చక్రం (ఆంగ్లం: Wheel) మనిషి కనుగొన్న మొట్టమొదటి పరికరం. చక్రం అనేది ఒక అక్షం (axis) చుట్టూ తిరిగే గుండ్రటి పరికరం. రవాణా, ఎన్నోరకాల యంత్రాలలో చక్రాలు విరివిగా వాడబడుతున్నాయి. ఇరుసు (ఆక్సిల్) సహాయంతో చక్రం దొర్లడం వల్ల రవాణాలో ఘర్షణ లేదా రాపిడి తగ్గుతాయి.

కోణార్క దేవాలయంలో సూర్య భగవానుని రథచక్రం

నేపథ్యం

మార్చు

ఏదో ఒక యంత్రం లేదా మంత్రం మనల్ని చారిత్రక పూర్వం యుగంలోకి తీసుకెళ్ళిందనుకొందాం. నేటి జీవితంలో మనం అలవాటు పడ్డ ఎన్నో వస్తువులు అక్కడ లేక పోవటంతో బ్రతుకు దుర్భరంగా ఉంటుంది. తిండి, బట్ట, ఇల్లు ఎలా సంపాదించుకోవాలి? అన్నీ సమస్యలుగానే ఉంటాయి. కాళ్ళూ, చేతులూ, మెదడు తప్ప మన దగ్గర మరేమీ ఉండదు. వీటిని ఉపయోగించే మన అవసరాలను తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

మొదట ఏవో మొరటు ఆయుధాల్ని తయారుచేసి, అడవుల్లో వేటాడి జంతువుల్ని చంపాలి. రవాణా సౌకర్యాలు లేవు గనక మనం నివసించే గుహకు ఆ జంతువుల్ని ఎలా తీసుకువావాలో బుర్ర గోక్కోవాలి. అడవిలో వాటిని లాక్కు రావటం అసాథ్యం కాదు గానీ, శ్రమతో కూడుకున్న పనే. చెట్టు కొమ్మల మీద లేదా పొడుగాటి కొయ్య దిమ్మ మీద జంతువుల్ని పడవేసి లాగితే బాగుంటుందని ఎవరో ఒకరు అంటారు. ఇలా చేస్తే లాగటం సులువుగా ఉంటుంది. భూమి మీద రవాణాకు సంబంధించి ఇది మొట్టమొదటి వాహనం అవుతుంది.

మధ్య శిలాయుగం

మార్చు

ఇది సుమారు 15 వేల ఏళ్ళ నాటి పరిస్థితి. ఈ కాలాన్ని మధ్య శిలా యుగం అంటారు. పెద్ద పెద్ద బరువుల్ని భూమి మీద లాగటం కంటే స్లెడ్జి లాంటి సాధనం పై ఉంచి తీసుకెళ్ళడం ఎందుకు సులభంగా ఉంటుందో అప్పటి వాళ్ళకు తెలియదు. ఘర్షణే దీనికి కారణమని, రవాణాకు సంబంధించి మనకు సహజంగా ఎదురయ్యే అడ్డంకుల్లో ఇది ప్రధానమైనదనీ ఇప్పుడు మనకు తెలుసు.

చలనంలో ఒక వస్తువు మరో వస్తువుతో రాచుకుంటుంది. ఆప్పుడు ఏర్పడే నిరోధాన్నే ఘర్షణ అంటారు. వస్తువు తలం గరుకుగా ఉంటే, ఘర్షణ ఎక్కువగా ఉంటుంది. సంపూర్ణంగా నునుపుగా ఉండే తలం దాదాపు లేదనే చెప్పాలి. ప్రతి వస్తువు కొద్దో, గొప్పో ఘర్షణ కలిగి ఉంటుంది. మధ్య శిలాయుగంలో మానవుడు తన ఆహారాన్ని కొయ్య దిమ్మలపై ఉంచి లాగినపుడు, అసలు వస్తువు కంటే కొయ్య దిమ్మెలు కాస్త నునుపుగా ఉంటాయి. కాబట్టి ఘర్షణ తగ్గుతోందన్న మాట.

