రతిభా పాటిల్ ప్రమాణ స్వీకారం చెయ్యడంతో మొట్టమొదటి సారి ఓ మహిళ రాష్ట్రపతి పదవిని అధిష్టించినట్టయింది.
  • 1969లో జూలై 20 నుండి ఆగష్టు 24 వరకు భారత దేశానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఇద్దరూ లేరు. రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ మే 3 న మరణించగా, ఉపరాష్ట్రపతిగా ఉన్న వి.వి.గిరి తాత్కాలిక బాధ్యతలు చేపట్టాడు. అయితే రాష్ట్రపతిగా పోటీ చేయడానికై జూలై 20న వి.వి.గిరి రాజీనామా చేసాడు. దీనితో అత్యున్నత న్యాయస్థాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎం.హిదయతుల్లా తాత్కాలిక రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసాడు.
  • 1969లో రాష్ట్రపతి ఎన్నిక, చీలిక దిశగా సాగుతున్న కాంగ్రెసు పార్టీ అంతర్గత రాజకీయాల ఫలితంగా వివాదాస్పదమైంది. కాంగ్రెసు పార్టీ అధికారిక అభ్యర్థిగా పోటీ చేసిన నీలం సంజీవరెడ్డికి వ్యతిరేకంగా ఆత్మ ప్రబోధానుసారం ఓటు వెయ్యమని ఇందిరా గాంధీ తన పార్టీ వారిని ఆదేశించింది. పార్టీలో తన వ్యతిరేకుల ఆటకట్టించేందుకు ఇందిరా గాంధీ వేసిన ఎత్తు ఇది. ఫలితంగా ప్రతిపక్ష మద్దతు కూడా గల వి.వి.గిరి, సంజీవరెడ్డిని ఓడించి రాష్ట్రపతి అయ్యాడు. అనంతరం కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది.

వనరులు

మూలాలు

  1. 1.0 1.1 "President Approves New Protocol Practice". pib.gov.in. Archived from the original on 25 November 2021. Retrieved 27 November 2021.
  2. "President, Vice President, Governors' salaries hiked to Rs 5 lakh, Rs 4 lakh, Rs 3.5 lakh respectively". Times Now News. Indo-Asian News Service. 1 February 2018. Archived from the original on 2 February 2018.
  3. Eenadu (10 June 2022). "రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ ప్రత్యేకతలు మీకు తెలుసా..?". Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.
  4. "President Election: రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ ప్రత్యేకతలు మీకు తెలుసా..?". EENADU. Retrieved 2022-06-09.
  5. "రాష్ట్రపతి ఎన్నికల నగారా - Andhrajyothy". web.archive.org. 2022-06-10. Archived from the original on 2022-06-10. Retrieved 2022-06-10.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. Sakshi (9 June 2022). "రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల". Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.
  7. "While President-elect #DroupadiMurmu got a vote in all states, Opposition's Presidential candidate Yashwant Sinha drew a blank in Andhra Pradesh, Nagaland, & Sikkim". Twitter.com. Retrieved 26 July 2022.
  8. "Number Theory: Comparing Droupadi Murmu's win with her predecessors". Hindustan Times (in ఇంగ్లీష్). 2022-07-21. Retrieved 2022-07-25.
  9. https://www.presidentofindia.gov.in/Profile
  10. "Droupadi Murmu takes oath as 15th President of India". The Economic Times. 2022-07-25. ISSN 0013-0389. Retrieved 2024-08-01.