చక్రం పుట్టుక

మార్చు

మొదటి సారిగా వ్యవసాయం ప్రారంభించినప్పుడు స్లెడ్జిని విస్తృతంగా ఉపయోగించటం జరిగింది. కొన్నాళ్ల తరువాత రెండు కొయ్య దిమ్మలపై అడ్డంగా రెండు మూడు దిమ్మలను అమర్చి, చర్మం ముక్కలతో బిగించి కట్టిన సాధనం వాడుకలోకి వచ్చింది. శీతాకాలంలో మంచు పడే ప్రాంతాల్లో దీనిని రవాణా సాధనంగా వాడుతూ వచ్చారు. మంచు ప్రదేశం, అందులోనూ నీళ్ళు గడ్డ కట్టిన నది లేదా చెరువు చాలా నునుపు తలాన్ని కలిగి ఉండటమే దీనికి కారణము.

 
ఎద్దులబండి చక్రము

ఈ విషయాన్ని ప్రపంచ దేశాల్లో అనేక చోట్ల అనేక సార్లు కనుగొన్నారు. అదే కాలములోనో లేదా కొన్ని వందల సంవత్సరాల తరువాతనో మానవుడు మరో గొప్ప విషయాన్ని కనుగొన్నాడు. ఆహారం వండుకోవటానికి ఇంధనం కావాలనే ఉద్దేశంతో వృక్షాలను పడగొట్టే సందర్భంలో రెండు బోదెలపైన బరువైన రాతి బండ అకస్మాత్తుగా పడటం సంభవించి ఉండవచ్చు. బండను దూరంగా నెట్టి వేయాలని ప్రయత్నించినపుడు, బోదెలపై బండ సులభంగా దొర్లి పోవటాన్ని మానవుడు గమనించాడు. ఈ పద్ధతిలో బరువులను అవలీలగా తరలించవచ్చుననే ఆలోచన అప్పట్లో అతనికి తట్టింది.

ఈ పద్ధతిని ఆది మానవుడు విరివిగా వాడాడనడంలో సందేహం లేదు. దొర్లుతున్న కొయ్యలపై బరువులను తరలించేటప్పుడు కొయ్యలకీ, భూమికీ మధ్య రాపిడి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి జారుడు ఘర్షణ కంటే దొర్లుడు ఘర్షణ ఎప్పుడూ తక్కువే. దొర్లుడు పద్ధతిలో బరువులను తరలించటం చాలా కాలంగా జరుగుతోంది. ఈ పద్ధతి ఇప్పటికీ కొన్ని దేశాల్లో వాడుకలో ఉంది. కొందరు బరువును తోయటమో, లాగటమో చేస్తున్నప్పుడు మరికొందరు బరువు వెనక ఉండే కొయ్య దిమ్మలను తీసి ముందు పక్క పడవేస్తుంటారు. ఇలాంటి "సామాజిక" కార్యం చేసేటప్పుడు ఆదిమ మానవుల్లో ఒక రకమైన సంఘీభావ మనస్తత్వం పెంపొందింది.

ఇలాంటి దొర్లుడు రవాణా లేకుంటే పిరమిడ్లు లేదా బ్రిటన్ లోని స్టోన్ హెంజ్ లాంటి ప్రాచీన చిహ్నాల నిర్మాణం అసాధ్యంగా ఉండేది. ఉదాహరణకు సాలిస్ బరీ మైదానంలోని కట్టడాలకు సుమారు 150 మైళ్ళ దూరంలో ఉండే దక్షిణ వేల్స్ నుండి రాతిని తరలించారు. కొంతదూరం నీటి మార్గంగా తీసుకొని వచ్చినా, కొంత దూరమైనా దొర్లుడు దిమ్మల సాయంతో బరువులను రవాణా చేసి ఉండాలి.

కానీ ఈ పద్ధతి కూడా ఆదర్శమయినది కాదు. ఇక్కడ బరువుల కింది దిమ్మలను వెనక నుంచి ముందు వైపుకు ఎడతెరపి లేకుండా మారుస్తూనే ఉండాలి. ఇలా చేయటంలో శ్రమ ఎక్కువ. పని త్వరగా జరుగదు. మానవునికి సహజంగా ఉండే సోమరితనం వల్ల దీన్ని ఇంకా మెరుగు పరచాలనుకున్నాడు. కొయ్య దిమ్మలను ప్రక్క ప్రక్కన ఉంచి వాటిని కలిసి కట్టుగా బిగించాడు. దానికింద దొర్లటానికి వీలుగా ఉండే మరో దిమ్మను అడ్డాంగా ఉంచి, నాలుగు నిలువు చీలల సహాయంతో పక్కలకు కదలకుండా చేశాడు. ఈ ఏర్పాటును ఒక బండి లాగా వాడవచ్చు. దొర్లుతున్న దిమ్మకూ, దానిపైన ఉండే వేదికకూ మధ్య ఘర్షణ ఎక్కువగా ఉండటం ఇబ్బందిగా పరిణమించింది. కానీ ఈ పరికరాన్ని ఉపయోగించిన అనుభవం వృధా కాలేదు. ఎందుకంటే మానవుడు కనుగొన్న అనేక పరికరాల్లో అతి గొప్పదైన చక్రం ఈ సిద్ధాంతం ఆధారంగానే నిర్మించబడింది.

ఇది ఎలా జరిగింది? ఎప్పుడు? ఎక్కడ? ఇదమిత్థంగా చెప్పలేము. ఈ సాధనం లేకపోతే ప్రపంచంలోని సమస్త నాగరికతకు మనుగడే లేదు. విమానాలు ఎగరలేవు. చేతి గడియారం కాలాన్ని సూచించలేదు. కర్మాగారాలు పనిచేయలేవు. ఇలాంటి సాధనానికి రూపకల్పన చేసిన మన అనాగరిక, అర్థ నగ్న పూర్వీకుల అపారమైన మేధస్సును ఎంత పొగిడినా చాలదు.

చక్రాల ఆవిర్భావం

మార్చు
 
క్రీ.పూ. సిర్కా 2600, సుమేరియన్ నాగరికత నాటి ఉర్ పట్టణంలోని ఒనాగెర్ యుద్ధపు బండ్లు.
 
కుమ్మరి చక్రం; టర్కీలోని ఒక కుమ్మరి.

అసలు చక్రం అనే భావన ఎలా కలిగింది? తొలి నమూనా బండిని ఉపయోగించినప్పుడు దొర్లుడు దిమ్మ క్రమంగా అరిగిపోయి రెండు ప్రక్కలా ఏర్పడిన గుండ్రని పలకలను చూసినప్పుడో, కొయ్యదిమ్మలో ఏదైనా కర్ర అతుక్కుని ఇరుసులాగ ఏర్పడినప్పుడో, సాంకేతిక పరిజ్ఞానం కల ఎవడో మేధావి చేసిన ప్రయోగాల ఫలితంగానో, ఎలాగైతేనేం చక్రం ఆవిర్భవించింది. ప్రపంచ నాగరికతలో కీలక పాత్ర వహిస్తోంది. చాలాకాలం వరకు ఇదొక మొరటు వ్యవహారంగానే ఉండేది. ఒక చెట్టు దూలం నుంచి ఒక గుండ్రని పలకను తయారుచేయటం, ఇరుసు కోసం పలక మధ్యలో రంధ్రాన్ని తొలచటం- బహుశా ఇదీ తొలి చక్రం నమూనా. కానీ రంపం, రంధ్రాలు తొలిచే పరికరం, చాకు మొదలైనవి లేనిదే దీన్ని చేయటం అసాధ్యం. ఈ పనిని రాతి పనిముట్లు చేయలేవు. కనుక గనుల్లో ఖనిజాలను తవ్వడం, వాటిని పరిశుద్ధం చేసి లోహాలను వేరు చేయటం కనుగొన్న తరువాతనే చక్రం నిర్మించబడి ఉండాలి. స్విట్జర్లాండు, జర్మనీ దేశాల్లో ఆల్ఫ్స్ పర్వత ప్రాంతాల్లో 20 వేల సంవత్సరాల క్రితమే చక్రాలు పూన్చిన వాహనాలు ఉండేవని కొందరు పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ క్రీ.పూ. 4000 - 3500 కాలంలో మొట్టమొదటి చక్రాల బండ్లు సిరియా, సుమేరియా దేశాల్లో ఉండే వనటానికి విశ్వసనీయమైన సాక్ష్యాధారాలున్నాయి. చక్రం పురాతన సుమర్ (ఈ నాటి ఇరాక్) లో దాదాపు క్రీ.పూ. 5వ శతాబ్దంలో కుమ్మరి పనికై, కుండలు తయారు చేయడానికి మొదటగా వాడబడినదని అనుకుంటారు. ఇవి క్రీ.పూ 3000 నాటికి మెసపుటేమియాలో బహుళ ప్రచారంలో ఉంటూ, క్రీ.పూ 2500 నాటికి సింధు ప్రాంతాన్ని చేరాయి. క్రీ.పూ. 3వ శతాబ్దంలో వెల్లివిరిసిన సింధులోయ నాగరికతతో చక్రం వాడుక భారతదేశంలో ఆరంభమైనది . కాకేసస్‌కు ఉత్తరభాగంలో బయట పడిన సమాధుల ఆధారంగా క్రీ.పూ. 3700 సంవత్సరాలలో వాగన్లు (నాలుగు చక్రాలు), బండ్ల (రెండు చక్రాలు) తో సహా మనుషులను సమాధి చేసే వారని తెలుస్తుంది. ఇప్పటి పోలండు లో లభించిన సుమారుగా క్రీ.పూ. 3500 సంవత్సరాల క్రితంనాటి చిత్రాలను బట్టి వాగన్లను చిత్రించిన అతి పురాతనమైన చిత్రంగా బ్రోనోసైస్ పాట్‌ను పేర్కొంటారు.[1]

 
ఇరాన్‌ లోని ఒక మ్యూజియంలో భద్రపరచబడిన పురాతన చక్రం.

రథాల వాడుకను బట్టి చక్రాలు చైనాలో క్రీ.పూ. 1200 నుండి ఉన్నట్టు తెలుస్తుంది [2]. కొంతమంది పురాతత్వ శాస్త్రవేత్తల ప్రకారం చక్రాలు, ఆక్సిల్ ఐరోపాలోనే ఆవిర్భవించాయి.[3] చక్రాలు కలిగిన అతి ప్రాథమికమైన వాగనుగా "ట్రాగా న పూలి" అనబడే స్లెడ్జ్‌ని చెప్పుకొస్తారు. మానవజాతి వలసలు వెళ్ళడం ద్వారాను, ఇతర పరిచయాల ద్వారాను ఈ ఆవిష్కరణ కాస్పియన్, నల్ల సముద్రాల ప్రాంతాల వారికి తెలిసింది. అక్కడినుండి క్రీ.పూ 4వ శతాబ్దంలో మెసపొటేమియాకు చేరింది.

ఆకులు గల చక్రం

మార్చు

అనేక శతాబ్దాలు గడిచినా ఈజిప్టు దేశానికి చక్రం సంగతి తెలీక పోవటం ఆశ్చర్యమే. కాని ఆ దేశంలోనే చక్రం నమూనా ఎంతగానో మెరుగు పరచబదింది. పలకతో చేసిన చక్రమైతె, పెద్ద బరువులను వేసినప్పుడు తొందరగా పగులుతుంది. దీనికంటే తేలిగగానూ, దృఢంగానూ ఉండే ఆకుల చక్రాన్ని క్రీ.పూ 1800 ప్రాంతంలో ఈజిప్టులో నిర్మించారు చక్రం మధ్య లోని దిమ్మ చుట్టూ ఉండే చట్రం, ఈ రెండిటినీ కలిపే ఆకులు ఉండటం వల్ల బరువు అన్ని భాగాలకూ సమానంగా పంచబదుతుంది. ఈజిప్టు దేశస్థులు చేసిన మరో మార్పు ఏమిటంటే ఇరుసుకు పైన వేదికకు బదులు విశాలమైన పెట్టెను వాడటం. రెండు చక్రాలు కలిగిన ఈ నమూనాను గ్రీకులు, రోమనులు యుద్ధాల్లో రథం గానూ, పందాల లోనూ ఉపయోగించారు. వీటిని లాగటానికి తొలి దశలో ఎద్దులకు శిక్షణ ఇచ్చారు. వేగంగా పరిగెత్త గలిగే గుర్రాలు కాలక్రమేణా వీటి స్థాన్నాన్ని ఆక్రమించాయి. కొంత కాలం తర్వాత రోమనులు నాలుగు చక్రాల వాహనాన్ని నిర్మించారు. దీన్ని ఇటూ, అటూ తిప్పడానికి వీలుగా ఒక కడ్డీ, దీనితో బాటు తిరిగే ముందు చక్రాల ఇరుసు కొత్త నమూనాలో చేర్చబడ్డాయి. వీటి మూలంగా వాహనాన్ని నడపడం సులభమైంది.

వాడుక , పనితనం

మార్చు

చక్రం, ఇరుసు ఒక సరళ యంత్రం (సింపుల్ మషీన్). చక్రాలు ఇరుసు సహాయంతో ఉపయోగించబడినపుడు కొన్ని సార్లు చక్రం ఇరుసు మీద ఇతర శక్తుల సహాయంతో తిరుగుతుంది లేదా చక్రం ఇరుసుని తిప్పుతుంది.

ప్రకృతిలో చక్రాలు

మార్చు
  • ప్రకృతిలో వివిధ పదార్ధాలు తయారైన దగ్గరనుండి వాటి వినియోగం, తిరిగి వాటి జన్మస్థానన్ని చేరడాన్ని చక్రాలుగా పేర్కొంటారు. ఉదాహరణకు నీటి చక్రం, ఆమ్లజని చక్రం, నత్రజని చక్రం మొదలైనవి.
  • కొన్ని పరాన్న జీవులు జీవిత పరిణామం వ్యాధికారకాలన్నింటినీ కూడా జీవితచక్రం అంటారు. ఉదా: టీనియా.
  • కంటికి కనిపించే పరిమాణంలో ప్రకృతిలో ఎలాంటి చక్రాలూ లేవు. కాని సూక్ష్మపరిమాణంలో ఎ.టి.పి.సింథేస్ అనే ఎంజైమ్‌లోనూ,[4] బాక్టీరియాల ఫ్లాజెల్లంలోనూ ఉన్నాయి. .[5]

సంస్కృతిలో

మార్చు

చక్రాల సహాయంతో నడిచేవి

మార్చు

వాహనాలు

మార్చు
 
బండి చక్రం.
 
ఆధునిక మోటారు సైకిలు చక్రం.
  1. బండి
  2. సైకిలు
  3. కారు
  4. రిక్షా
  5. లారీ

చిహ్నాలుగా చక్రాలు

మార్చు
 
భారత జాతీయ పతాకంలో అశోక చక్రం.

చక్రం అనే పదం సాంప్రదాయపరంగా మతపరంగా జీవిత చక్రం లేదా కాలచక్రం వంటి విషయాలను వ్యక్తీకరించడంలో విరివిగా ఉపయోగించబడుతుంది. చక్రం భారత జాతీయ పతాకంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ చక్రం ధర్మానికి చిహ్నం.

యోగ సాధనా చక్రాలు

మార్చు

యొగ సాధనలో చక్రము అనగా కున్డలిని ఉద్దీపన స్థానములు . దీనినే కుండలిని స్థానములు అని కూడా అంటారు.మానవ శరీరమునందు మూలాధారము నుండి స్వాధిష్తానము వరకు 7 చక్ర స్థానములు గలవు.యొగ సాధనము ద్వారా ఈ కుండలిని చక్ర స్థానములను ఉద్దీపనము చేయవఛును. డా.ఆకొండి రామ్.

ఇవి కూడా చూడండి

మార్చు

చక్రం - భాషా విశేషాలు

మార్చు

చక్రం అనే పదం ప్రోటో-ఇండో-యూరోపియన్ భాష నుండి ఉద్భవించింది. ఈ భాషలో *kwel- అనగా తిరగడం లేదా కదలడం అని అర్థం. దీని నుండి ఉద్భవించిన *kwekwlo-,[6] అనే పదం సంస్కృతంలో చక్ర, పర్షియన్ భాషలోని చర్ఖ్ పదాలకు మూలంగా గుర్తించబడింది.[7]

చక్రము అనే పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[8] చక్రము (chakramu) సంస్కృతం n. అనగా A wheel. A discuss or sharp-edged plate of steel, hurled at a foe like a quoit: the thunderbolt or weapon of Vishṇu. A realm, region. రాష్ట్రము. A figure, diagram or sign in astrology. The name of a coin. The bird called చక్రవాకము. A region or division of the body. చక్రధరుడు or చక్రపాణి Vishṇu. కటి or కటిచక్రము the loins, the region of the lions. అష్టకోణచక్రము an octagon. చక్రవర్తి chakra-varti.. n. An emperor or sovereign. రారాజు, సార్వభౌముడు. చక్రవర్తిని chakra-vartini. n. An empress. సార్వభౌమురాలు. చక్రవాకము chakra-vākamu. n. The Brahminy-duck or Ruddy Casarca rotila (F.B.I.) జక్కవపక్షి. The poetical swan, always described as being in pairs, to which poets liken fair breasts. చక్రవాళము chakravāḷamu. n. A range of mountains supposed to encircle the earth. చుట్టుకొండ. చక్రవృద్ధి chakra-vṛiddhi. n. Compound interest వడ్డికివడ్డి. చక్రాంకనము or చక్రాంకితములు or చక్రాంకములు chakrānkanamu. n. Marks branded on the front of the shoulders, representing the disc and shell of Vishṇu. (It is a rite similar to absolution.) చక్రాంగము chakrāngamu. n. A swan. హంస. చక్రాంగి a female swan. చక్రి chakri. n. The discus-wielder, i.e., Vishṇu విష్ణువు. A snake, because rolled in a ring. A potter, because using a wheel.

మూలాలు

మార్చు
  1. Waza z Bronocic (in Polish)
  2. Dyer, Gwynne, War: the new edition, p. 159: Vintage Canada Edition, Randomhouse of Canada, Toronto, ON
  3. "Ojczyzna wozu: Europa czy Bliski Wschód (in Polish), Wiedza i Życie, 8/1996". Archived from the original on 2020-02-14. Retrieved 2007-10-25.
  4. Noji, H.; Yasuda, R.; Yoshida, M.; Kinosita, K. (1997). "Direct observation of the rotation of F1-ATPase". Nature. 386 (6622): 299–302.
  5. Berg, H.C.; Anderson R.A. (1973). "Bacteria Swim by Rotating their Flagellar Filaments". Nature. 245 (5425): 380–382.
  6. "wheel". Online Etymology Dictionary.
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2005-12-30. Retrieved 2007-10-23.
  8. బ్రౌన్ నిఘంటువు ప్రకారం చక్రము పదప్రయోగాలు.[permanent dead link]